Rabi Crop రబీకి సాగునీరివ్వలేం..
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:07 AM
No Irrigation Water for Rabi Crop వెంగళరాయసాగర్ (వీఆర్‌ఎస్) ద్వారా రబీ పంటలకు సాగునీరు సరఫరా చేయలేమని ప్రాజెక్టు ఈఈ డీఎస్ ప్రదీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘సాగునీరిస్తారో.. లేదో?’ అన్న కథనంపై ఆయన స్పందించారు.
మక్కువ రూరల్, నవంబరు4(ఆంధ్రజ్యోతి): వెంగళరాయసాగర్ (వీఆర్‌ఎస్) ద్వారా రబీ పంటలకు సాగునీరు సరఫరా చేయలేమని ప్రాజెక్టు ఈఈ డీఎస్ ప్రదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘సాగునీరిస్తారో.. లేదో?’ అన్న కథనంపై ఆయన స్పందించారు. వీఆర్‌ఎస్ ద్వారా ఖరీఫ్ పంటల వరకే సాగునీరందించగలమని పేర్కొ న్నారు. రెండు పంటలకు నీరిచ్చే సామర్థ్యం ప్రాజెక్టుకు లేదన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.63.50కోట్ల వరకు జైకా నిధులు మంజూరు కాగా రూ.10.07కోట్లతో 22శాతం పనులు పూర్తిచేశామని వెల్లడించారు. కాలువల్లో 38.545 కిలోమీటర్లకు గాను 700 మీటర్ల్ల వరకు లైనింగ్ పనులు పూర్తి చేశామని తెలిపారు. 2028, జూలై లోగా జైకా నిధులతో పనులు పూర్తి చేస్తే మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల్లో 24,700 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. కాగా ఈఈ ప్రకటనతో మండలంలో రైతుల ఆశలకు తెరపడింది. రబీలో ఆరుతడి పంటలపై దృష్టిసారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.