No industry in green fields పచ్చని పొలాల్లో పరిశ్రమ వద్దు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:58 PM
No industry in green fields పచ్చని పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి జీవనోపాధిని నాశనం చేయొద్దు.. పర్యావరణాన్ని పాడుచేయొద్దు.. పొలాల్లో ఉక్కు ఆరోగ్యానికి ముప్పు.. అంటూ గుర్ల మండల రైతులు ఉవ్వెత్తున నినాదాలు చేశారు.
పచ్చని పొలాల్లో పరిశ్రమ వద్దు
కదంతొక్కిన గుర్ల రైతులు
కలెక్టరేట్ వద్ద భారీగా ఆందోళన
విజయనగరం కలెక్టరేట్ డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
పచ్చని పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి జీవనోపాధిని నాశనం చేయొద్దు.. పర్యావరణాన్ని పాడుచేయొద్దు.. పొలాల్లో ఉక్కు ఆరోగ్యానికి ముప్పు.. అంటూ గుర్ల మండల రైతులు ఉవ్వెత్తున నినాదాలు చేశారు. వారి అరుపులు కేకలతో కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. గుర్ల మండలంలో ఏర్పాటు చేయనున్న స్టీల్‌ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల రైతులు సోమవారం ఉదయం కలెక్టరేట్‌కు భారీగా చేరుకున్నారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. గుర్ల మండలం దమరసింగి, వల్లాపురం, బెల్లానపేట, మనిప్యూరిపేట, ఎస్‌ఎస్‌ఆర్ పేట, కెల్ల తదితర గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకూ గేటు వద్ద నిరసన తెలిపారు. అంతకుముందు ఎన్‌టీఆర్ జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ తోటపల్లి రిజర్వాయర్ వచ్చిన తరువాత తమ భూముల్లో పంటలు విస్తరించాయని, ప్రతి కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తోందని చెప్పారు. రెండు పంటలు సాగు చేస్తున్నామని, అటువంటి పొలాల్లో ప్రైవేటు స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకోవడం సరికాదన్నారు. పరిశ్రమ వస్తే తమ భూములు పోవడంతో పాటు ఉపాధి కూడా పూర్తిగా దెబ్బతింటుందన్నారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించి సర్వేలకు సిద్ధపడడం బాగాలేదన్నారు. ఉక్కు పరిశ్రమను వేరే చోటకు తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్‌వో మురళికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు రాంబాబు, మీసాలు ప్రసాద్, మందపాటి కృష్ణమూర్తిరాజు, తమ్మినేని సూర్యనారయణ తదితరులు పాల్గొన్నారు.
============