Share News

గ్రూపులు వద్దు.. కలిసికట్టుగా పనిచేయండి

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:25 AM

అలకలు వీడి పార్టీ కోసం ప్రతీ ఒక్క కార్యకర్త పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.

 గ్రూపులు వద్దు.. కలిసికట్టుగా పనిచేయండి
కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్‌

టీడీపీలో వ్యక్తులు శాశ్వతం కాదు

2029లో మళ్లీ అధికారంలోకి రావాలి

కరుడుగట్టిన కార్యకర్తలే నాకు స్ఫూర్తి

క్యాడర్‌కు మంత్రి నారా లోకేశ్‌ దిశానిర్దేశం

పార్వతీపురం/భామిని/సీతంపేట రూరల్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘అలకలు వీడి పార్టీ కోసం ప్రతీ ఒక్క కార్యకర్త పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. 2029ఎన్నికల్లో మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేయాలి. గ్రూపు రాజకీయాలు వద్దు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి’ అని విద్యాశాఖ, ఐటీశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఈ మేరకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. భామిని మండలం లివిరి జంక్షన్‌ వద్ద గురువారం రాత్రి పాలకొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత వైసీపీ ప్రభుతంలో ఉత్తరాంధ్రను వెనుకబడిన ప్రాంతంగా పిలిచేవారు. అభివృద్ధి లేని జిల్లాలుగా గత పాలకులు ఈ ప్రాంతాన్ని తయారుచేశారు. నేడు కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీకే ఉత్తరాంధ్ర వెన్నెముకగా నిలుస్తోంది. ఉత్తరాంధ్రకు రూ.లక్షల కోట్ల పెట్టుబడులను వివిధ సంస్థల నుంచి తెప్పిస్తున్నాం. కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిది. టీడీపీలో వ్యక్తులు కాదు పార్టీయే శాశ్వతం. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు నేను ఎక్కడకు వెళ్లినా కార్యకర్తలను కలిసిన తరువాతే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. కరుడుగట్టిన కార్యకర్తలే నాకు స్ఫూర్తి. రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో 94శాతం అసెంబ్లీ సీట్లు సాధించడం వెనుక ప్రతీ ఒక్క కార్యకర్త కష్టం దాగి ఉంది. చంద్రబాబును 53 రోజులు అన్యాయంగా జైల్లో పెడితే అండగా నిలబడి పోరాడింది టీడీపీ కార్యకర్తలే. అధికారం చేపట్టిన 18నెలల్లోనే భోగాపురం ఎయిర్‌పోర్టు, గూగుల్‌, హర్షలరీ మిట్టల్‌ వంటి ఎన్నో భారీ ప్రాజెక్ట్‌లు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నాం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా సుపరిపాలన అందిస్తున్నాం. చేసిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తరలిపోకుండా రక్షించుకున్నాం. రైల్వేజోన్‌ను సాధించాం. రప్పారప్పా అని జగన్‌ అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమి చేయలేని జగన్‌ ఇప్పుడు ఏం చేస్తారు. టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు పనులపై వెళితే అధికారులు గౌరవం ఇవ్వాలి. దీనికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బాధ్యత తీసుకోవాలి. పార్టీ బాగుంటేనే కార్యకర్తలు బాగుంటారు’ అని అన్నారు. లోకేశ్‌కు జిల్లా మంత్రి సంధ్యారాణి, ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు, విప్‌ జగదీశ్వరీ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ బాధ్యులు పడాల భూదేవి స్వాగతం పలికారు.దీనికి ముందు లోకేశ్‌ను కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌కలెక్టర్‌ పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ కలిశారు. కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌, ఉత్తరాంధ్ర సమన్వయకర్త దామచర్ల సత్య, శాప్‌ చైర్మన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 12:25 AM