Share News

No Development.. అభివృద్ధి.. పాలనలో మున్సి‘పల్టీ’!

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:33 PM

No Development.. No Governance జిల్లాలో కీలక నియోజకవర్గమైన సాలూరు మున్సిపాల్టీ పరిస్థితి దయనీయంగా మారింది. పాలన పూర్తిగా గాడి తప్పింది. అభివృద్ధి ఊసే లేదు. వార్డుల్లో సమస్యలేవీ పరిష్కారం కావడం లేదు. పాలకవర్గం.. అధికారులు ఎవరికివారు అన్నట్టుగా తయారయ్యారు. మున్సిపాల్టీ ఆదాయంపై కూడా దృష్టి సారించడం లేదు.

No Development..   అభివృద్ధి.. పాలనలో మున్సి‘పల్టీ’!
సాలూరు మున్సిపల్‌ కార్యాలయం

  • ఖజానాలో నిధులు కరువు

  • ప్రజలను వేధిస్తున్న సమస్యలెన్నో..

  • ఆదాయంపై దృష్టి సారించని అధికారులు, పాలకవర్గం

  • గత ఐదేళ్లలో 18 మంది కమిషనర్ల మార్పు

  • గాడిన పడేదెప్పుడో?

సాలూరు, ఆగస్టు26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కీలక నియోజకవర్గమైన సాలూరు మున్సిపాల్టీ పరిస్థితి దయనీయంగా మారింది. పాలన పూర్తిగా గాడి తప్పింది. అభివృద్ధి ఊసే లేదు. వార్డుల్లో సమస్యలేవీ పరిష్కారం కావడం లేదు. పాలకవర్గం.. అధికారులు ఎవరికివారు అన్నట్టుగా తయారయ్యారు. మున్సిపాల్టీ ఆదాయంపై కూడా దృష్టి సారించడం లేదు. ప్రజా సంక్షేమం.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ గాలికొదిలేశారు. గత ఐదేళ్లలో సుమారు 18 మంది కమిషనర్లు మారారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఒకప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సాలూరు పురపాలక సంఘాన్ని తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది.

ఇదీ పరిస్థితి..

- సాలూరు మున్సిపాల్టీలో 29 వార్డులున్నాయి. సుమారు 70 వేల మంది జనాభా ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పురపాలక సంఘం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. చెప్పుకోదగ్గ పనులేవీ జరగలేదు. ప్రధానంగా పట్టణవాసులను తాగునీరు, పారిశుధ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఎక్కడికక్కడ చెత్తలు పేరుకుపోగా దోమల బెడదతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు శివారు ప్రాంతవాసులకు తాగునీరు అందడం లేదు. పాలకవర్గంలో ఉన్న మెజార్టీ వైసీపీ కౌన్సిలర్లు వాటిపై దృష్టి సారించడం లేదు. మున్సిపల్‌ అధికారులు కూడా వచ్చామా..? వెళ్లామా! అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సామాజిక మరుగుదొడ్లు, రహదారి మరమ్మతు పనులు, కల్వర్టుల నిర్మాణంతో పాటు అనేక సమస్యల పరిష్కారానికి మున్సిపాల్టీకి ఇటీవల రూ.రెండు కోట్ల వరకు మంజూరైనా.. వాటిని సక్రమంగా వినియోగించలేక పోయారు. ఇదిలా ఉండగా కుక్కల సంతాన నిరోధక చికిత్సల పేరిట సాధారణ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి.

- సాలూరు పురపాలక సంఘానికి పన్నుల బకాయిలు గుదిబండగా మారాయి. ఆదాయం పెంచి తద్వారా అభివృద్ధికి బాటలు వేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందు 2004లో 15 దుకాణాలు, 2014లో మరో 15 షాపులు నిర్మించారు. వాటిలో 16 షాపులను అద్దెకు ఇచ్చారు. వీటిపై ఏటా రూ.15 లక్షల వరకు రావాలి. కానీ సకాలంలో వసూలు చేయకపోవడంతో రూ.40 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. 11 ఏళ్లుగా 14 దుకాణాలు ఖాళీగా ఉండడంతో మరో రూ.60 లక్షల ఆదాయానికి గండి పడింది. వాటితో పాటు ప్రధాన రహదారికి పక్కన ఉన్న మరో ఐదు దుకాణాలకు రూ.20 లక్షల వరకు రావాల్సి ఉన్నా.. వసూళ్లకు ఎలాంటి చర్యలు లేవు.

- దుకాణాలు లీజుకు ఇచ్చిన అధికారులు ప్రతి మూడేళ్లకొకసారి రెన్యూవల్‌ చేసి 33 శాతం అద్దె పెంచాల్సి ఉంటుంది. కానీ సాలూరులో అలాంటి చర్యలు కానరావడం లేదు. రెన్యూవల్‌ చేసి నిబంధనల మేరకు అద్దెలు పెంచాలని వ్యాపారులే కమిషనర్లకు వినతులు ఇచ్చినా పట్టించుకున్న వారే కరువయ్యారు.

పది లక్షలు కూడా లేవు..

మున్సిపాల్టీ ఖజానాలో రూ.10 లక్షలు కూడా లేవు. దీంతో పట్టణంలో సామాజిక మరుగుదొడ్లు, నీటి ట్యాంకులను మరమ్మతులు చేయడం లేదు. కల్వర్టులను కూడా బాగు చేయడం లేదు. నిధులు లేని కారణంగా మూడు లేదా ఆరు నెలలకోసారి పారిశుద్య కార్మికులు జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మరుగునీటి శుద్ధి కోసం సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ మంజూరు చేసింది. నిధులు సైతం కేటాయించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.

దర్జాగా కబ్జాలు

మున్సిపాల్టీలో కబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు యథేచ్చగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. శనివారం రాత్రికి స్థలం ఆక్రమించి.. సోమవారం ఉదయం నాటికి షాపును ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల మురుగునీరు సైతం కదలడం లేదు. చిన్నపాటి వర్షానికే కొన్ని ప్రాంతాలు జలమయమవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధికారులు.. ఉద్యోగులు ఇలా..

సాలూరుకు అనేక మంది మున్సిపల్‌ కమిషనర్లు వచ్చి అనతికాలంలోనే బదిలీపై వెళ్లిపోతున్నారు. 2023లో కమిషనర్‌ హనుమంతు శంకరరావు ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ తర్వాత పని ఒత్తిడి తాళలేక ఆర్వో ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలోనే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మృతి చెందారు. విధి నిర్వహణలో అలసత్వం కారణంగా కమిషనర్‌ చెక్కా సత్యనారాయణను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఇన్‌చార్జి కమిషనర్‌గా పనిచేసిన డీటీవీ కృష్ణారావు ఉన్నతాధికారులను పట్టుకుని బదిలీపై వెళ్లిపోయారు. మరో కమిషనర్‌ జయరాం అతి కొద్ది రోజులకే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడ్డారు. ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న మున్సిపల్‌ డీఈ వరప్రసాద్‌ను సరెండ్‌ చేశారు. విశాఖ నుంచి వచ్చిన టీటీ రత్నకుమార్‌ ఇటీవల సాలూరు మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయనపై పట్టణవాసులు ఆశలు పెట్టుకున్నారు.

అభివృద్ధి చేస్తాం..

ప్రభుత్వ సహకారంతో సాలూరు మున్సిపాల్టీని అభివృద్ధి చేస్తాం. ప్రజలు, అధికారులు సహకరించాలి.

- టీటీ రత్నకుమార్‌, కమిషనర్‌, సాలూరు మున్సిపాల్టీ

Updated Date - Aug 26 , 2025 | 11:33 PM