No Changes మార్పు లేనట్టేనా?
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:37 PM
No Changes at All? పార్వతీపురం మన్యం జిల్లాలో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయా? రెవెన్యూ డివిజన్‌ల్లోకి మండలాల చేరిక, తరలింపు ఏమైనా ఉంటుందా? అంటే.. దాదాపుగా ఆ అవకాశాల్లేవని తెలుస్తోంది.
నివేదిక రూపొందించిన జిల్లా పునర్ వ్యవస్థీకరణ ఉపసంఘం
10న మంత్రివర్గ సమావేశంలో రానున్న స్పష్టత
సాలూరు రూరల్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాలో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయా? రెవెన్యూ డివిజన్‌ల్లోకి మండలాల చేరిక, తరలింపు ఏమైనా ఉంటుందా? అంటే.. దాదాపుగా ఆ అవకాశాల్లేవని తెలుస్తోంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జీవోఎం ( మంత్రుల ఉపసంఘం ) ఈ నెల 5న ( బుధవారం ) జరిగిన సమావేశంలో కొత్త జిల్లాలు, ప్రస్తుత జిల్లాల్లో సరిహద్దుల మార్పులు, చేర్పులపై చర్చించి నివేదిక తయారు చేసింది. ఈ నేపథ్యంలో మన్యం జిల్లాలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయనట్టు భోగట్టా. ఈ నెల 10న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై స్పష్టత రానుంది.
ప్రస్తుతం మన్యం జిల్లాలో సాలూరు నియోజకవర్గంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలు ఉన్నాయి. మరో మండలం మెంటాడ విజయనగరం జిల్లాలో ఉంది. కురుపాం నియోజకవర్గంలో జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు పాలకొండ రెవిన్యూ డివిజన్‌లో ఉండగా కొమరాడ, గరుగుబిల్లి మండలాలు పార్వతీపురం రెవిన్యూ డివిజన్‌లో ఉన్నాయి. అయితే ఒక అసెంబ్లీ స్థానంలో ఉన్న మండలాలన్నీ ఒకే రెవిన్యూ డివిజన్‌లో ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులుండవని ఉపసంఘం అభిప్రాయపడింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని మండలాల్లో చేర్పులు,మార్పులు చోటు చేసుకోనున్నాయని తొలుత అంతా భావించారు. కానీ జీవోఎం ( మంత్రుల ఉపసంఘం ) పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయనట్టు తెలిసింది.