Share News

కాలువ నిర్మించరు.. పరిహారం చెల్లించరు

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:10 AM

వారికి భూములు ఉన్నా అవసరాలకు అమ్ముకోలేరు. సాగు,తాగునీటి కాలువ కోసం ఆ భూములను సేకరించి పదేళ్లవుతున్నా ఇంకా వారికి నష్టపరిహారం చెల్లించడం లేదు.

కాలువ నిర్మించరు.. పరిహారం చెల్లించరు
- కందా బాబూరావు, రైతు, రామలింగాపురం

- పదేళ్ల కిందట రైతుల నుంచి సేకరించిన భూములు

- ఇప్పటికీ ప్రారంభంకాని ‘పోలవరం’ పనులు

-నష్టపరిహారం కూడా చెల్లించని వైనం

- ఇబ్బందులు పడుతున్న రైతులు

కొత్తవలస, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వారికి భూములు ఉన్నా అవసరాలకు అమ్ముకోలేరు. సాగు,తాగునీటి కాలువ కోసం ఆ భూములను సేకరించి పదేళ్లవుతున్నా ఇంకా వారికి నష్టపరిహారం చెల్లించడం లేదు. దీంతో ఏమీ చేయాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. ఇదీ పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి. పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు తాగు, సాగునీరును అందించడం కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి పదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పోలవరం నుంచి అనకాపల్లి మీదుగా విజయనగరం, పార్వతీపురం శ్రీకాకుళం వరకు ఎడమ కాలువ నిర్మాణానికి భూములు సేకరించింది. జిల్లాకు సంబంధించి కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ, శృంగవరపుకోట మండలాల్లోని వివిధ గ్రామాల్లో భూములను సేకరించారు. ఏఏ గ్రామాల్లో ఎంత భూమి సేకరించింది సర్వే నెంబర్ల వారీగా అప్పట్లో జాబితా విడుదల చేశారు. ఒక్కొక్క రైతు సెంటు భూమి నుంచి 10 ఎకరాల వరకు కోల్పోయే పరిస్థితి వచ్చింది. సేకరించిన భూముల్లో మార్కింగ్‌ రాళ్లను సైతం పాతారు. ఈ ప్రక్రియ అంతా జరిగి ఇప్పటికే నాలుగేళ్లు దాటిపోయింది. కానీ, పోలవరం కాలువ పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభంకాలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో నిధుల కొరత కారణంగా పనులు జరగలేదు. అలాగని, రైతులకు కూడా నష్ట పరిహారం చెల్లించడం లేదు. భూములు సేకరించి సంవత్సరాలు గడుస్తున్నా ఎకరాకు ఎంత నష్ట పరిహారం చెల్లిస్తారు? ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. తమ అవసరాల కోసం భూములు అమ్ముకుందామని రైతులు ప్రయత్నాలు చేస్తున్నా కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. పోలవరం కాలువలో భూమి పోతుందట కదా? ఎలా కొనుగోలు చేస్తామంటూ కొందరు వ్యాపారులు అంటుండంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోలవరం కాలువను నిర్మిస్తారా? లేదా? అనేది స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పనులు ఆగిపోతే గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయాలని, లేదంటే తమకు త్వరితగతిన నష్ట పరిహారం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

పోలవరం కాలువ నిర్మాణం కోసం అధికారులు మా భూములను సేకరించారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. ఇదంతా జరిగి సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు మాకు నష్ట పరిహారం ఇవ్వలేదు. కాలువ పనులు కూడా చేయడం లేదు. మా పిల్లలు చదువులు, ఆడపిల్లల పెళ్లిల కోసం భూములు విక్రయించాలని ప్రయత్నిస్తున్నా కొనడానికి ఎవరూ ముందు రావడం లేదు. మా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తారో తెలియడం లేదు. దాన్ని చెల్లిస్తే అవసరాలనైనా తీర్చుకుంటాం. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి.

Updated Date - Jul 12 , 2025 | 12:10 AM