No Bills బిల్లులు అందట్లే.. భోజనాలు ఎలా?
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:32 AM
No Bills, How Will Meals Be Served? జిల్లాలో గిరిజన విద్యాలయాలకు గత రెండు నెలలుగా మెస్ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. మరోవైపు వసతి గృహ సంక్షేమా ధికారులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నారు.
అప్పులతో నెట్టుకొస్తున్న వైనం
గాడితప్పుతున్న మెనూ
పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందని పౌష్టికాహారం
జియ్యమ్మవలస, డిసెంబరు20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన విద్యాలయాలకు గత రెండు నెలలుగా మెస్ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. మరోవైపు వసతి గృహ సంక్షేమా ధికారులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నారు. వాస్తవంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందిం చేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోంది. 3, 4 తరగతుల విద్యార్థుల్లో ఒక్కొక్కరికీ నెలకు రూ. 1,150, 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారిలో ఒక్కొక్కరికీ రూ. 1,400, ఇంటర్, ఆపైన చదువుతున్న విద్యార్థులకు రూ. 1,600 చొప్పున మెస్ బిల్లులు అందిస్తోంది. నిబంధనల ప్రకారం మెనూ సక్రమంగా అమలు చేసి .. పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల డిప్యూటీ వార్డెన్లు, వసతి గృహ సంక్షేమాధికారులదే. అయితే అక్టోబరు, నవంబరు నెలలకు సంబంధించిన బిల్లులు ఇంకా విడుదల కాలేదు. దీంతో వసతి గృహ సంక్షేమాధికారులు అప్పులు చేసి సరుకులు, పండ్లు తీసుకొస్తున్నారు. గత రెండు నెలల నుంచే ఇదే పరిస్థితి నెలకొనగా.. ఈ నెలలోనూ వారికి అవస్థలు తప్పడం లేదు. బిల్లులు మంజూరు కాని కారణంగా చాలా పాఠశాలల్లో మెనూ నిర్వహణ దారి తప్పుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు వస్తే ఏం చేయాలి? తమకేమి జరుగుతుందో? సరుకులు అడిగితే దుకాణదారులు ఏమంటారో? అనే డిప్యూటీ వార్డెన్లు సతమతమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, గిరిజన , విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి నెలా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
గిరిజన విద్యాలయాలు ఇలా..
జిల్లాలోని పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో నిర్వహిస్తున్న బాలురు, బాలికల ఆశ్రమ పాఠశాలలు(3 నుంచి 10 తరగతులు) 47 వరకూ ఉన్నాయి. వాటిలో 13,418 మంది విద్యార్థులు ఉన్నారు. గురుకుల బాలుర పాఠశాలలు (5-10 తరగతులు) మూడు, బాలికల పాఠశాల ఒకటి ఉంది. వీటిలో 1,039 మంది చదువుతున్నారు. గురుకుల జూనియర్ కళాశాలలు బాలురు, బాలికలవి రెండేసి చొప్పున ఉండగా వాటిలో 1,039 మంది ఉన్నారు. బాలికల మినీ గురుకుల పాఠశాల (1 - 7 తరగతులు) ఒకటి ఉండగా, ఇందులో 189 మంది చదువుతున్నారు. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ /కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బాలురుకు సంబంధించి (8-12 తరగతులు) ఒకటి ఉండగా.. ఇక్కడ 559 మంది ఉన్నారు. ఏపీటీడబ్ల్యూ యూఆర్‌జేసీ (5 - 12 తరగతులు) బాలికలకు సంబంధించి ఒకటి ఉండగా 299 మంది చదువుతున్నారు. పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు (బాలురు, బాలికలు) ఎనిమిది ఉండగా.. వీటిలో 2,995 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు (1-2 తరగతులు) 350 ఉండగా 3,667 మంది చదువుతున్నారు. ఇవి కాకుండా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు (6-12 తరగతులు) నాలుగు ఉంటే వాటిలో 1,461 మంది విద్యభ్యసిస్తున్నారు.
బిల్లులు పెట్టేశాం
అక్టోబరు, నవంబరుకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందజేశాం. ఈ నెలకు సంబంధించి ఇంకా బిల్లులు పెట్టడానికి సమయం ఉంది. త్వరలోనే బిల్లులు మంజూరవుతాయి.
కె.చంద్రబాబు, ఏటీడబ్ల్యూవో, కురుపాం సబ్ డివిజన్