Share News

No Ambulance అంబులెన్స్‌ లేక.. తోపుడు బండిపైనే!

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:16 AM

No Ambulance, Forced to Use a Pushcart! మండలంలో అనాథ వృద్ధురాలి మృతదేహం తరలింపు చర్చనీయాంశమైంది. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.

No Ambulance అంబులెన్స్‌ లేక.. తోపుడు బండిపైనే!
తోపుడు బండిపై మృత‌దేహాన్ని త‌రిస్తున్న దృశ్యం

గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో అనాథ వృద్ధురాలి మృతదేహం తరలింపు చర్చనీయాంశమైంది. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మలక్ష్మీపురానికి చెందిన రాధ(75) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు ఎవరూ లేరు. గురువారం పరిస్థితి విషమించడంతో ఇరుగుపొరుగువారు వృద్ధురాలిని భద్రగిరి సామాజిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతిచెందింది. ఆసుపత్రిలో అంబులెన్స్‌ సదుపాయం లేకపోవడంతో మృతదేహం తరలింపు సమస్యగా మారింది. ప్రైవేట్‌ వాహనానికి రూ.2,500 ఇచ్చే స్థోమత లేకపోవడంతో ఇరుగుపొరుగు వారు తొపుడుబండి (రిక్షా)పై మృతదేహాన్ని ఉంచి .. కిలోమీటరు దూరంలో ఉన్న గుమ్మలక్ష్మీపురానికి తీసుకొచ్చారు. మృతదేహాల తరలింపునకు వాహనం లేక తరచూ ఇబ్బందులకు గురవుతున్నామని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై భద్రగిరి ఆసుపత్రి వైద్యాధికారి త్రివేణిని వివరణ కోరగా.. ‘ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో రాధ అనే వృద్ధురాలిని ఇరుగుపొరుగు వారు గురువారం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన తర్వాత పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించాం. అయినా ఇరుగుపొరుగు వారు ఆమెను తీసుకెళ్లడానికి ఆసక్తి కనబర్చలేదు. గత రెండు రోజులుగా చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం సాయంత్రం రాధ చనిపోయింది. మహాప్రస్థానం వాహనం మా వద్ద లేని కారణంగా మృతదేహాన్ని ప్రైవేట్‌ వాహనంలో తరలించాలని సూచించాం. కాని వారు రిక్షాలో తీసుకెళ్లారు.’ అని చెప్పారు.

Updated Date - Dec 27 , 2025 | 12:16 AM