Share News

బంగ్లాదేశ్‌లో చిక్కుకుంది తొమ్మిది మంది

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:15 AM

జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌ కోస్టుగార్డ్స్‌కు చిక్కారని అంతా అనుకున్నారు.

 బంగ్లాదేశ్‌లో చిక్కుకుంది తొమ్మిది మంది
మైలపల్లి అప్పన్న, బంగ్లాదేశ్‌ కోస్టుగార్డ్స్‌ అదుపులో ఉన్న బోటు

- ఇంతవరకు 8 మందే అనుకున్నారు..

- తాజాగా మరొకరి పేరు వెలుగులోకి

- చింతపల్లికి చెందిన మైలపల్లి అప్పన్నగా నిర్ధారణ

విజయనగరం/భోగాపురం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌ కోస్టుగార్డ్స్‌కు చిక్కారని అంతా అనుకున్నారు. కానీ, వారి అదుపులో ఉంది ఎనిమిది మంది కాదు తొమ్మిది మంది. తాజాగా మరొకరి పేరు వెలుగులోకి వచ్చింది. పూసపాటిరేగ మండలం బర్రిపేట చింతపల్లికి చెందిన మైలపల్లి అప్పన్న కూడా బంగ్లా కోస్టుగార్డ్‌ల అదుపులో ఉన్నారని నిర్ధారణ అయింది. ఈనెల 13న విశాఖ హార్బర్‌ నుంచి పడవపై చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన జిల్లాకు చెందిన మత్స్యకారులు బంగ్లాదేశ్‌ కోస్టుగార్డ్స్‌కు చిక్కిన విషయం తెలిసిందే. భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన ఆరుగురు, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందినవారు ఇద్దరు మత్స్యకారులు మొత్తం ఎనిమిది మంది కోస్టుగార్డ్‌ల అదుపులో ఉన్నట్లు అంతా భావించారు. అయితే, తాము తొమ్మిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లా కోస్టుగార్డులు ఇన్‌స్టాగ్రాం ద్వారా వారి బంధీగా ఉన్న మరుపల్లి చిన్నప్పన్న బోటు వాచ్‌మన్‌ మారుపల్లి కిరణ్‌కు శుక్రవారం సమాచారం ఇచ్చారు. దీంతో 9వ వ్యక్తి ఎవరా? అని కొండ్రాజుపాలెంకు చెందిన మత్స్యకార సంఘ నాయకుడు సూరాడ చిన్నారావు ఆరా తీశారు. ఈక్రమంలో తన భర్త మైలపల్లి అప్పన్నకు ఫోన్‌ చేస్తున్నా ఎత్తడం లేదంటూ ఆయన భార్య సూరిడమ్మ మత్స్యకార నాయకులకు తెలిపింది. దీంతో బంగ్లాదేశ్‌ కోస్టు గార్డ్స్‌ అదుపులో ఉంది అప్పన్నే అని నిర్ధారణకు వచ్చారు. బంగ్లాదేశ్‌ అదుపులో ఉన్న తొమ్మిది మందిని క్షేమంగా తీసుకొస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే అధికారులతో సమావేశమై ఈ విషయం చర్చించారు. హైకమిషన్‌తో మాట్లాడి మత్స్యకారులను క్షేమంగా తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ఫ బంగ్లాదేశ్‌ జలాల్లోకి పొరపాటున మత్స్యకారులతో వెళ్లిన ఐఎన్‌డీ-ఏపీ- వీ5- ఎంఎం-735 నెంబరు గల పడవ ప్రస్తుతం ఆ దేశ కోస్టుగార్డ్స్‌ అదుపులో మోంగ్లా ఫెర్రీ టెర్మినల్‌ సమీప సముద్ర తీరంలో ఉంది. ఈపడవ పైనే భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన 9 మంది మత్స్యకారులు బంగ్లా సముద్ర జలాల్లోకి వెళ్లి కోస్టుగార్డ్స్‌కు పట్టుబడ్డారు.

Updated Date - Oct 25 , 2025 | 12:15 AM