NIA inquires about terrorist activities ఉగ్ర కార్యకలాపాలపై ఎన్‌ఐఏ ఆరా
ABN , Publish Date - May 20 , 2025 | 12:42 AM
NIA inquires about terrorist activities ఉగ్రవాద కార్యకలాపాలతో విజయనగరం వ్యక్తికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా నిందితులు సిరాజ్, సమీర్‌లను కస్టడీకి కోరుతున్నారు. తాజాగా సిరాజ్ కుటుంబీలను కూడా విచారించారు. వారి బ్యాంకు పుస్తకాలతో పాటు ఆధార్, పాన్ కార్డులను సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఉగ్ర కార్యకలాపాలపై
ఎన్‌ఐఏ ఆరా
సిరాజ్, సమీర్‌లను కస్టడీకి కోరిన పోలీసులు
డీసీసీబీలో అక్కౌంట్, లాకర్ గుర్తింపు
కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ
విజయనగరం, మే 19(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద కార్యకలాపాలతో విజయనగరం వ్యక్తికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా నిందితులు సిరాజ్, సమీర్‌లను కస్టడీకి కోరుతున్నారు. తాజాగా సిరాజ్ కుటుంబీలను కూడా విచారించారు. వారి బ్యాంకు పుస్తకాలతో పాటు ఆధార్, పాన్ కార్డులను సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌లు ఉగ్రవాద సానుభూతిపరులుగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టు ఆదేశంతో ఆదివారం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా వారి కదలికలను ఆంధ్రా, తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు గమనిస్తున్నారు. పక్కా సమాచారంతో విజయనగరంలో ఉంటున్న సిరాజ్ ఇంటికి వెళ్లి పేలుళ్లకు వినియోగించే అల్యూమినియమ్, అమ్మోనియా, సల్ఫర్ వంటి పేలుడు పదార్థాలను శనివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరికీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు జోరుపెంచారు. తాజాగా సిరాజ్ బ్యాంక్ అకౌంట్‌లను గుర్తించారు. సిరాజ్ గత ఆరు నెలల కాలంలో రెండుసార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. కాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు సోమవారం విజయనగరం జిల్లా కేంద్రానికి వచ్చారు. సిరాజ్ కుటుంబ నేపథ్యం, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిరాజ్ తండ్రిని కూడా పలు వివరాల కోసం ప్రశ్నించారు. బ్యాంకు పాస్‌పుస్తకం, ఆధార్, పాన్‌కార్డులను అడిగారని తెలిసింది.
డీసీసీబీలో అకౌంట్
ఎవ్వరికీ అనుమానం రాకుండా సిరాజ్ సహకార బ్యాంకులో అకౌంట్ తీసుకున్నారు. ఆయనకు సంబంధించిన లాకర్, అకౌంట్‌ను పోలీసులు డీసీసీబీలో సోమవారం గుర్తించారు. సిరాజ్ ఇక్కడి నుంచే ప్రస్తుతం లావాదేవీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు రాబెట్టేందుకు నిందితులను కస్టడీకి ఇవ్వాలని విజయనగరం టూటౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు అనుమతితో సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం వారిని ఎన్‌ఐఏ అధికారులు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరానికి తీసుకువచ్చి విచారించనున్నారు. ఉగ్రవాద సానుభూతిపరులను రహస్యంగా దర్యాప్తు చేసేందుకు జిల్లా పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్‌ఐఏ అధికారులు సోమవారం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో దర్యాప్తు సాగించారు. సిరాజ్ ఉర్ రెహ్మన్ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఎప్పటి నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి? ఆర్థిక లావాదేవీలు ఎలా అన్న అంశాలపై ఆరా తీశారు. కుట్రకు సంబంధించి సౌది అరేబియానుంచి సిరాజ్, సమీర్‌లకు ఐసీస్ మాడ్యూల్ ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులకు తెలిసింది. వీరిద్దరు వెనుక వున్న ప్రధాన సూత్రధారులు ఎవరన్న దానిపై గుర్తించే పనిలో ఉన్నారు. వీరికి నిధులు సమకూర్చినది ఎవరన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. వీరి అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కుటుంబ సభ్యుల వద్ద ఆరా..
ఉగ్రవాద సానుభూతిపరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ కుటుంబ సభ్యులను ఎన్‌ఐఏ, ఏపీ, తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు, జిల్లా పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో పేలుడు పదార్థాలను ఎందుకు గుర్తించలేకపోయారు? హైదరాబాద్‌లో సిరాజ్ ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? తదితర వివరాలపై ప్రశ్నించారని సమాచారం. సిరాజ్ తండ్రి విజయనగరం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తుండగా సోదరుడు (ఎస్టీఎఫ్) స్టేట్ టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. సిరాజ్ విషయంలో వీరిని కూడా పూర్తి స్థాయిలో విచారించనున్నారని తెలుస్తోంది.
-------------