NHRC team రేపు జిల్లాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:37 PM
NHRC team to visit the district tomorrow జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యుల బృందం రేపు జిల్లాలో పర్యటించనుంది. మంగళవారం కురుపాం గురుకుల పాఠశాలను పరిశీలించి.. విచారణ చేపట్టనున్నారు.
పార్వతీపురం/కురుపాం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యుల బృందం రేపు జిల్లాలో పర్యటించనుంది. మంగళవారం కురుపాం గురుకుల పాఠశాలను పరిశీలించి.. విచారణ చేపట్టనున్నారు. కొద్ది రోజుల కిందట పచ్చకామెర్లతో ఆ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు మృతి చెందిన విషయం తెలిసిందే. మరికొంతమంది గిరిజన విద్యార్థులు జాండీస్ లక్షణాలతో పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రి, విశాఖ కేజీహెచ్‌లో చేరి వైద్య సేవలు పొందారు. వారిలో చాలామంది డిశ్చార్జి అయిపోయారు. అయితే కురుపాం ఘటనపై అరకు ఎంపీ తనూజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో 27న సాయంత్రం ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృంద సభ్యులు విశాఖ చేరుకుంటారు. 28న అక్కడ నుంచి పార్వతీపురం వస్తారు. 31వ తేదీ వరకు విచారణ కొనసాగిస్తారు. బాలికల మృతి , అనారోగ్యానికి గురైన వారికి అందిన వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. ఆసుపత్రులు, విద్యార్థినుల ఇళ్లకు వెళ్ళి విచారణ చేయనున్నట్లు తెలిసింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతిని వివరణ కోరగా.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృంద సభ్యుల జిల్లా పర్యటనకు షెడ్యూల్ ఖరారైందన్నారు.