విద్యార్థినుల మరణాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:55 PM
ఇటీవల కురుపాం గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల మరణించడంతో పాటు పలువురు విద్యార్థినులు పచ్చకామెర్ల బారినపడడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ-ఢిల్లీ) విచారణ చేపట్టింది.
- కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం
- నేడు పాఠశాలకు వెళ్లనున్న కమిషన్ సభ్యులు
పార్వతీపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురుపాం గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల మరణించడంతో పాటు పలువురు విద్యార్థినులు పచ్చకామెర్ల బారినపడడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ-ఢిల్లీ) విచారణ చేపట్టింది. ఈ మేరకు కమిషన్ సభ్యులు యాటి ప్రకాష్ శర్మ, సంజయ్‌కుమార్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థినుల మరణాలు, అనారోగ్యానికి గురికావడంపై విచారణ చేపట్టారు. ఎంపీడీవోతో పాటు మండల విద్యాశాఖాధికారి తదితరులు గురుకుల విద్యాలయాన్ని సందర్శించారా?.. లోపాలు ఏమైనా గుర్తించారా?, పాఠశాల అభివృద్ధికి మంజూరైన నిధులు, పారిశుధ్య పనులకు కేటాయిస్తున్న నిధులు, ఆహారం, తాగునీరు తదితర విషయాలపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కొంతమంది అధికారులు ఉక్కిరిబిక్కిరైనట్లు తెలిసింది. బుధవారం కురుపాం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. విద్యార్థుల ఇళ్లకు కూడా వెళ్లనున్నట్లు సమాచారం. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశానికి మీడియాను అనుమతించలేదు.