New teachers బడులకు కొత్త మాస్టార్లు!
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:07 AM
New teachers for schools మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త ఉపాధ్యాయుల జాబితా వారం రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. దసరా సెలవుల తర్వాత వారు విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది.
వారం రోజుల్లో ఎంపిక జాబితా వెల్లడి
దసరా సెలవుల తరువాత విధుల్లో చేరే అవకాశం
సాలూరు రూరల్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త ఉపాధ్యాయుల జాబితా వారం రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. దసరా సెలవుల తర్వాత వారు విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో వివిధ మేనేజ్‌మెంట్, కేడర్లలో 583 పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మున్సిపల్, జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలు 210, పాఠశాల సహాయకులు క్యాడర్‌లో తెలుగులో 14, హిందీలో 14, ఆంగ్లంలో 23, గణితంలో 8, భౌతికశాస్త్రంలో 32, జీవశాస్త్రంలో 20, సాంఘిక శాస్త్రంలో 62, పీఈటీ 63 మొత్తం 446 టీచర్ ఖాళీలు చూపించారు. ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీలు 60 పాఠశాల సహాయకుల క్యాడర్‌లో ఆంగ్లంలో 7, గణితంలో 25, భౌతిక శాస్త్రంలో 24, జీవశాస్త్రంలో 16,సాంఘిక శాస్త్రంలో 5 మొత్తం 137 టీచర్ పోస్టులు ఖాళీలను చూపించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు విజయనగరంలో పరీక్షలు నిర్వహించారు. మెరిట్ జాబితాలను గత నెలలో ప్రకటించారు. ఆగస్టు 11న వ్యక్తిగత స్కోర్ వివరాలు వెల్లడించారు. కాగా అదే నెల 23న 7,725 మందితో ఎజ్జీటీ మెరిట్ జాబితా ప్రకటించారు. పాఠశాల సహాయకుల కేటగిరీలో ఆంగ్లానికి 665 మంది, గణితంలో 1497 మంది, ఫిజికల్ సైన్స్‌లో 1398 మంది, సోషల్‌లో 2618 మంది, తెలుగు 885 మంది, బయాలజీ 1359 మందితో మెరిట్ జాబితాలను ప్రకటించారు. వీటి భర్తీ కోసం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రకటించిన మెరిట్ లిస్ట్ నుంచి రిజర్వేషన్, నియమ నిబంధ నలకు అనుగుణంగా గత నెల 26 నుంచి 28 వరకు డెంకాడ మండలం మోదవలసలో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. కాగా పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో సభ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు అందించే అవకాశముంది.