New Pensions 1 నుంచి కొత్త పింఛన్లు
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:21 PM
New Pensions from 1st జిల్లాకు కొత్తగా మంజూరైన 1521 వితంతు పింఛన్లను వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం సంబంధిత అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడి
పార్వతీపురం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): జిల్లాకు కొత్తగా మంజూరైన 1521 వితంతు పింఛన్లను వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం సంబంధిత అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2023, డిసెంబరు నుంచి 2024 అక్టోబరు 31 మధ్య కాలంలో వితంతువులకు పింఛన్లను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మంజూరైన కొత్త పింఛన్లను మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా వచ్చేనెల ఒకటో తేదీన ఉదయం పంపిణీ చేయాలని సూచించారు. ఎన్టీఆర్ భరోసా కింద జిల్లాలో 1,39,752 మందికి ప్రతినెలా ప్రభుత్వం రూ.59.72 కోట్లు విడుదల చేస్తోందన్నారు. దానికి అదనంగా 1,521 మంది వితంతువులకు పింఛన్లు అందించాల్సి ఉందని స్పష్టం చేశారు. మొత్తం పింఛన్లకు సరిపడా నిధులను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. ఒకటో తేదీ ఉదయం 10 గంటల్లోగా శతశాతం పంపిణీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మండలాల వారీగా మంజూరు ఇలా..
బలిజిపేట మండలంలో 69 మందికి, భామినిలో 86, గరుగుబిల్లిలో 77, గుమ్మలక్ష్మీపురం 63, కొమరాడలో 66, జియ్యమ్మవలసలో 122, కురుపాంలో 51, మక్కువలో 131, పాచిపెంటలో 88 వితంతు పింఛన్లు మంజూరయ్యాయి. పాలకొండలో 77, పాలకొండ (అర్బన్)లో 47, పార్వతీపురం 126, పార్వతీపురం (అర్బన్)లో 60, సాలూరులో 75, సాలూరు (అర్బన్)లో 70, సీతంపేటలో 69, సీతానగరంలో 117, వీరఘట్టంలో 127 కొత్త పింఛన్లు మంజూరైనట్టు కలెక్టర్ వివరించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.