కొత్త పింఛన్లు వస్తున్నాయ్
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:43 PM
వితంతువులకు సంబంధించి కొత్త పింఛన్లు మంజూరుకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
- జిల్లాలో 4,800 మంది వితంతువులకు లబ్ధి
- వైసీపీ హయాంలో నిర్లక్ష్యం
- కరుణించిన ప్రస్తుత ప్రభుత్వం
- దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
- మే 1న పంపిణీకి సన్నద్ధం
-రాజాం మండలం కంచరాం గ్రామానికి లక్ష్మణరావు ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. కానీ, ఆయన భార్య లక్ష్మికి ఇంతవరకు వితంతు పింఛన్ మంజూరు కాలేదు. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా ఫలితం శూన్యం.
- రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన అనెం సూర్యారావు కొద్ది నెలల కిందట చనిపోయారు. ఆయన భార్య సరస్వతి భర్త మరణ ధ్రువీకరణపత్రంతో పాటు అన్నిరకాల సర్టిఫికెట్లను జతచేసి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఆమెకు వితంతు పింఛన్ మంజూరు కాలేదు. అధికారులను అడుగుతుంటే ప్రభుత్వం నుంచి అనుమతి లేదని సమాధానం వస్తోంది.
- సంతకవిటి మండలం మోదుగులపేటకు చెందిన శాసపు అప్పన్న మరణించి 18 నెలలు అవుతుంది. ఆయన భార్య భాగమ్మ మాత్రం వితంతు పింఛన్‌కు నోచుకోవడం లేదు. అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారని ఆమె వాపోతుంది.
-సంతకవిటి మండల కేంద్రానికి చెందిన గెడ్డాపు వజ్రం వితంతు మహిళ. భర్త గెడ్డాపు తవిటయ్య మరణించి 17 నెలలు అవుతుంది. వితంతు పింఛన్ మంజూరు చేయాలని సంతకవిటి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పింఛన్ మంజూరు కాలేదు. భర్త మరణించడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి దరఖాస్తు చేసింది.
- సంతకవిటి మండల కేంద్రానికి చెందిన పొదిలాపు దామోదరరావు 18 నెలల కిందట మృతిచెందాడు. ఆయన భార్య నాగలక్ష్మికి ఇప్పటివరకు వితంతు పింఛన్ అందలేదు. కూటమి ప్రభుత్వం తన దరఖాస్తును పరిశీలించి వితంతు ఫించన్ మంజూరు చేస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తుంది.
రాజాం/సంతకవిటి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఇటువంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. వితంతువులకు సంబంధించి కొత్త పింఛన్లు మంజూరుకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. భర్త చనిపోయిన వారికి ముందుగా పింఛన్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ నెల 30లోగా అన్ని వివరాలు సమగ్రంగా అందిస్తే మే 1న వారికి కొత్త పింఛన్లు అందనున్నాయి. గత కొన్ని నెలలుగా వితంతువులకు సంబంధించి పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 89,877 కొత్త పింఛన్లను అందించాలని నిర్ణయించగా.. జిల్లాలో 4,800 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే ప్రతినెలా సామాజిక పింఛన్ల కింద 2,72,904 మందికి పింఛన్లు అందుతున్నాయి. ప్రతినెలా రూ.115.93 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తోంది. కొత్త వితంతు పింఛన్లతో ప్రభుత్వంపై దాదాపు రూ.1.92 కోట్ల భారం పడనుంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరంతర ప్రక్రియ..
టీడీపీ ప్రభుత్వ హయాంలో వితంతు పింఛన్ల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగేది. ఎవరైనా భర్త చనిపోతే అదే వారంలో అప్పట్లో వివరాలు నమోదు చేసేవారు. నెల చివర్లో అధికారులకు నివేదిక అందేది. వెంటనే వారు ధ్రువీకరిస్తూ భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేసేవారు. 2019 ఏప్రిల్ వరకూ ఇలానే కొనసాగింది. కానీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ఆనవాయితీకి బ్రేక్ వేసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇటువంటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని పింఛన్లు మంజూరు చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న చివరి రెండు సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే వితంతు పింఛన్లు మంజూరు చేసింది. అది కూడా 2024 ఎన్నికలకు కొద్దిరోజులు ముందు మాత్రమే అందించింది. అయితే గత ఏడాదిగా వితంతు పింఛన్ల మంజూరు జరగలేదు. మధ్యలో మాత్రం ఏ నెలకు ఆ నెల స్పౌజ్ కింద వెంటనే భర్త పింఛన్‌ను వితంతువుకు బదలాయించింది. అయితే రాష్ట్రంలో ఏడాదికిపైగా పెండింగ్‌లో 89 వేలకుపైగా దరఖాస్తులు ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో దరఖాస్తు చేసుకొని ఈ నెల 30లోగా వివరాలు సక్రమంగా అందిస్తే మాత్రం పింఛన్ వెను వెంటనే మంజూరు అవుతుంది. మే1న పింఛన్ మొత్తం అందిస్తారు. లేకుంటే మాత్రం జూన్ 1న కొత్త వితంతు పింఛన్ అందించే ఏర్పాట్లు చేస్తారు.
మా సంగతేంటి?
గత వైసీపీ ప్రభుత్వం 2023 జూలై 1వ తేదీ నుంచి 2023 నవంబరు 30వరకు దరఖాస్తు చేసుకున్న వితంతువులకు పింఛన్ మంజూరు చేయకుండా మొండిచేయి చూపించింది. ఈ విషయమై ప్రస్తుత అధికారు లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రభుత్వం 2023 డిసెంబరు 1వ తేదీ నుంచి 2024 అక్టోబరు 30 వరకు ఉన్న స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసేలా మౌఖిక ఉత్తర్వులు విడుదల చేసింది. మరి తమ పరిస్థితి ఏంటి అని 2023 జూలై 1వ తేదీ నుంచి 2023 నవంబరు 30వరకు దరఖాస్తు చేసుకున్న వితంతు మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారు ఒక్క సంతకవిటి మండలంలోనే సుమారు 50 మందికి పైగా ఉండగా, జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నారు. తమకు కూడా స్పౌజ్ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకోవచ్చు
జిల్లా వ్యాప్తంగా వితంతువులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం అనుమతిచ్చింది. జిల్లా వ్యాప్తంగా 4,800 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సరైన ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. భర్త మరణ ధ్రువీకరణపత్రంతో పాటు ఇతర వివరాలు అందించాలి. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే పింఛన్ తప్పకుండా మంజూరవుతుంది.
- కల్యాణచక్రవర్తి, డీఆర్‌డీఏ పీడీ, విజయనగరం