వీఆర్‌ఎస్ కాలువలకు కొత్త రూపు
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:00 AM
వెంగళరాయసాగర్ ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కాలువల్లో పూడికతీత, తుప్పల తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి
బొబ్బిలి రూరల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వెంగళరాయసాగర్ ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కాలువల్లో పూడికతీత, తుప్పల తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతో కాలువలు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. వైసీపీ హయాంలో సాగునీటి కాలువలను పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయం విదితమే. కనీసం పూడిక తీయడానికి కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. కాలువల్లో ఐదేళ్లలో పేరుకుపోయిన పూడికలు తీయడంతో పాటు వారం రోజులుగా కాలువకు ఇరుపైపులా పేరుకుపోయిన తుప్ప లు, డొంకలను తొలగిస్తున్నారు. నారసింహుని పేట, గోపాలరాయుడిపేట, వెంకటరాయుడి పేట, పెంట, కొత్తపెంట, రాజుపేట, రంగ రాయపురం, దిబ్బగుడ్డివలస, తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ ఏడాది ఖరీఫ్, రబీలో పూర్తిస్థాయిలో నీరందుతుందని హర్షంవ్యక్తంచేస్తున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సాగు నీరందించేం దుకు కృషి చేస్తున్నామని వీఆర్‌ఎస్ చైర్మన్ నాగిరెడ్డి రామారావు తెలి పారు. ఈమేరకు మక్కువ మండలంలోని చప్పబుచ్చంపేట నుంచి దిబ్బ గుడ్డివలస వరకు వీఆర్‌ఎస్ ప్రధాన కాలువ పనులు చేపడు తున్నామని చెప్పారు.బొబ్బిలి, సీతానగరం మండలాల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీరందించే వీఆర్‌ఎస్ ప్రధాన కాలువల పనులకు సుమారు 12 లక్షల మేర నిధులు మంజూరుకావడంతో పనులు చేపడుతున్నామని తెలిపారు. కాగా నీరు విడుదల చేసేలోగా వెంగళరాయసాగర్ కాలువల పనులు పూర్తి చేసి చివరి గ్రామంలోని ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఏఈ ఎస్ సుధీర్ తెలిపారు.