Share News

New hopes కొత్త ఆశలు

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:17 AM

New hopes కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకంలో భాగంగా మంజూరు చేస్తున్న నిధులతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్‌ పనులు పూర్తిచేయాలని భావిస్తోంది.

New hopes కొత్త ఆశలు
తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు

కొత్త ఆశలు

ప్రాజెక్టుల దశ మారనుందా?

పూర్వోదయ నిధులతో నిర్మాణ పనులకు అవకాశం

పెండింగ్‌ పనులూ చేపట్టాలనుకుంటున్న ప్రభుత్వం

కేంద్రానికి ప్రతిపాదనలు

గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే వేలాది ఎకరాలకు సాగునీరు

కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకంలో భాగంగా మంజూరు చేస్తున్న నిధులతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్‌ పనులు పూర్తిచేయాలని భావిస్తోంది. తోటపల్లి ప్రాజెక్టు అదనపు పనులను రూ.263.36 కోట్ల అంచనాతో చేపట్టడం ద్వారా మరో 47,188 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పలు ప్రాజెక్టులకు మహర్దశ తీసుకువచ్చే అవకాశం ఉంది. కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది.

విజయనగరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 19,85,221 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభంలో రూ.1127.58 కోట్లతో పాలనా అనుమతి లభించింది. ఇప్పటివరకూ రూ.900 కోట్ల వరకూ వెచ్చించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఏటా ఖరీఫ్‌లో 80 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా సాగునీరు అందించడం గగనంగా మారింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో బడ్జెట్‌ కేటాయింపులు రూ.655.19 కోట్లు చేసినా.. కేవలం రూ.61.82 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కనీసం ఏడాదికి రూ.100 కోట్ల బడ్జెట్‌ నిధులు విడుదల చేసినా.. ప్రధాన పనులు పూర్తిచేసేవారమని యంత్రాంగం చెబుతోంది. పూర్వోదయ నిధులు వస్తే పనులు శరవేగంగా జరిగే అవకాశం ఉంది.

తారకరామతీర్థ సాగర్‌

తారకరామ తీర్థ సాగర్‌కు పూర్వోదయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.808.36 కోట్ల అవసరమని ప్రతిపాదనలు పంపింది. నిర్మాణం పూర్తి చేస్తే మరో 16,538 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కాంట్రాక్టర్‌కు రూ.18 కోట్ల వరకూ బకాయిలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.739 కోట్లకు సంబంధించి పాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకూ రూ.310 కోట్ల వరకూ పనులు మాత్రమే జరిగినట్టు తెలుస్తోంది. రూ.429 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. కనీసం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.100 కోట్లు విడుదల చేసినా పెండింగ్‌ పనులు పూర్తయ్యేవి. కానీ అధికారులు చేసిన ప్రతిపాదనలను జగన్‌ సర్కారు బుట్టదాఖలు చేసింది. మరోవైపు నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపలేకపోయింది. 300 ఎకరాల వరకూ భూసేకరణ చేయాల్సి ఉన్నా దాని జోలికి పోలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే..భోగాపురం విమానశ్రయం, విజయనగరానికి, నెల్లిమర్ల ప్రాంతాలకు తాగునీరు అందివ్వనున్నారు.

గజపతినగరం కెనాల్‌ బ్రాంచ్‌

గజపతినగరం కెనాల్‌ బ్రాంచ్‌కు ఏకంగా రూ.218.97 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రతిపాదించారు. అదనంగా 15 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని భావిస్తున్నారు. తొలుత ఈ కెనాల్‌ బ్రాంచ్‌ ద్వారా 15 వేల ఎకరాల మెట్టభూములకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ కింద చీపురుపల్లి సమీపంలో 97.7 కిలోమీటర్ల వద్ద నుంచి ఐదు మండలాల్లోని 41 గ్రామాల పరిధిలో 15 వేల ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు గజపతినగర్‌ కెనాల్‌ బ్రాంచ్‌ తవ్వాలని 2008లోనే నిర్ణయించారు. రూ.84 కోట్ల వ్యయంతో పాలనాపరమైన ఆమోదం లభించింది. అయితే కొంతవరకూ పనులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించింది. మొత్తం బ్రాంచ్‌ కెనాల్‌ పొడవు 45 కిలోమీటర్లు. ఇందులో 25 కిలోమీటర్లు ప్రధాన కాలువ. మిగతా 20 కిలోమీటర్లు పిల్ల కాలువలు. అయితే భూసేకరణ ఇంతవరకూ జరగలేదు. పూర్వోదయ నిధులతో కదలిక వచ్చే అవకాశం ఉంది.

మడ్డువలస ప్రాజెక్టు.

మడ్డువలస రిజర్వాయర్‌ రెండో దశ పనులకు రూ.30.04 కోట్లుతో ప్రతిపాదించారు. 7,300 ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించుకున్నారు. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ బాలారిష్టాలు దాటలేదు. గత ఐదేళ్లుగా కనీస నిర్వహణకు నోచుకోలేదు. రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తోంది. 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. కానీ ప్రాజెక్టు గతి తప్పింది. రిజర్వాయర్‌ గర్భంలో పూడిక పేరుకుపోయింది. దీంతో సంగాం, ఓనీ అగ్రహారం, మగ్గూరు తదితర గ్రామాలకు సాగునీరు అందని దుస్థితి. ఈ రిజర్వాయర్‌కు 11గేట్లు ఉన్నాయి. అందులో కొన్ని గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో నిత్యం కొంత నీరు వృథాగా కింది ప్రాంతాలకు పోతోంది. పూర్వోదయతో ఆశలు చిగురిస్తున్నాయి.

నదుల అనుసంధానానికీ ప్రయత్నం

నదుల అనుసంధానానికీ పూర్వోదయ నిధులు రాబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం శుభ పరిణామం. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా హిరమండలం వంశధార రిజర్వాయర్‌ నుంచి బూర్జ మండలం నాగావళి నది వరకూ అనుసంధాన ప్రక్రియ సాగి కూతవేటు దూరంలో ఉండిపోయింది. 33 కిలోమీటర్ల పొడవున కాలువలు తవ్వాల్సి ఉండగా ఇంకా 3 కిలోమీటర్ల మాత్రమే మిగిలి ఉంది. దీనికి పూర్వోదయ పథకం కింద రూ.72.5 కోట్లతో ప్రతిపాదించారు. అదనంగా 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. అటు నాగావళి-చంపావతి నదుల అనుసంధానినికి సైతం రూ.21.53 కోట్లతో ప్రతిపాదించడం శుభ పరిణామం.

========

Updated Date - Dec 30 , 2025 | 12:52 AM