Share News

New bars from 1 కొత్తబార్లు 1 నుంచి

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:54 PM

New bars from 1 బార్లుకు ఇచ్చిన మూడేళ్ల గడువు ఈ నెలాఖరుతో పూర్తికానుంది. వచ్చే నెల నుంచి కొత్త బార్లు రానున్నాయి. వీటిని లాటరీ ద్వారా అధికారులు ఎంపిక చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 34 బార్లుకు డ్రా చేపట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన మద్యం పాలసీ మేరకు లైసెన్స్‌ పొందిన బార్లకు (2022-25) ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది.

New bars from 1 కొత్తబార్లు 1 నుంచి

1 నుంచి కొత్తబార్లు

నెలాఖరుకు పాతవాటి గడువు పూర్తి

పది రోజుల్లో నోటిఫికేషన్‌ రాక

వచ్చే నెలలో లాటరీ ద్వారా కొత్తవి..

ఉమ్మడి జిల్లాలో 34 బార్లకు డ్రా

రాజాం రూరల్‌, ఆగస్టు9(ఆంధ్రజ్యోతి): బార్లుకు ఇచ్చిన మూడేళ్ల గడువు ఈ నెలాఖరుతో పూర్తికానుంది. వచ్చే నెల నుంచి కొత్త బార్లు రానున్నాయి. వీటిని లాటరీ ద్వారా అధికారులు ఎంపిక చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 34 బార్లుకు డ్రా చేపట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన మద్యం పాలసీ మేరకు లైసెన్స్‌ పొందిన బార్లకు (2022-25) ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. కొత్తగా బార్లు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం నూతన మద్యం బార్లు విధానానికి రూపకల్పన చేసింది. దీనికి మంత్రిమండలి సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నూతన పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం బార్లు కేటాయించనున్నారు. జిల్లాలో 26, మన్యం జిల్లాలో 8 బార్లను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. మరో పదిరోజుల్లో బార్లు కేటాయింపునకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడనుంది.

నాడు ఉదయం ఓ ధర.. మధ్యాహ్నం ఓ ధర

వైసీపీ ప్రభుత్వ హయాంలో బార్లలో ఽధరలకు తెరలేపారు. ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తూ మద్యంప్రియుల జీవితాలతో ఆటాడుకున్నారు. ఉదయం ఓ ధర, మధ్యాహ్నం మరో ధర, రాత్రి పొద్దుపోయాక ఇంకో ధరకు అమ్మకం చేస్తూ సొమ్ము చేసుకున్నారు. మద్యం షాపులు సైతం ప్రభుత్వమే నిర్వహించడంతో షాపులు తెరిచి, మూసే సమయాలను ఎప్పటికప్పుడు మారుస్తూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపేలా వ్యవహరించారు. షాపుల్లో సైతం ఎప్పుటికప్పుడు ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరగొట్టేలా ప్రవర్తించారు. బార్లలో బీరుపై రూ.50 క్వార్టర్‌ బాటిల్‌పై రూ.50, హాఫ్‌పై రూ.100, ఫుల్‌బాటిల్‌పై రూ.200 నుంచి రూ.300 అదనంగా వసూలు చేసే పరిస్థితి. రాత్రి తొమ్మిది గంటలకే మద్యం షాపులకు తాళాలు పడ్డం, తెరిచి ఉన్న సమయంలో కూడా మంచి బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మద్యం అలవాటున్న వారంతా బార్లును ఆశ్రయించేవారు. ఇదే అదనుగా ధరలను అప్పటికప్పుడు అమాంతం పెంచి అమ్మకాలు సాగిస్తూ ఐదేళ్ల పాటు దందా సాగించారు. అప్పట్లో నెలకొన్న పరిస్థితులు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. బార్లలో ఇష్టారాజ్యంగా ధరలు పెంచే విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టనుంది. షాపుల్లో అమ్మకం చేస్తున్న ధరలపై రూ.10 నుంచి రూ.20కి మించకుండా బార్లలో అమ్మకాలు సాగేలా చూడనుంది.

కేటాయింపులోనూ దందా

బార్ల కేటాయింపులో గత వైసీపీ ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహరించింది. భారీ ఆఫ్‌సెట్‌ ధరలను నిర్ణయించి మద్యం వ్యాపారుల మధ్య పోటీ పెంచింది. ఏమాత్రం డిమాండ్‌ లేని పట్టణాలలో కూడా లక్షలాది రూపాయలు చెల్లించి వేలంపాటలో బార్లు దక్కించుకునే దౌర్భాగ్య పరిస్థితిని మద్యం వ్యాపారులు గతంలో చవిచూశారు. జిల్లా కేంద్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గరిష్టంగా రూ.44 లక్షలకే బార్లు దక్కగా రాజాంలో మాత్రం గరిష్టంగా రూ.88 లక్షలకు బార్లు దక్కించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడి మద్యం వ్యాపారులకు ఎదురైంది.

వేలంపాటకు స్వస్తి

వేలం పాట నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరే పరిస్థితులున్నా అందుకు విరుద్ధంగా లాటరీ ద్వారా బార్లు కేటాయించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంపై ఆయా వ్యాపార వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బార్లు ఏర్పాటుకు సంబంధించి లైసెన్స్‌ ఫీజుల విషయంలో ప్రభుత్వం ముందు ఎక్సైజ్‌ శాఖ రెండు ప్రతిపాదనలు పెట్టింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విదుదల కానుంది.

-------------

Updated Date - Aug 09 , 2025 | 11:54 PM