Share News

Resurvey రీసర్వేపై నిర్లక్ష్యం వహించొద్దు

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:29 PM

Negligence Towards Resurvey is Unacceptable గ్రామాల్లో నిర్వహిస్తున్న భూముల రీసర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా సర్వే అధికారి పి.లక్ష్మణరావు హెచ్చరించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సచివాలయాల సర్వే సిబ్బందితో సమీక్షించారు.

  Resurvey   రీసర్వేపై నిర్లక్ష్యం వహించొద్దు
మాట్లాడుతున్న జిల్లా సర్వే అధికారి లక్ష్మణరావు

గరుగుబిల్లి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిర్వహిస్తున్న భూముల రీసర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా సర్వే అధికారి పి.లక్ష్మణరావు హెచ్చరించారు. మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సచివాలయాల సర్వే సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘జిల్లాకు సంబంధించి మొదటి విడత 13 గ్రామాలు, రెండో విడత 30 గ్రామాల్లో రీసర్వే జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల వివరాలను విలేజ్‌ సర్వేయర్‌ లాగిన్‌లో పొందుపర్చాలి. క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్లు, ఇతరత్రా వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలి. గతంలో 317 గ్రామాల్లో సర్వే నిర్వహించాం. జూలై నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. వెబ్‌ల్యాండ్‌లో తప్పిదాల కారణంగా గ్రామస్థాయిలో సర్వేకు కొంతమేర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గతంలో నిర్వహించిన రీసర్వేలో అధికంగా లోపాలు ఉన్నాయి. దీని కారణంగా మ్యూటేషన్లకు సమస్యలు ఏర్పడుతున్నాయి. రైతుల స్వాధీనంలోని భూవిస్తీర్ణాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నదాతల భూములు వేరొకరి పేరుపై నమోదై ఉంటే తగిన ఆధారాలు చూపించాలి. తక్షణమే పేరు మార్పు చేస్తాం. ’ అని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌ చిరంజీవి, ఉప తహసీల్దార్‌ ఎం.రాజేంద్ర, మండల సర్వేయర్‌ పి.గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:29 PM