Share News

పర్యాటకంపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:29 AM

జిల్లాలో పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. నాలుగు నియోజకవర్గాల్లో కూడా జలపాతాలు, ఎత్తయిన గిరులు, సాగునీటి ప్రాజెక్టులు ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.

 పర్యాటకంపై నిర్లక్ష్యం
గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద వాటర్‌ఫాల్స్‌

- ప్రతిపాదనలకే పరిమితమైన అభివృద్ధి

- జిల్లాలో ఎన్నో అందమైన ప్రదేశాలు

- అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం

- ఉద్యోగ, ఉపాధి మెరుగుపడే అవకాశం

- ప్రభుత్వం దృష్టిసారించాలని జిల్లా వాసుల విన్నపం

పార్వతీపురం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. నాలుగు నియోజకవర్గాల్లో కూడా జలపాతాలు, ఎత్తయిన గిరులు, సాగునీటి ప్రాజెక్టులు ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ, పాలకులు మాత్రం పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లా ఏర్పడి నాలుగేళ్లు దాటుతున్నా పర్యాటకాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం ప్రతిపాదనలకే అభివృద్ధి పరిమితమవుతుంది. జిల్లాలోని 15 మండలాల్లో అత్యధిక మండలాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను గతంలో, ప్రస్తుతం అధికారులు రూపొందించారు. అదే విధంగా పెద్దగడ్డ రిజర్వాయర్‌, వెంగళరాయ సాగర్‌, తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అడుగులు ముందుకు పడడం లేదు. దీనికి ప్రధాన కారణం నిధులు మంజూరు కాకపోవడమే. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

ఇదీ పరిస్థితి

పాచిపెంట మండలం పెద్దగెడ్డ రిజర్వాయర్‌ వద్ద బోటు షికారుతో పాటు పర్యాటకులకు రాత్రి వసతి, కిడ్స్‌ జోన్‌ తదితర వాటిని ఏర్పాటు చేసేందుకు రూ.2కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కానీ, నిధులు మాత్రం మంజూరు కాలేదు. మక్కువ మండలం వెంగళరాయ సాగరం వద్ద రాక్‌ గార్డెన్‌, ఫ్రీ హోటల్‌, వెడ్డింగ్‌ ప్లాట్‌ఫారం తదితర వాటిని ఏర్పాటు చేసేందుకు రూ.2కోట్లతో, సాలూరు మండలంలోని కొదమ, లొడ్డ, తోనాము, దండిగాము తదితర ప్రాంతాల్లో ఉన్న వాటర్‌ఫాల్స్‌కు పర్యాటకులు వెళ్లేందుకు రహదారులతోపాటు ఆ ప్రాంతాల్లో రూప్‌వే, డ్రెస్సింగ్‌ రూమ్స్‌, మరుగుదొడ్లు నిర్మాణాలకు రూ.కోటితో, కురుపాం నియోజకవర్గంలో తోటపల్లి రిజర్వాయర్‌ వద్ద టూరిస్ట్‌ కాటేజీలతో పాటు రాత్రి వసతి కోసం, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు రూ.2కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి. గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వాటర్‌ఫాల్స్‌ వద్ద పిక్నిక్‌ స్పాట్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మరుగుదొడ్లు, నడక వంతెన తదితర మౌలిక వసతులు ఏర్పాటు కోసం రూ.75 లక్షలు అవసరమని గుర్తించారు. ఇదే మండలంలో సవరకోటపాడు వద్ద అడ్వంచర్‌పార్క్‌ అభివృద్ధి చేపడితే పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో స్విమ్మింగ్‌ పూల్స్‌, టూరిస్ట్‌ కాటేజేస్‌ తదితర వాటి నిర్మాణం కోసం 1.50కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు చేశారు. సీతంపేట మండలంలో జగతిపల్లి కొండల వద్ద రిసార్ట్‌ అభివృద్ధి కోసం రూ.27 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉందని ప్రతిపాదనలు చేశారు. ఈ విధంగా ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలకు మోక్షం లేకపోవడంతో పర్యాటకంగా జిల్లా అభివృద్ధి మాటలకే పరిమితమైంది.

అభివృద్ధి చేయాలి

జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుతం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగడం లేదు. ఏ రంగంలో కూడా జిల్లా అభివృద్ధి లేకపోతే జిల్లా ప్రజలకు ఉపాధి ఏ విధంగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఎంతో మంచిది.

-శ్రీనివాసరావు, పార్వతీపురం

చర్యలు తీసుకోవాలి

ప్రతి జిల్లా ఏదో ఒక రంగంలో ముందంజలో ఉండాలి. కానీ, జిల్లాలో ఆ పరిస్థితి లేదు. పారిశ్రామికంగా ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో జిల్లా యువత ఉపాధి లేక వలసలు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనితో పాటు పర్యాటకంగా జిల్లాను పాలకులు అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

-ఎస్‌.అప్పలనాయుడు, కొమరాడ

Updated Date - Aug 04 , 2025 | 12:29 AM