Share News

రాజాంపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:04 AM

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టు ఉంది రాజాం నియోజకవర్గ పరిస్థితి. జిల్లాల పునర్విభజనతో రాజాం నియోజకవర్గానికి చాలా నష్టం జరిగింది.

   రాజాంపై నిర్లక్ష్యం

- జిల్లాల పునర్విభజనతో నష్టపోతున్న నియోజకవర్గం

- మూడేళ్ల కిందట విజయనగరం జిల్లాలోకి

- అయినా ఇంతవరకు గుర్తింపు లేదు

- సరిహద్దుల విషయంలో ఆర్‌అండ్‌బీ వైఫల్యం

- రెవెన్యూ డివిజన్‌ కేటాయింపులో దగా

- సీటీవో కార్యాలయం కోల్పోయిన వైనం

  • విజయనగరం-పాలకొండ రోడ్డులో చీపురుపల్లి మండలం చివర్లో ఆర్‌అండ్‌బీ ఏర్పాటు చేసిన బోర్డు ఇది. అక్కడితో ఆర్‌అండ్‌బీ హద్దు ముగిసిందని బోర్డుపెట్టారు. కానీ, ఇంకా మరో 50 కిలోమీటర్ల పరిధి ఉంది. రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆమదాలవలస వరకూ విజయనగరం ఆర్‌అండ్‌బీ పరిధి. కానీ, రాజాం నియోజకవర్గం అసలు విజయనగరం జిల్లాలో లేదన్నట్టు ఆర్‌అండ్‌బీ అధికారులు వ్యవహరించారు. గత మూడేళ్లుగా అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దాంగా ఉంది ఈ బోర్డు.


రాజాం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టు ఉంది రాజాం నియోజకవర్గ పరిస్థితి. జిల్లాల పునర్విభజనతో రాజాం నియోజకవర్గానికి చాలా నష్టం జరిగింది. శ్రీకాకుళం జిల్లాతో ఈ నియోజకవర్గానికి దశాబ్దాల అనుబంధం. అభివృద్ధి చెందిన పట్నంగా రాజాంకు గుర్తింపు ఉంది. పారిశ్రామిక, విద్య, వైద్య, వాణిజ్య రంగాల్లో బాగా అభివృద్ధి సాధించింది ఈ పట్టణం. అయితే పునర్విభజన సమయంలో అప్పటి వైసీపీ పాలకుల కన్ను ఈ ప్రాంతంపై పడింది. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అదే జరిగితే రాజాం రిజర్వుడ్‌ నియోజకవర్గం జనరల్‌ కానుంది. ఆ ముందు చూపుతోనే వైసీపీకి చెందిన కీలక నేత రాజాంను విజయనగరం జిల్లాలో కలిపేసినట్టు ప్రచారంలో ఉంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కేంద్రాలు రాజాంనకు ఇంచుమించు సమాన దూరంలో ఉంటాయి. అందుకే పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. భౌగోళికంగా, సామాజికపరంగా ఈ నియోజకవర్గానికి ఎక్కువగా విజయనగరం జిల్లాతోనే సంబంధాలు ఉంటాయి. అందుకే అక్కడ ప్రజలు కూడా రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో కలపడాన్ని స్వాగతించారు. కానీ, నాలుగు దశాబ్దాలుగా ఉన్న సీటీవో కార్యాలయం జిల్లాల పునర్విభజనతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు వెళ్లిపోయింది.


ఇప్పటికీ అదే బాధ

రాజాం రెవెన్యూ డివిజన్‌ కథ కంచికి చేరడాన్ని మాత్రం నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త డివిజన్లను సైతం వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా రాజాం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుచేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. అందుకు తగ్గ ప్రతిపాదనలను కూడా అధికారులు అప్పట్లో సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా విభజన తరువాత రాజాం నియోజకవర్గంలోని రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాలను బొబ్బిలి డివిజన్‌లో విలీనం చేశారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో రాజాంను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశాయి. అయితే ఇంతలో చీపురుపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. అయితే మునిసిపాల్టీగా ఉన్న రాజాంను కాదని.. కేవలం పంచాయతీగా ఉన్న చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడం వెనుక అప్పటి ‘కీ’లక నేత హస్తం ఉందన్నది జగమెరిగిన సత్యం.


అడ్డుకున్న కీలక నేత

రాజాం నియోజకవర్గంలోని రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి మండలాలతో పాటు చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గుర్ల, గరివిడి, మెరకముడిదాం మండలాలు, బొబ్బిలి నియోజకవర్గంలోని తెర్లాం మండలాన్ని కలుపుకొని రాజాంను డివిజన్‌ కేంద్రంగా చేయాలని గత వైసీపీ ప్రభుత్వం భావించింది. అయితే, దీనికి అప్పట్లో ఓ మంత్రి, కీలక ప్రతినిధి అడ్డు తగిలినట్టు ఆరోపణలు ఉన్నాయి. చీపురుపల్లిని కాదని రాజాంను డివిజన్‌ కేంద్రంగా చేస్తే తన రాజకీయాలకు ఇబ్బంది వస్తుందని తెలిసి ఆయన అడ్డుకున్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అప్పట్లో డివిజన్‌ కేంద్రాలకు అవసరమైన ప్రభుత్వ భవనాల గుర్తింపు ప్రక్రియ రాజాంలో పూర్తయింది. ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని ఆర్‌అండ్‌బీ వసతిగృహాన్ని ఆర్డీవో కార్యాలయంగా, శ్రీకాకుళం రోడ్డులోని ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని డీఎస్పీ ఆఫీసుగా, ఠాణావీధిలోని పూర్వపు తహసీల్దారు కార్యాలయాన్ని డీఎల్‌పీవో కార్యాలయం కోసం సిద్ధం చేశారు. కానీ, ఈ ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేసి చీపురుపల్లిని డివిజన్‌ కేంద్రంగా ప్రకటించారు. దీంతో రాజాం నియోజకవర్గ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.


సీటీవో కార్యాలయం తరలింపు..

వాణిజ్య పట్నంగా రాజాంకు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ వ్యాపారులు అధికం. అప్పట్లో 19 మండలాల్లో జీఎస్టీ వ్యాపారులకు సంబంధించి సీటీవో కార్యాలయం ఉండేది. నాలుగు దశాబ్దాలుగా రాజాం పట్టణంలోనే అది కొనసాగేది. కానీ, జిల్లా విభజనతో ఇక్కడున్న కార్యాలయం శ్రీకాకుళం జిల్లాకు తరలిపోయింది. రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాలను విజయనగరం సీటీవో పరిధిలో చేర్చారు. దీంతో ఏ చిన్న పనికైనా వ్యాపారులు విజయనగరం వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు రాజాం నియోజకవర్గ పరిధి ఎక్కువ. జిల్లాల విభజన తరువాత విజయనగరంలో చేరింది రాజాం నియోజకవర్గం. కానీ ఆర్‌అండ్‌బీ పరంగా నియోజకవర్గ ఎల్లాలు, సరిహద్దులు గుర్తిస్తూ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. బోర్డులు కానీ.. సూచికలు కానీ ఏర్పాటుచేయలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


మోసం చేశారు

జిల్లా పునర్విభజనతో రాజాం నియోజకవర్గానికి ఎక్కువగా నష్టం జరిగింది. రెవెన్యూ డివిజనల్‌ కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పి మోసం చేశారు. కార్యాలయ భవనాలను సిద్ధం చేసిన తరువాత అప్పటి వైసీపీ ప్రభుత్వం మాట మార్చింది. అప్పటి వైసీపీ పాలకుల స్వార్ధంతో రాజాం బదులు చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు.

-సీహెచ్‌ రామూర్తినాయుడు, ప్రజాసంఘాల నాయకుడు, రాజాం

నమ్మకద్రోహం

అది నిజంగా వంచనే. ప్రజలు డివిజన్‌ కేంద్రంగా మారుతుందని ఆశించారు. దీంతో రాజాం అభివృద్ధికి అడుగులు పడతాయని అనుకున్నారు. కానీ, జగన్‌ సర్కారు మాత్రం నమ్మించి మోసం చేసింది. రాజాంకు బదులు చీపురుపల్లిని డివిజన్‌ కేంద్రంగా చేసింది. ఆ అన్యాయాన్ని నియోజకవర్గ ప్రజలు మరిచిపోలేదు.

-మూళ్లు సూర్యనారాయణ , స్థానికుడు, రాజాం

Updated Date - Jun 17 , 2025 | 12:04 AM