పాలిటెక్నిక్ కళాశాలలపై నిర్లక్ష్యం
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:11 AM
ఏజెన్సీ ప్రాం తంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఆదరణకు నోచుకో వడం లేదు.
- కనీస వసతులు కరువు
- కానరాని లెక్చరర్లు
- ప్రవేశాలకు ఇష్టపడని విద్యార్థులు
- గతంలో చేరిన వారు టీసీలు తీసుకొని వెళ్లిపోతున్న వైనం
- ప్రభుత్వంపైనే ఆశలు
జియ్యమ్మవలస, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాం తంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఆదరణకు నోచుకో వడం లేదు. సువిశాల ప్రాంగణం, విశాలమైన తరగతి గదులు ఉన్నప్పటికీ ప్రవేశాలకు విద్యార్థులు ఇష్టపడడం లేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం. కనీస వసతులను కల్పించడంలో జగన్ సర్కారు విఫలమైంది. లెక్చరర్లను కూడా నియమించలేదు. కనీసం గెస్ట్ లెక్చరర్లను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు విముఖత చూపుతున్నారు. గతంలో చేరిన విద్యార్థులు టీసీలు తీసుకొని వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో కూటమి ప్రభుత్వంపైనే పాలిటెక్నిక్ కళాశాలల భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ ఏడాది నుంచి అయినా వీటి పరిస్థితి మారి, మంచి విద్య అందుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో పార్వతీపురం, చినమేరంగి, గుమ్మలక్ష్మీపురం, సీతంపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం కళాశాలల పరిస్థితి పరవాలేదు. చినమేరంగి, సీతంపేట కళాశాలల దుస్థితి దారుణంగా ఉంది. గతేడాది ఇక్కడ జాయిన్ అయిన విద్యా ర్థులు తిరిగి టీసీలు తీసుకొని వెళ్లిపోతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కూడా పరిస్థితి మారలేదు. చినమేరంగి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 104 మంది ప్రవేశాలు పొంది 100 మంది తిరిగి వెళ్లిపోయారు. మిగిలిన నలుగురిలో సివిల్ ఇంజనీరింగ్ ఇద్దరు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లమోలో ఒక్కొక్కరు ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో నలుగురు, తృతీయ సంవత్సరంలో పది మంది మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది ఎంతమంది జాయిన్ అవుతారో, ఎంతమంది వెళ్లిపోతారో చూడాలి. సీతంపేటలోని ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కొక్క బ్రాంచ్‌కు ఒక హెడ్, ఒక సీనియర్ లెక్చరర్, ఐదుగురు లెక్చరర్లు ఉండాలి. కానీ చినమేరంగి, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అసలు బోధించే వారే లేరు. వసతి, మెస్, తాగునీటి సౌకర్యం కూడా కరువే. మెస్ సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు ఉండటానికి తగిన వసతి ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ అధికారులకు లేఖ రాసినా స్పందన లేదు.
దశ మారేనా..?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏజెన్సీలోని పాలిటెక్నిక్ కళాశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ కళాశాలల నిర్వహణపై అప్పట్లో ఉన్నత విద్యా మండలి గాని, ప్రభుత్వం గాని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో డిప్లొమాను పూర్తి చేయాలనుకున్న విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయి. బోధించే నాఽథుడే లేక దిక్కుతోచని స్థితిలో సబ్జెక్టుపై పట్టు సాధించలేకపోయారు. గెస్ట్ లెక్చరర్లు వేయాలనుకున్నా తగు నిధులు కూడా అందించలేని పరిస్థితి జగన్ సర్కారు హయాంలో నెలకొంది. దీంతో పాటు కళాశాలల్లో తగు సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ ఉన్నత విద్యా మండలికి, ఆర్‌జేడీలకు లేఖలు రాసినా ప్రయోజనం శూన్యం. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఏజెన్సీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
కదలిక వచ్చింది
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సమస్యలపై ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకుంటోంది. బోధనా సిబ్బంది నియామకం విషయంలో ప్రస్తుతం కౌన్సిలింగ్ జరుగుతోంది. తగు విధంగా బోధనా సిబ్బందిని నియమించి మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది.
నరేష్‌బాబు, ప్రిన్సిపాల్ (ఎఫ్‌ఏసీ), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, చినమేరంగి