Share News

Navodayam… ‘నవోదయం’.. నై!

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:09 AM

Navodayam… Nai గిరిజన ప్రాంతాల్లో నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమం విజయవంతం చేయగలిగితే మంచి ఫలితాలే వస్తాయి. కానీ సీతంపేట ఏజెన్సీలో ఆ పరిస్థితి లేదు. ఎక్సైజ్‌శాఖ నిర్లక్ష్యం , అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగా లక్ష్యం నీరుగారుతోంది.

Navodayam… ‘నవోదయం’.. నై!
నవోదయం 2.0 కార్యక్రమం నిర్వహించని నాటుసారా ప్రభావిత గ్రామం మండ

  • 2.0 కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం

  • కొన్నిచోట్ల తూతూమంత్రంగానే నిర్వహణ

  • ఏజెన్సీలో సారా తయారీ, విక్రయాలు

  • బానిసలై తీవ్రంగా నష్టపోతున్న గిరిజనులు

  • ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు

సీతంపేట రూరల్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమం విజయవంతం చేయగలిగితే మంచి ఫలితాలే వస్తాయి. కానీ సీతంపేట ఏజెన్సీలో ఆ పరిస్థితి లేదు. ఎక్సైజ్‌శాఖ నిర్లక్ష్యం , అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగా లక్ష్యం నీరుగారుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో సారా ప్రభావిత గ్రామాల్లో తూతూ మంత్రగా నవోదయం 2.0 గ్రామసభలు నిర్వహించి మమ అనిపించారు. దీంతో ఏజెన్సీలో నాటుసారా ఏరులై పారుతోంది. ఈ దందా మూడు పూలు.. ఆరుకాయలుగా సాగుతోంది. యథేచ్ఛగా తయారీ, రవాణా, విక్రయాలు సాగుతున్నాయి. ఎక్సైజ్‌ శాఖాధికారులు గుర్తించిన గ్రామాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సారా తయారీ జరుగుతోంది. ఈ వ్యాపారాన్నే నమ్ముకొని కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. సారా తయారీకి ఉపయోగించే ముడిసరుకుల వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. నిషేధం అమలులో ఉన్నా.. కొందరు వ్యాపారులు యథేచ్ఛగా నల్లబెల్లం విక్రయిస్తున్నారు. అయినా దీనిపై పట్టించుకునే వారే కరువయ్యారు.

నవోదయం 2.0 ఏం చెబుతుందంటే..

నవోదయం 2.0లో ఎక్సైజ్‌శాఖ, పోలీస్‌ ,గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి నాటుసారా ప్రభావిత గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. సారా వినియోగంపై అనర్థాలు, తయారీ, రవాణా, అక్రమ విక్రయాలపై చట్టపరమైన చర్యలపై ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. అంతేకాకుండా సారా తయారీదారులకు గ్రామస్థులు సహకరిస్తే ఆయా గ్రామాలకు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయనే సందేశాన్ని చేరవేయాలి. సారా తయారీని విడిచిపెట్టిన వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించాల్సి ఉంది. మరో పక్క సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం సరఫరాదారులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలి. ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించిన సారా ప్రభావిత గ్రామాలపై దాడులు చేసి.. నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. నాటుసారా తయారీ, విక్రయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని 14405 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రకటించారు. అయితే సీతంపేట మన్యంలో మాత్రం ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాలకు సంబంధిత శాఖ అధికారులు తూట్లు పొడుస్తున్నారు.

సారా ప్రభావిత గ్రామాలు ఇవే..

సీతంపేట మన్యంలో ఎక్సైజ్‌శాఖ గుర్తించిన 13 నాటుసారా ప్రభావిత గ్రామాలను ఏ,బీ,సీ క్లాసులుగా విభజించారు. ఈ మేరకు ఏ క్లాసులో మండ, నారాయణగూడ, ఈతమానుగూడ, బుడగరాయి గ్రామాలున్నాయి. బీ క్లాసులో సుందరయ్యగూడ, పెదవంగర ఉన్నాయి. సీ క్లాసులో సీతంపేట, పనసగూడ, అడ్డాకులగూడ, చినబగ్గ, కుసిమిగూడ, మండకాలనీ ఉన్నాయి. ఆయా గ్రామాల్లో నవోదయం 2.0 కార్యక్రమాలు నిర్వహించి సారాను పూర్తిగా నిర్మూలించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇటీవల కాలంలో బీ,సీ క్లాసుల పరిధిలో ఉన్న సారా ప్రభావిత గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే నవోదయం 2.0 కింద గ్రామసభలు నిర్వహించారు. ఏ క్లాసులో ఉన్న నాలుగు గ్రామాల్లో ఇంతవరకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. మిగిలిన గ్రామాల్లో నవోదయం 2.0లో అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ సారా తయారీ, రవాణా, విక్రయాలు అదుపులోకి రాలేదు. దీంతో నాటుసార రహిత గ్రామాలుగా ఇంతవరకు వాటిని ప్రకటించలేకపోయారు.

అవగాహన కల్పించడంలో విఫలం

- నాటుసారాను నియంత్రించడం.. దానికి బానిసలైన వారికి అవగాహన కల్పించి దూరంగా ఉంచడం వంటివి ఎక్సైజ్‌ శాఖాధికారులు చేపట్టాల్సి ఉంది. ఏజెన్సీలో సారా తయారీయే ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకున్న గిరిజనులకు ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంది. ఆర్థికభరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నుంచి లైవ్లీహుడ్స్‌ క్రియేట్‌ చేయడం వంటివి చేపట్టడంతో అధికారులు విఫలమయ్యారనే విమర్మలు వినిపిస్తున్నాయి.

- ఏజెన్సీలో సారా విస్తారంగా లభించడంతో కొందరు గిరిజనులు దానికి బానిసలై ఇళ్లు, ఒళ్లు గుల్లచేసుకుంటున్నారు. మరికొందరు ఇబ్బందులు తప్పవని తెలిసినా ప్రత్యామ్నాయం లేక నాటుసారా తయారీయే వృత్తిగా మార్చుకుంటున్నారు.

ఎందుకింత నిర్లక్ష్యం?

- కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాలు, సారా నిర్మూలన వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీనిలో భాగంగా నవోదయం 2.0, సంకల్పం వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అవగాహన సదస్సులను నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్‌, సారాకు యువత బానిసలు కాకుండా ఉండేందుకు మైదాన ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు పెద్దఎత్తున చేపడుతున్నారు. అయితే గ్రామస్థాయిల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్మలు వినిపిస్తున్నాయి.

- సీతంపేట ఏజెన్సీలో గుర్తించిన 13 గ్రామాల్లో ఇంత వరకు ఒక్కదానిని కూడా సారా రహిత గ్రామంగా ప్రకటించికపోవడం ఎక్సైజ్‌శాఖ పనితనానికి నిదర్శనంగా చెప్పవొచ్చు. సీతంపేట మన్యంలో పదుల సంఖ్యలో నాటుసారా తయారుచేస్తున్న గ్రామాలు ఉన్నాయి. కానీ ఎక్సైజ్‌ అధికారులు మాత్రం కేవలం 13 గ్రామాలనే గుర్తించారు.

- ఇకపోతే చాలా గిరిజన గ్రామాల్లో ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో అడపాదడపా చేస్తున్న దాడుల్లో సారా తయారీ, విక్రయాలు, రవాణా చేస్తు కొందరు వ్యాపారులు పట్టుబడుతున్నారు. అయితే వారిలో అధికశాతం మంది సారా ప్రభావిత గ్రామాలకు చెందిన వారు కాకపోవడం గమనార్హం.

ఎక్సైజ్‌ సీఐ ఏమన్నారంటే..

‘సీతంపేట ఏజెన్సీలో మొదటివిడతగా 13 నాటుసారా ప్రభావిత గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాలను పాలకొండ, రాజాం ,కొత్తూరు ఎక్సైజ్‌ సీఐలు దత్తత తీసుకున్నారు. అక్కడ నవోదయం 2.0 పేరిట గ్రామసభలు పెట్టి గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. అయితే సీతంపేట ఏజెన్సీలో మరో 100 గ్రామాల్లో సారా తయారవుతుంది. వాటిపై కూడా దృష్టిసారిస్తాం. సారా నిర్మూలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.’ అని ఎకైజ్‌ సీఐ సూర్యకుమారి తెలిపారు.

Updated Date - Jun 25 , 2025 | 12:09 AM