Natural Farming ప్రకృతి సాగును ప్రోత్సహించాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:24 AM
Natural Farming Must Be Encouraged ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిం చాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు.
రోడ్లు నిర్మించి డోలీరహిత గ్రామాలుగా తీర్చిదిద్దండి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
పార్వతీపురం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిం చాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి. జిల్లాలో 1,100 ఎకరాల్లో ఉన్న ఆయిల్ పామ్ సాగును 3,300 ఎకరాలకు విస్తరించాలి. సూక్ష్మనీటిపారుదల యూనిట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు శతశాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లను ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి రైతు సేవా క్రేందాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి. దాని పరిధిలో రైతులకు లాభసాటి పంటలు, భూసారం తదితర విషయాలపై చైతన్యపర్చాలి. డిసెంబరు 3న అన్నదాతల ఆలోచనలు తెలుసుకోవాలి. మన్యంలోని అన్ని చెరువుల్లో శతశాతం చేపల పెంపకం చేపట్టాలి. పశు సంవర్థకశాఖ భవనాల ఏర్పాటు, మరమ్మతులకు నాబార్డు నుంచి నిధుల విడుదలయ్యే కృషి చేస్తాం. ’ అని తెలిపారు. రెండేళ్లలో అన్ని గ్రామాలకు రహదారులు నిర్మిం చాలని గతంలో నిర్ణయించామని.. ఇప్పటివరకు వంద రోడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడిం చారు. మిగిలిన 170 రహదారుల పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. డోలీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ విషయంలో అటవీశాఖ నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు.
ఇనాం భూములున్న రైతులకు రూ.8కోట్లు
‘అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో పలువురు రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమైంది. ఇనాం భూముల కారణంగా మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమకాలేదు. వారి కోసం రూ.8 కోట్లు మంజూరు చేస్తున్నాం. కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సరైన వసతులు లేనందున విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. ఇకపై ఇటువంటివి పునరావృతం కారాదు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలి. వర్షాలతో దెబ్బతిన్న పత్తి రైతులకు న్యాయం చేస్తాం. ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం. అధికారుల చొరవతో కేవలం 8 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ’ మంత్రి అచ్చెన్న తెలిపారు.
- ‘జిల్లాలోని ఆసుపత్రి భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. డిసెంబరు 31 నాటికి భ ద్రగిరి, మార్చి 31 నాటికి సీతంపేట మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలి. ప్రాధాన్య క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి.’ అని మంత్రి అచ్చెన్న ఆదేశించారు.
- అదనంగా మంజూరైన నిధులతో సాలూరు ఏరియా ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. సాలూరు పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు రిజిస్ర్టేషన్ చేసి హక్కులు కల్పించాలన్నారు. మట్టి రహదారులను బీటీలుగా మార్చాలని, ఎంఎస్‌ఎంఈ పార్క్‌లకు స్థలాలను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ విక్రాంత్, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
మన్యాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
పార్వతీపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యం, పత్తి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. కొమరాడలో మరో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం.ఆధునిక సాంకేతిక సాగు పద్ధతులు అమలు చేసి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటాం. పాడి పరిశ్రమకు జిల్లా అనుకూలం. ఆ దిశగా దృష్టి సారించి పాడి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేలా చూడాలని అధికారులను ఆదేశించాం. విద్యార్థుల కోసం ప్రతి పాఠశాలలో తాగునీటి వసతికి రూ. ఐదు కోట్ల మంజూరు చేశాం. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తాం. మరో రెండు మాసాల్లో జిల్లాలో అన్ని ఆసుపత్రి భవన నిర్మాణాలు పూర్తి చేయిస్తాం. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయం. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తాం. పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం, ఆసుపత్రుల్లో వైద్యుల నియామకానికి చర్యలు చేపడతాం.’ అని తెలిపారు.