Namo… Narayanaya! నమో.. నారాయణాయ!
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:32 PM
Namo… Narayanaya! వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం జిల్లాలో విష్ణు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు కిటకిటలాడాయి. రామ మందిరాలు కూడా రద్దీగా మారాయి. వేకువ జామునే దేవాలయాలకు భారీగా చేరుకున్న భక్తజనం .. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు.
ఉత్తర ద్వార దర్శనాలకు పోటెత్తిన భక్తులు
గరుగుబిల్లి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం జిల్లాలో విష్ణు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు కిటకిటలాడాయి. రామ మందిరాలు కూడా రద్దీగా మారాయి. వేకువ జామునే దేవాలయాలకు భారీగా చేరుకున్న భక్తజనం .. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించి.. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించి.. పులకించిపోయారు. మొత్తంగా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. కాగాఉదయం 8 గంటలకు కోదండరామస్వామి దేవస్థానంలో హనుమత్ వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమత్ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేయించి.. ఉత్తర ద్వారం గుండా తిరువీధి మహోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. నమో నారాయణ స్మరణతో ఆ ప్రాంణమంతా మార్మోగింది. దేవస్థానం అధికారులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. ఉచిత ప్రసాదాలతో పాటు అన్నసమారాధనను ఏర్పాటు చేశారు. ఊహించని రీతిలో భక్తులు రావడంతో తోపులాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, పాలకొండ, తోటపల్లి దేవస్థానాల ఈవోలు వీవీ సూర్యనారాయణ, బి.శ్రీనివాస్, చైర్మన్ ఎం.పకీరునాయుడు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.