Share News

Nagarjuna is the district president of TDP టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునే

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:13 AM

Nagarjuna is the district president of TDP విజయనగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున పేరును టీడీపీ రాష్ట్రశాఖ అదివారం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన కార్యదర్శిగా విజయనగరం నియోజకవర్గానికి చెందిన ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌ని నియమించింది. నాగార్జున తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, లక్ష్మీవరప్రసాద్‌ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వీరిద్దరూ బీసీ యువకులు కావడం విశేషం.

Nagarjuna is the district president of TDP టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునే
కిమిడి నాగార్జున, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునే

ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్‌

అధికారికంగా ప్రకటించిన పార్టీ

బీసీలకు ప్రాధాన్యం

27న ప్రమాణ స్వీకారం?

విజయనగరం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): విజయనగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున పేరును టీడీపీ రాష్ట్రశాఖ అదివారం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన కార్యదర్శిగా విజయనగరం నియోజకవర్గానికి చెందిన ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌ని నియమించింది. నాగార్జున తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, లక్ష్మీవరప్రసాద్‌ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వీరిద్దరూ బీసీ యువకులు కావడం విశేషం. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈ పర్యాయం టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులు రెండూ బీసీలకే దక్కినట్లయింది.

కిమిడి నాగార్జునకు 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్ఠానం జిల్లాతో పాటు ఇతర జిల్లాల ప్రచార బాధ్యతను అప్పగించింది. అందుకనుగుణంగా ఆయన చురుగ్గా పనిచేసి పార్టీ విజయంలో విశేష పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన అధినేత చంద్రబాబు డీసీసీబీ చైర్మన్‌గా నాగా ర్జునకు అవకాశం ఇచ్చారు. కాగా పార్టీ ఇచ్చిన ఇంటిలిజెన్స్‌ రిపోర్టులో నాగార్జునపై వ్యతిరేకత లేకపోవటంతో అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌లు నాగార్జునకే మరోసారి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. పార్టీలో ఎటువంటి విభేదాలకు తావు లేకుండా నాగార్జున నడిపించగలరని వారు విశ్వసించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- నాగార్జున విదేశాల్లో ఉన్నత చదవులు చదివి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. అందులోనూ ప్రజలు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్న నమ్మకం ఉంది. ఆయనపై ఇతర ఆరోపణలు లేవు.

- ప్రధాన కార్యదర్శిగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత ఐవీపీ రాజు బాధ్యతలు నిర్వహించేవారు. తొమ్మిది పర్యాయాలు ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన వరప్రసాద్‌ చాలా ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. ఈయనకు ఒక అవకాశం కల్పించాలని అధిష్ఠానం భావించింది. వీరిద్దరితో పాటు మరో 38 మంది టీడీపీ జిల్లా కమిటీ సభ్యులుగా ఉంటారు.

- ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ప్రచార కార్యదర్శులతో పాటు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా పలువురికి అవకాశం దక్కింది. జిల్లా కమిటీలోకి ఎవరెవరినీ తీసుకోవాలన్న దానిపై ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను అధిష్ఠానం తీసుకుంది. జిల్లా కమిటీలో కూడా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించనున్నారు.

27న అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రమాణ స్వీకారం

విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా ఖరారైనట్టు సమాచారం. ఈనెల 27న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కిమిడి నాగార్జున, ప్రసాదుల ప్రసాద్‌లు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జనవరి తొలి వారంలో మిగతా కార్యవర్గాల కూర్పు చేపట్టనున్నారు. టీడీపీకి అనుబంధంగా ఉన్న తెలుగుయువత, మహిళ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ, టీఎన్‌టీయుసీ, విద్యార్థి విభాగం, మైనార్టీ విభాగాలకు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వీరి ప్రమాణ స్వీకారం సంక్రాంతి తరువాత విజయనగరంలో జరగనుంది.

జిల్లా అధ్యక్షుల ఎంపికలో సమతూకం: ఎంపీ

విజయనగరం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమతూకం స్పష్టంగా కన్పించిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా అన్ని జిల్లాలకు అధ్యక్ష, కార్యదర్శుల నియామక ప్రక్రియ జరిగిందని, ఇందులో ఎస్‌సీ, బీసీ, ఎస్‌టీ తదితర వర్గాలకు సమాన ప్రాతినిధ్యం లభించిందన్నారు. తద్వారా బడుగు, బలహీన వర్గాల పార్టీగా మరోసారి రుజువైందన్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీలు కృషి చేయాలన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు నారా చంద్రబాబునాయుడు, లోకేశ్‌ల దార్శనికతే తమకు మార్గదర్శకమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 12:13 AM