Nagarjuna again? మళ్లీ నాగార్జునకే?
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:17 AM
Nagarjuna again? తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలను మళ్లీ కిమిడి నాగార్జునకే అప్పగించే అవకాశం ఉంది. ఆ వైపుగా పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోంది. ఈపదవి కోసం వివిధ నియోజకవర్గాల నుంచి ఆశావాహులు ప్రయత్నాలు చేశారు. నిన్నటి వరకూ నెల్లిమర్ల నియోజకవర్గ నేతకు ఈ పదవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అనూహ్యంగా మళ్లీ నాగార్జున పేరే వినిపిస్తోంది.
మళ్లీ నాగార్జునకే?
రెండోసారి టీడీపీ జిల్లా అధ్యక్షునిగా చాన్స్
ఖరారు చేసే ఆలోచనలో అధిష్ఠానం
విజయనగరం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలను మళ్లీ కిమిడి నాగార్జునకే అప్పగించే అవకాశం ఉంది. ఆ వైపుగా పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోంది. ఈపదవి కోసం వివిధ నియోజకవర్గాల నుంచి ఆశావాహులు ప్రయత్నాలు చేశారు. నిన్నటి వరకూ నెల్లిమర్ల నియోజకవర్గ నేతకు ఈ పదవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అనూహ్యంగా మళ్లీ నాగార్జున పేరే వినిపిస్తోంది.
కిమిడి నాగార్జున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా వ్యవహరిస్తుండడంతో టీడీ జిల్లా అధ్యక్ష పదవి వేరొకరికి దక్కుతుందనే భావనలో పలువురు నాయకులు ప్రయత్నాలు చేశారు. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా పోటీ పడినట్లు ప్రచారం సాగింది. కానీ నాగార్జున వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. 2020లో నాగార్జునను టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడిగా తొలుత నియమించారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాలనా వైఫల్యాలను ఎప్పటికప్పుడు నాగార్జున ఎండగడుతూ వచ్చారు. చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ మంజూరు చేయాలంటూ పార్టీ నేతలతో కలిసి ఉద్యమం చేశారు. నిరంతరం కార్యకర్తలు, ప్రజలతో మమేకమవుతూ అందరినీ పార్టీ కార్యక్రమాల వైపు ఆకర్షించేటట్టు ప్రయత్నించారు. యువతకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహించేవారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగట్టేవారు. నాగార్జున పార్లమెంటరీ అధ్యక్షుడిగా వున్న సమయలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, జిల్లాలో అన్ని సీట్లను టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. తొలుత చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని నాగార్జున ఆశించారు. అయితే ఆయన పెద్దనాన్న టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు పేరును చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా అధిష్ఠానం ఖరారుచేయాల్సి వచ్చింది. పరిస్థితిని అర్థం చేసుకున్న నాగార్జున మళ్లీ పూర్వంలా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ పదవి నాగార్జునని వరించింది. డీసీసీబీలో కూడా నాగార్జున తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
నాగార్జున ఎంఎస్‌సీ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేశారు. తండ్రి కిమిడి గణపతిరావు, కిమిడి మృణాళిని రాజకీయాల్లో చురుగ్గా కొనసాగారు. 2014లో తల్లి మృణాళిని చీపురుపల్లి నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేశారు. నాగార్జునకు రాజకీయాల్లో ఆసక్తి ఉండడంతో 2015లో ఉద్యోగం వదిలేసి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆది నుంచి చంద్రబాబునాయుడు, లోకేశ్ వద్ద విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.