My word must prevail! నా మాటే నెగ్గాలి!
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:57 PM
My word must prevail! జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. శాసన సభ్యుల మాటకు కాకుండా వీరికి వ్యతిరేకంగా వర్గాలను నడుపుతున్న నేతల మాటకు విలువ ఉండడంతో మండల, గ్రామ స్థాయి నేతలతో పాటు కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఒకరి వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలను మరో వర్గానికి చెందిన ఎమ్మెల్యే, నేతలు అడ్డుకుంటున్నారు.
నా మాటే నెగ్గాలి!
నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు
పదవులకు వేర్వేరు వ్యక్తుల పేర్లు ప్రతిపాదన
ఒకరికి అనుకుంటే ఇంకొకరికి దక్కుతున్న చాన్స్
- జిల్లాలోని ఓ ప్రముఖ దేవాలయ పాలక మండలి అధ్యక్ష పదవికి ఓ ఎమ్మెల్యే పార్టీ కోసం బాగా పనిచేసిన కార్యకర్త పేరు సూచించారు. పోటీగా మరో కార్యకర్త పేరును ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం రంగంలోకి దింపింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తనకు ఈ పదవి కావాలంటూ పట్టుబడుతున్నాడు. ఈ పదవి రాకపోతే రాజకీయాలను విరమించుకోవడమొక్కటే దారంటూ హెచ్చరిస్తున్నాడు. ఈ పరిస్థితిలో పాలకమండలి అధ్యక్ష పదవెక్కడ చేజారిపోతుందోనని ఎమ్మెల్యే పేరు సూచించిన కార్యకర్త ఆందోళన చెందుతున్నాడు.
- జిల్లాలోని ఓ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్‌కు ఓ గ్రామ స్థాయి నాయకుడి పేరును ఎమ్మెల్యే పంపించారు. ఇదే పరపతి సంఘానికి చైర్మన్‌గా నామినేటెడ్ చేయాలని వేరే కార్యకర్త పేరును ఆ నియోజకవర్గంలో చలామణి అవుతున్న మరో నేత పంపించారు. దీంతో ఎమ్మెల్యే వర్గానికి, ఆ నేత వర్గానికి వాదోపవాదాలు జరిగాయి. ఇద్దరినీ కాకుండా మూడో వ్యక్తిని పెడదామని ప్రతిపాదన చేశారు. ఆ వ్యక్తికే అదృష్టం దక్కింది. ఈ పరిణామంతో ఎమ్మెల్యేపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తి తీవ్ర నిరాశతో ఉన్నాడు.
- జిల్లాలోని మరో నియోజకవర్గంలో పార్టీ మండల అధ్యక్ష పదవికి ఓ నేతకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే వర్గం భావించింది. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్న ఓ నేత వర్గం సామాజిక వర్గ అస్త్రాన్ని బయటకు తీసింది. మరో సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం ఇవ్వడం సముచితమని వాదిస్తోంది. దీంతో ఇంతవరకు పార్టీ మండ ల అధ్యక్ష పదవిని ప్రకటించలేకపోయారు.
శృంగవరపుకోట, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. శాసన సభ్యుల మాటకు కాకుండా వీరికి వ్యతిరేకంగా వర్గాలను నడుపుతున్న నేతల మాటకు విలువ ఉండడంతో మండల, గ్రామ స్థాయి నేతలతో పాటు కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఒకరి వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలను మరో వర్గానికి చెందిన ఎమ్మెల్యే, నేతలు అడ్డుకుంటున్నారు. దీంతో మండల, గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య అంతరాలు ఏర్పడుతున్నాయి. ఒకే పార్టీలో వున్నప్పటికీ ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకుంటున్నారు. దీంతో వైసీపీ పాలనలో అష్టకష్టాలు పడి పార్టీని కాపాడుకున్న నాయకులు, కార్యకర్తలు నైరాశ్యంలోకి వెలుతున్నారు. విజయనగరం జిల్లా టీడీపీకు కంచుకోట. పార్టీ అవిర్భావం నుంచి 2004, 2009, 2019లో తప్ప మరెప్పుడూ ఇతర పార్టీలు ఈ జిల్లాలో కాలుపెట్టలేకపోయాయి. అప్పటికి, ఇప్పటికి ఈ పార్టీకి నేతలు కరువేమో కాని కార్యకర్తలకు కరువు లేదు. పార్టీలను మార్చే నాయకులున్నారేమో కానీ కార్యకర్తలు లేరు. పసుపు జెండాను చూస్తే వారు పులకించిపోతారు. అందుకే వైసీపీ పాలనలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకున్నారు. అలాంటి కార్యకర్తలకు న్యాయం చేయడంలో పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో రాజకీయం చేస్తున్న బడా నేతలు చిన్న చూపు చూస్తున్నారు.
- సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు పార్టీ తరపున అభ్యర్థిత్వం దక్కని వారికి మాత్రమే జిల్లాలో ఇంతవరకు న్యాయం జరిగింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో చెప్పుకోతగ్గ నామినేటెడ్ పదవులను దక్కించుకున్నారు. దాదాపుగా వీరంతా జిల్లాలోని నియోజకవర్గాల్లో శాసన సభ్యులతో పాటు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరికి వారే వర్గాలను పెంచిపోషిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని ప్రజల్లో పనివంతులుగా అనిపించుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. అధిష్టాన పెద్దలతో వున్న పరిచయాలను సాకుగా చూపి అక్కడికక్కడ ఎమ్మెల్యేల అధికారాలకు మించి చేతుల్లోకి తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు వీరి మాటలకే విలువ దక్కుతుండడంతో మండల, గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. ఒకరి దగ్గర కనిపిస్తే మరొకరు కన్నెర్ర చేస్తుండడంతో ఎవరితో ఏ పని అవుతుందో తెలియక సతమతమవుతున్నారు. పార్టీయే సర్వస్వమని నమ్మిన కార్యకర్తకు ఈ పరిస్థితి రుచించడం లేదు. అధిష్టానం తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. రాష్ట్ర స్థాయి డైరెక్టరు పదవులు పదివరకు వచ్చాయి. జిల్లా స్థాయిలో డీసీసీబీ, డీసీఎంఎసీ డైరెక్టర్ పదవులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష, డైరెక్టర్ పదవులు అప్పగించారు. వీటిల్లో చాలా వరకు ఎన్నో ఏళ్లగా పార్టీని నమ్ముకొని పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు దక్కలేదు. ఇప్పటికీ వారు చెప్పుకోతగ్గ నామినేటెడ్ పదవులు వస్తాయన్న ఆఽశతో ఉన్నారు. ఇవి కాకపోతే కనీసం పార్టీ సంస్థాగత పదవులనైన అప్పగిస్తారని ఎదరు చూస్తున్నారు.
- నామినేటెడ్ పదవులైన, పార్టీ సంస్థాగత పదవులైన ఎటువంటి విభేదాలు లేకుండా నాయకులు, కార్యకర్తలకు అప్పగించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. నియోజకవర్గాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. నేతల మధ్య సఖ్యత లేదు. పదవులకు ఏకగ్రీవంగా పేర్లను సూచించలేకపోతున్నారు.
-----------------