Share News

నా మాటే శాసనం

ABN , Publish Date - Jun 12 , 2025 | 11:24 PM

మునిసిపల్‌ సాధారణ సమావేశంలో చైర్‌పర్సన్‌ గౌరీశ్వరీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నా మాటే శాసనం
67, 72 అంశాలను ఆమోదిస్తున్నట్లు చేతులను పైకెత్తిన టీడీపీ కౌన్సిల్‌ సభ్యులు

- మునిసిపల్‌ అజెండాలోని అంశాలను ఆమోదించేది లేదు

- మోజార్టీ సభ్యులు చేతులెత్తినా పట్టించుకోని వైనం

- ఇదీ పార్వతీపురం చైర్‌పర్సన్‌ గౌరీశ్వరీ తీరు

- వైసీపీ కౌన్సిలర్లతో బయటకు వెళ్లిపోవడంపై విమర్శలు

పార్వతీపురంటౌన్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ సాధారణ సమావేశంలో చైర్‌పర్సన్‌ గౌరీశ్వరీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అజెండాలోని పలు అంశాలను ఆమోదించేందుకు ఆమె అంగీకరించలేదు. ఆ అంశాలను ఆమోదించాలని మెజార్టీ సభ్యులు చేతులెత్తినా ఆమె పట్టించుకోలేదు. ‘నా మాటే శాసనం.. నేను చెప్పిందే ఆమోదం’ అన్నట్లు వ్యవహరించారు. పైగా తమ పార్టీ వైసీపీ కౌన్సిలర్లతో కలిసి సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ జరిగింది..

స్థానిక మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ గౌరీశ్వరీ అధ్యక్షతన గురువారం సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలు చర్చకు వచ్చే ముందు 8వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ కోరాడ నారాయణరావు, 24వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ మంత్రి రవికుమార్‌ తదితరులు మాట్లాడారు. ‘మునిసిపల్‌ చరిత్రలో 23 పేజీలతో కూడిన 73 అంశాలు ఆమోదించేందుకు ఎప్పుడూ రాలేదు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడానికి ఇదే నిదర్శనం.’ అనిఅన్నారు. అజెండాలోని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించాలని మెజార్టీ సభ్యులు చేతులు పైకిఎత్తారు. అయితే, చైర్‌పర్సన్‌ గౌరీశ్వరీ మాత్రం అజెండాలోని 67, 72వ అంశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా వైసీపీకి చెందిన వైస్‌చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, యిండుపూరు గున్నేష్‌తో పాటు ఆ పార్టీ కౌన్సిలర్లతో కలిసి సమావేశం మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు.

టీడీపీ సభ్యుల ఆగ్రహం

సభా మర్యాదలు పాటించకుండా, సమావేశం మధ్యలో చైర్‌పర్సన్‌ గౌరీశ్వరీ వెళ్లిపోవడంపై టీడీపీ కౌన్సిలర్లు మంత్రి రవికుమార్‌, బడే గౌరునాయుడు, టి.వెంకటరావు, కోరాడ నారాయణరావు, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చైర్‌పర్సన్‌కు తమవంతు సహాయ సహకారాలు అందించామన్నారు. ఇప్పుడు ఆమెకు అనుకూలంగా లేమని, సమావేశ మందిరం నుంచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 14వ ఆర్థిక సంఘ నిధులు రూ.4 కోట్లతో పట్టణంలోని 30 వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-24లో మంజూరైన 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.2 కోట్ల వరకు ఖర్చు అవ్వలేదన్నారు. ఇప్పటికైనా పట్టణాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. అలాగే 13, 14 వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా అధ్వానంగా మారిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ప్రజాప్రతినిధులుగా తాము ఎందుకున్నట్లు అని 14వ వార్డు కౌన్సిలర్‌, మాజీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, చైర్‌పర్సన్‌ వాయిదా వేసిన రెండు అంశాలకు సంబంధించి మెజార్జీ కౌన్సిల్‌ సభ్యులు చేతులను ఎత్తి తమ ఆమోదాన్ని తెలిపారు. ఈ విషయమై మునిసిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ వేంకటేశ్వర్లును వివరణ కోరగా.. ‘సమావేశం మధ్యలో చైర్‌పర్సన్‌ బయటకు వెళ్లిపోవడం సరికాదు. మెజార్టీ కౌన్సిల్‌ సభ్యుల తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. చైర్‌పర్సన్‌ ఆమోదించని అంశాలపై మెజార్జీ కౌన్సిల్‌ సభ్యులు అసంతృప్తి తీర్మానాన్ని (డిసెంట్‌)ను కలెక్టర్‌, మునిసిపల్‌ కమిషనర్‌తో పాటు చైర్‌పర్సన్‌కు అందించవచ్చు.’ అని తెలిపారు.

Updated Date - Jun 12 , 2025 | 11:24 PM