Share News

నా తండ్రిని చంపేశారు

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:55 PM

తన తండ్రి ముత్యాల నాయుడు(70) మృతికి కారకులైన ఇద్దరు లారీ డ్రైవర్లపై, సకాలంలో కేసు నమోదు చేయని సంతకవిటి ఎస్‌ఐపై, అలాగే ఆగ్రో ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవా లని పొనుగుటివలసకు చెందిన కోడూరు లక్ష్మునాయుడు డిమాండ్‌ చేశారు.

నా తండ్రిని చంపేశారు

  • బాధ్యులపై చర్యలు తీసుకోండి

  • మృతదేహంతో ధర్నాకు దిగిన బాధితుడు

రాజాం రూరల్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): తన తండ్రి ముత్యాల నాయుడు(70) మృతికి కారకులైన ఇద్దరు లారీ డ్రైవర్లపై, సకాలంలో కేసు నమోదు చేయని సంతకవిటి ఎస్‌ఐపై, అలాగే ఆగ్రో ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవా లని పొనుగుటివలసకు చెందిన కోడూరు లక్ష్మునాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం రాజాం రూరల్‌ సీఐ ఉపేంద్రరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం రైస్‌మిల్లు ప్రాంగణంలో మృతదేహంతో ధర్నాకు దిగారు. లక్ష్మునా యుడు పోలీసులకు అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పొనుగుటివలస గ్రామానికి చెందిన కోడూరు ముత్యాలనాయుడు పాలకొండ రోడ్డులోని లక్ష్మీనారా యణ ఆగ్రో ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లులో ఏడాదిగా నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. గతనెల 14న రాత్రి సమయంలో ఇద్దరు లారీ డ్రైవర్లు ఊక లోడ్‌ చేసేందుకు వచ్చి మిల్లు ప్రాంగణంలో మద్యం తాగేందుకు ప్రయత్నించగా.. ముత్యాల నాయుడు అభ్యంతరం చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన ఇద్దరు లారీ డ్రైవర్లు ముత్యాలనాయుడిపై కర్రలతో దాడిచేశారు. దీంతో రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించిన ముత్యాలనాయుడికి శస్త్రచికిత్స నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు. ఈనెల 6న ముత్యాలనాయుడు మృతిచెందారు.

మృతుడి కొడుకు లక్ష్మునాయుడు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తన తండ్రిని కర్రలతో దాడిచేసి కొట్టిన విషయంపై వెంటనే సంతకవిటి ఎస్‌ఐ గోపాలరావుకు ఫిర్యాదు చేశానని, అయినా పట్టించుకోలేదని తెలిపారు. మిల్లు యాజమాన్యానికి ఎస్‌ఐ అనుకూలంగా వ్యవహరించి, వారిపై కేసు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. దీంతో తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించి మృతిచెందారని, ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని లక్ష్మునాయుడు కోరారు.

కేసు నమోదు చేశాం

ముత్యాలనాయుడిపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించాం. వారిపై కేసు నమోదు చేశాం. ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. ప్రతిఒక్కరూ చట్టపరిధిలో వ్యవహరించాలి. చట్టాన్ని వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవు.

- ఉపేంద్రరావు, రాజాం రూరల్‌ సీఐ

Updated Date - Sep 07 , 2025 | 11:55 PM