‘Mustabhu’ ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముస్తాబు’ తప్పనిసరి
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:12 AM
‘Mustabhu’ Mandatory in Government Schools జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో విధిగా ముస్తాబు కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
బెలగాం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో విధిగా ముస్తాబు కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పాఠశాల ప్రాంగణాల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. పరిశుభ్ర వాతావరణం కనిపించాలని, పచ్చని మొక్కలు, పూలతో ఆకర్షణీయంగా ఉండాలని తెలిపారు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించి వాటి సంరక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. వెలవెలబోయిన గోడలు, నాచుతో ఉన్న ప్రదేశాలను శుభ్రపరిచి వాటికి సున్నం వేయించాలని సూచించారు. ప్రతి తరగతిలో చెత్త డబ్బాను ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు కూడా ముస్తాబు వర్తిస్తుందని స్పష్టం చేశారు. పిల్లలు చేతులు కడిగే స్థలం, మరుగుదొడ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి నెల క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. కబడ్డీ తదితర క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అథ్లెటిక్స్‌కు పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రతి శనివారం ఆనందలహరి పేరుతో పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆదేశించారు. విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలనానరు. అనంతరం ముస్తాబు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బి.రాజ్‌కుమార్, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి శ్యామల తదితరులు పాల్గొన్నారు.