Share News

mustabhu ‘ముస్తాబు’ అదుర్స్‌!

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:31 AM

mustabhu is Awesome! విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ‘ముస్తాబు’కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ప్రయోగా త్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు దక్కాయి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల సదస్సులో సీఎం దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.

mustabhu  ‘ముస్తాబు’ అదుర్స్‌!
విశ్వనాథపురం పాఠశాలలో ఓ విద్యార్థికి అద్దం చూపిస్తూ తల దువ్వుతున్న క్లాస్‌ లీడర్లు (ఫైల్‌)

  • కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డికి అభినందనలు

  • విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా చర్యలు

  • రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఆదేశం

పార్వతీపురం, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ‘ముస్తాబు’కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ప్రయోగా త్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు దక్కాయి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల సదస్సులో సీఎం దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి తరగతి గది బయట బకెట్‌తో నీరు, సబ్బు, అద్దం, టవల్‌, దువ్వెన, పౌడర్‌ అందుబాటులో ఉంచి.. విద్యార్థులు పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. కేవలం రెండు నెలల కాలంలో ముస్తాబు కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించిన కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆర్థిక భారం లేని ఇటువంటి కార్యక్రమాల నిర్వహణపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలని ఆదేశించారు. గిరిజన పాఠశాలల్లో అద్దం పెట్టాలని గతంలో ఒకసారి ప్రధానమంత్రి మోదీ తన వద్ద ప్రస్తావించారన్నారు. దీనివల్ల పిల్లలు పరిశుభ్రంగా తయారై పాఠశాలలకు వచ్చే ముందు అద్దం చూసుకుంటారన్న మాటలు.. ముస్తాబు కార్యక్రమం చూసిన తర్వాత తనకు గుర్తుకొచ్చాయని వెల్లడించారు. ఏదేమైనా పిల్లల ఆరోగ్య సంరక్షణకు దోహదపడే ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సూచించారు.

జిల్లాలో అమలు ఇలా..

జిల్లాలో ఉన్న 1,703 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మొత్తంగా 1,14,531 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ముస్తాబు కార్యక్ర మంపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో ప్రత్యేకంగా ప్రస్తావిం చడం ఆనందంగా ఉందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో పిల్లల పరిశుభ్రతతో పాటు వారి ఆరోగ్యాలపై ప్రత్యేకగా దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ముస్తాబు కార్య క్రమం విజయవంతంగా జిల్లాలో అమలు చేస్తున్నామని వెల్లడించారు.

భామిని పర్యటనలో తెలుసుకున్న సీఎం

భామిని ఆదర్శ పాఠశాలలో ఈ నెల 5న నిర్వహించిన మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ సమావేశానికి హాజరైన సీఎం ‘ముస్తాబు’ గురించి తెలుసుకున్నారు. ఆత్మీయ సమావేశ వేదికపై ఈ కార్య క్రమాన్ని ఓ విద్యార్థిని వివరించింది. ఆ తర్వాత మధ్యాహ్న భోజన సమయంలో సీఎం చంద్రబాబు ముస్తాబుపై మరోసారి విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.

Updated Date - Dec 11 , 2025 | 12:31 AM