క్షణికావేశంలో హత్యలు
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:13 AM
జిల్లాలో నేర సంస్కృతి పెరుగుతుంది. ఆరు నెలల వ్యవధిలోనే ఐదు హత్యలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
- ఆరు నెలల్లో ఐదు ఘటనలు
- జిల్లాలో పెరుగుతున్న నేర ఘటనలు
- వివాహేతర సంబంధాలు, ఆస్తితగాదాలే కారణం
- మనిషిలో తగ్గిన మానవతా విలువలు
- వైవాహిక బంధంలో కొరవడిన నమ్మకం
విజయనగరం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):
ఈ నెల 7న బొబ్బిలిలో కారగాని పద్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె మరిది కుమారుడు సంతోష్.. పద్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆస్తి వివాదాలతో పాటు చేతబడి అనుమానంతో ఆమెను హత్య చేసినట్టు నిందితుడు పోలీసు విచారణలో వెల్లడించాడు.
ఈ ఏడాది మే 7న శృంగవరపుకోట మండలం చామలాపల్లిలో ప్రసాద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో గ్రామానికి చెందిన నడుపూరి మురళీకృష్ణ ఈ నేరానికి పాల్పడ్డాడు. పోలీస్ విచారణలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు తేలింది.
ఈ ఏడాది ఏప్రిల్ 5న గరివిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కత్తితో పొడిచి ఓ యువకుడు పరారయ్యాడు. ప్రేమించిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రేమించిన యువతి తనను పక్కనపెట్టడంతో తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ ఏడాది ఏప్రిల్ 26న పూసపాటిరేగ మండలం నడుపూరి కల్లాలులో కన్నకుమారుడే తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి పాశవికంగా చంపేశాడు. ఆస్తి వివాదం నేపథ్యంలో పాండ్రంకి అప్పలనాయుడు, జయ దంపతులపై సొంత కుమారుడు రాజశేఖర్ కక్ష పెంచుకున్నాడు. దీంతో ట్రాక్టర్‌తో ఢీకొట్టి దారుణంగా హత్య చేశాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 11న తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన కొనారి ప్రసాద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌ను సమీప బంధువులే హత్య చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.
జిల్లాలో నేర సంస్కృతి పెరుగుతుంది. ఆరు నెలల వ్యవధిలోనే ఐదు హత్యలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కక్షలు, పగ, ప్రతీకారాలతో క్షణికావేశానికి లోనై హత్యలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు హత్యలకు ప్రధాన కారణాలవుతున్నాయి. ప్రేమించిన మహిళ, సహ ధర్మచారి వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేక క్షణికావేశానికి గురై కొందరు హత్యలకు తెగబడుతున్నారు. తమ పిల్లలను అనాథలు చేస్తున్నారు. సమాజంలో వారు చిన్నబోయేలా చేస్తున్నారు.
అలా నేరాల వైపు..
పెరుగుతున్న టెక్నాలజీ, స్వేచ్ఛా జీవితం నేరాల వైపు అడుగులు వేసేలా చేస్తోంది. మనిషిలో మానవతా విలువలు తగ్గిపోవడం, లేకపోవడంతోనే అనర్థాలు జరుగుతున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి మానవతా విలువల పట్ల అవగాహన లేకపోవడం కూడా ఈ అనర్థాలకు కారణమవుతోంది. గతంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా పెద్దలు ఆలోచన చేసేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు కావడంతో ఎవరి జీవితం వారిది అన్నట్టు భార్య, భర్తతో పాటు పిల్లలు వ్యవహరిస్తున్నారు. దీంతో ఏది మంచి ? ఏది చెడు ? జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవడం ఎలా? అనేది తెలియడం లేదు. నేనే బాగుండాలి. దీనికోసం ఏంచేసినా ఫర్వాలేదు అన్న ధోరణి సమాజంలో ఎక్కువగా పెరుగుతోంది. ఇదే నేర సంస్కృతికి కారణమని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, సెల్‌ఫోన్ల వినియోగం పెరిగిన తరువాత ఇటువంటి నేరాలు అధికమయ్యాయన్నది బహిరంగ రహస్యం. సెల్ ఫోన్లను సద్విని యోగం కంటే దుర్వినియోగానికే ఎక్కువగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫోన్లలో పరిచయమైన అపరిచిత వ్యక్తులతో మాటలు కలపడం, వారితో స్నేహం పెంచుకోవడంతో అనేక అనర్థాలకు దారితీస్తున్నాయి. వేరే వారితో పెట్టుకునే వివాహేతర సంబంధాలు సజావుగా సాగుతున్న సంసారంలో చిచ్చులు పెడుతున్నాయి.
సినిమాల మాదిరిగా ఘటనలు..
ఒకప్పుడు హత్యలు క్షణికావేశంలో జరిగేవి. ప్రస్తుతం హతమార్చేందుకు పన్నుతున్న పన్నాగాలు అందర్నీ విస్తుగొలిపేలా ఉన్నాయి. వివాహేతర సంబంధాలతో భార్య, ప్రియుడితో కలిసి ఎక్కువగా హతమార్చిన ఘటనలు బయటపడుతున్నాయి. వివాహ బంధంతో కలిసి ఉండేందుకు ఇష్టపడకపోవడం, విడిపోవాలంటే వెంటనే వీలుకాకపోవడం వల్ల కూడా హత్యలు పెరుగుతున్నాయి. మరోవైపు మద్యం, గంజాయి మత్తులో మనిషి విచక్షణ కోల్పోతుంటాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగి హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒక మనిషి హత్య చేసే పరిస్థితికి వచ్చాడంటే దాని చుట్టూ చాలావరకూ పరిణామాలు జరిగి ఉంటాయి. మద్యం మత్తులో జరిగిన ఘాతుకాలే అధికంగా ఉంటున్నాయి.
నమ్మకం ఉండాలి
వైవాహిక బంధంలో నమ్మకం అనేది కీలకం. సంసారంలో ఎన్నో విభేదాలు, అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లాలి. సొంత వారి పట్ల అభిమానం, గౌరవం ఉంటే ఆస్తి తగాదాలు వంటివి రావు. మనకున్న దానితో సంతృప్తి చెందడం ప్రశాంత జీవనానికి ముఖ్యం. ఇది గ్రహిస్తే అసలు అనర్థాలే జరగవు. ప్రస్తుతం చాలామంది యువతలో మానవీయ విలువలు లోపించాయి. డ్రగ్స్, మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమ, మితిమీరిన స్నేహం, వీడియో గేమ్స్, టీవీ, సినిమాలు, సోషల్ మీడియాలో చూపించే హింసాత్మక దృశ్యాలు, వదంతులను నమ్మడం, నిరుద్యోగం వంటి కారణాలతో యువతలో మానవీయ దృక్పథం తగ్గిపోతుంది. పిల్లలకు విలువలతో కూడిన బోధన అందించాలి. గుడ్ పేరేంటింగ్, కౌన్సెలింగ్‌తో వారిలో మానవీయత పెరుగుతుంది.
-డాక్టర్ సూర్యనారాయణ, మానసిక వైద్య నిపుణులు, విజయనగరం