Murder for two tolas of gold రెండు తులాల బంగారం కోసమే హత్య
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:23 AM
Murder for two tolas of gold రెండు తులాల బంగారం కోసం వరసకు అన్నయ్య అయ్యే 70 ఏళ్ల వృద్ధుడిని కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం విలేకరులకు తెలిపారు.
రెండు తులాల బంగారం కోసమే హత్య
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు
కొత్తవలస, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : రెండు తులాల బంగారం కోసం వరసకు అన్నయ్య అయ్యే 70 ఏళ్ల వృద్ధుడిని కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం విలేకరులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.
ముసిరాం గ్రామంలో ఈ నెల 5న సాయంత్రం గ్రామానికి చెందిన శిమ్మ అప్పారావు(70)ను అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన ఎస్.అప్పారావు కలిశాడు. అనంతరం రెండుతులాల బంగారం విషయమై వారి మధ్య గొడవ జరిగింది. అది ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన ఎస్.అప్పారావు తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో శిమ్మ అప్పారావును కాల్చేశాడు. తీవ్రంగా గాయపడిన శిమ్మ అప్పారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
నిందితుడు ఎస్.అప్పారావు చనిపోయిన శిమ్మ అప్పారావుకు వరసకు తమ్ముడు. శిమ్మ అప్పారావు చెల్లెలు కుమార్తెను ఎస్.అప్పారావు వివాహం చేసుకున్నాడు. ఎస్.అప్పారావు భార్య ఇదివరకే మృతి చెందింది. ఆమెకు సంబంధించిన రెండు తులాల బంగారాన్ని ఎస్.అప్పారావు అత్త తెచ్చి తన తమ్ముడు శిమ్మ అప్పారావు వద్ద దాచింది. ఆ బంగారం కోసం ఎస్.అప్పారావు గత కొద్ది రోజులుగా గొడవ పడుతున్నాడు. ఈనెల 5వ తేదీ సాయంత్రం ఎస్.అప్పారావు తన ఆటోలో పాతవలస నుంచి ముసిరాం వచ్చాడు. అనంతరం గొడవ పడి శిమ్మ అప్పారావును నాటు తుపాకీతో కాల్చేశాడు. ఘటనపై శిమ్మ అప్పారావు భార్య సింహాచలం కొత్తవలస సీఐ షణ్ముఖరావుకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఎస్.అప్పారావుకు చెందిన ఆటోను పోలీసులు తొలుత స్వాధీనం చేసుకోగా హత్యకు వినియోగించిన నాటు తుపాకీని కె.కోటపాడు మండలం మర్రివలస వద్ద స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎస్.అప్పారావు తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకుని ప్రశ్నించి అరెస్టు చేశారు. నిందితుడిని కొత్తవలస కోర్టులో బుధవారం హాజరుపర్చారు. విలేకరుల సమావేశంలో సీఐ షణ్ముఖరావు, ఎస్‌ఐ ప్రసాదరావు, ఏఎస్‌ఐ యువరాజు తదితరులు పాల్గొన్నారు.