Murder for not paying money డబ్బులు ఇవ్వలేదని హత్య
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:22 AM
Murder for not paying money తనకు రావాల్సిన డబ్బులు, బంగారం ఇవ్వడం లేదని కక్ష పెట్టుకున్న ఓ వ్యక్తి చివరకు నాటు తుపాకీతో వచ్చి కాల్చి చంపేశాడు. ముసిరాం గ్రామంలో ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
డబ్బులు ఇవ్వలేదని హత్య
- నాటు తుపాకీతో కాల్చిచంపిన వైనం
- కొద్దిరోజుల కిందటే చంపుతానని బెదిరించిన నిందితుడు
కొత్తవలస, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): తనకు రావాల్సిన డబ్బులు, బంగారం ఇవ్వడం లేదని కక్ష పెట్టుకున్న ఓ వ్యక్తి చివరకు నాటు తుపాకీతో వచ్చి కాల్చి చంపేశాడు. ముసిరాం గ్రామంలో ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
ముసిరాంకు చెందిన శిమ్మ అప్పారావు(60) చెల్లెలు వేపాడ మండలం బొద్దాం గ్రామంలో ఉంటోంది. ఈమె అల్లుడు అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పాతవలసకు చెందిన ఎస్.అప్పారావుకు, శిమ్మ అప్పారావుకు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి, బంగారం విషయమై వివాదాలు కొనసాగుతు న్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ముసిరాం గ్రామానికి చెందిన శిమ్మ అప్పారావు ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర ఆయన లేకపోవడంతో ముసిరాం-కొత్తభూమి గ్రామాల మధ్యలో ఉన్న కళ్లాల వద్దకు వెళ్లాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు, బంగారం, భూమి గురించి శిమ్మ అప్పారావుతో గొడవ పడ్డాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన ఎస్.అప్పారావు తనతో తెచ్చుకున్న నాటు తుపాకీతో శిమ్మ అప్పారావును కాల్చేశాడు. అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి శిమ్మ అప్పారావు మృతి చెందాడు. వారం రోజులు కిందట కూడా నిందితుడు ఎస్.అప్పారావు, మృతుడు అప్పారావు ఇంటికి వచ్చి ఘర్షణ పడినట్టు, ఆ సమయంలో ఎప్పటికైనా చంపేస్తానని ఎస్.అప్పారావు బెదిరించి వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు. అన్నట్టుగానే మంగళవారం సాయంత్రం నిందితుడు ఎస్.అప్పారావు వచ్చి శిమ్మ అప్పారావును కాల్చి చంపాడు. నిందితుడు శిమ్మ అప్పారావు భార్య కొద్ది రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన అప్పారావుకు భార్య అచ్చియ్యమ్మతో పాటు కుమార్తె, కొడుకు ఉన్నారు. హత్యపై స్థానిక పోలీసులకు సమాచారం అందగా కొత్తవలస సీఐ షణ్ముఖరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాటు తుపాకీతో పరారీ అయ్యాడు. శిమ్మ అప్పారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శృంగవరపుకోట ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.