Share News

mungeru people fire ముంజేరు రణరంగం

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:54 PM

mungeru people fire ముంజేరులోని సిద్దార్థ కాలనీ గురువారం రణరంగమైంది. మురుగు కాలువ నిర్మాణ విషయమై మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండువర్గాల వారు బాహాబాహీకి దిగారు. కారం, రాళ్లు విసురుకున్నారు. ఆ రాళ్లు పక్కనే ఉన్న పాఠశాల పిల్లల మధ్యాహ్న భోజనంలో పడి ఆహారం పాడైంది. కొట్లాటను చూసిన పిల్లలు భయపడిపోయారు.

mungeru people fire ముంజేరు రణరంగం
ముంజేరులో ఇరువర్గాలు కొట్లాడుకుంటున్న దృశ్యం

ముంజేరు రణరంగం

మురుగు కాలువ నిర్మాణంపై మొదలైన గొడవ

రెండువర్గాల బాహాబాహీ

కారం జల్లి, రాళ్లు రువ్వుకున్న వైనం

రాళ్లు పడి పాడైన పిల్లల మఽధ్యాహ్న భోజనం

విచారించిన డీఎస్పీ

ఎస్సీ కమిషన్‌ను కలిసిన సిద్ధార్థకాలనీ వాసులు

ముంజేరులోని సిద్దార్థ కాలనీ గురువారం రణరంగమైంది. మురుగు కాలువ నిర్మాణ విషయమై మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండువర్గాల వారు బాహాబాహీకి దిగారు. కారం, రాళ్లు విసురుకున్నారు. ఆ రాళ్లు పక్కనే ఉన్న పాఠశాల పిల్లల మధ్యాహ్న భోజనంలో పడి ఆహారం పాడైంది. కొట్లాటను చూసిన పిల్లలు భయపడిపోయారు. ఏం జరుగుతుందోనని స్థానికులూ కలవరపడ్డారు. పోలీసులు వచ్చినప్పటికీ చాలా సేపటి వరకు పరిస్థితి అదుపులోకి రాలేదు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ గోవిందరావు ఘటనపై ఆరా తీశారు. ఘటనపై సిద్దార్థకాలనీ వాసులు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు.

భోగాపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి):

ముంజేరు గ్రామంలో సిద్దార్థకాలనీ వాసులకు, మిగతా నివాసాలకు మధ్య మురుగుకాలువ సమస్య కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. కాలనీ మీదుగా మురుగు కాలువ నిర్మాణానికి ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమని వారు పట్టుబట్టగా తవ్వి తీరుతామని ముంజేరు గ్రామస్థులు ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో అనేక సార్లు గొడవలు జరిగాయి. ఊరి ప్రజల వాడుక నీరంతా తమ ప్రాంతం మీదుగా వెళ్తే ఇబ్బంది పడతామనేది కాలనీవాసుల మాట. ఈ నేపథ్యంలోనే కాలువ సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై సిద్దార్థ కాలనీ వాసులు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అయితే ఇటీవల మురుగు కాలువ నిర్మాణానికి పంచాయతీ తీర్మానం చేయడంతో కాంట్రాక్టర్‌ బంకపల్లి నూకాలమ్మ ఈనెల 18న కాలువ నిర్మాణానికి ప్రయత్నించారు. ఆ సమయంలో సిద్దార్థకాలనీ వాసులు అడ్డుకున్నారు. మరోసారి గురువారం ముంజేరు గ్రామస్థులందరూ కలిసి ఎలాగైనా కాలువను తవ్వి తీరుతామని పట్టుబట్టి ఎక్సకవేటర్‌తో పనులు ప్రారంభించారు. విషయం తెలిసి సిద్ధార్థకాలనీకి చెందిన మహిళలు కాలువ తవ్వకుండా అడ్డంగా బైఠాయించారు. అదే సమయంలో ముంజేరు గ్రామానికి చెందిన మహిళలు వారిని నెట్టడానికి ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మహిళల మధ్య గొడవ మొదలైంది. అంతలోనే బాహాబాహీకి దిగారు. మిగతా వారు కూడా పెద్దసంఖ్యలో మోహరించి ఒకరినొకరు నిలదీసుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పింది. ఘర్షణ తలెత్తింది. సుమారు 45 నిమిషాల పాటు తోపులాటలు, పిడిగుద్దులు, జుట్టు పట్టుకొని ఈడ్చుకోవడాలు జరిగాయి. కొందరు కారం జల్లారు. మరోవర్గం రాళ్లు రువ్వారు. ఆ సమయంలో చాలా మంది కళ్లల్లోకి కారం, ఇసుక పడడంతో అవస్థలు పడ్డారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ సూర్యకుమారి ఇరువర్గాల వారినీ వారించడానికి ఎంత ప్రయత్నించినా ఎవరూ వినలేదు. ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మాత్రమే ఉండడంతో ఎంత ప్రయత్నించినా ఇరువర్గాలూ తగ్గలేదు. ఎస్‌ఐ సూర్యకుమారి ముఖంపై కారం, కళ్లలో ఇసుక పడడంతో ఇబ్బంది పడ్డారు. గొడవ సమయంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి రాళ్లు పడడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. రాళ్లు పడి గుడ్డుకూర, సాంబరు పాడైంది. దీంతో పాఠశాల ప్రధానోపాద్యాయుడు పి.నాగేశ్వరావు సమీప హైస్కూల్‌ నుంచి కూరను తీసుకొచ్చి విద్యార్థులకు అందించారు. కొద్దిసేపటి తర్వాత ముంజేరు గ్రామస్థులందరూ వచ్చి కాలనీ వాసులను లాగి మురుగుకాలువ తవ్వకాలు కొనసాగించారు. అనంతరం సిద్దార్థకాలనీ మహిళలు విజయనగరం వెళ్లి ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌కు గోడు వినిపించారు. విషయం తెలుసుకొన్న విజయనగరం డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, సీఐ దుర్గా ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకొని ఈవోపీఆర్‌డీవో గాయిత్రి, కార్యదర్శి రమణమ్మను విషయం అడిగి తెలుసుకొన్నారు. ఉద్రిక్తతలో ముంజేరు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు తమ బంగారు గొలుసులు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కానరాని మండల అధికారులు

ముంజేరు పంచాయతీ సిద్దార్థకాలనీలో మురుగుకాలువ సమస్యపై తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంటే మండల స్థాయి అధికారులు రాలేదు. తగినంత మంది పోలీసులను ఏర్పాటు చేయకపోవడంతోనే పరిస్థితి చేయిదాటిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:54 PM