Share News

Multi-Specialty Hospital మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం

ABN , Publish Date - Jul 08 , 2025 | 10:55 PM

Multi-Specialty Hospital Works Accelerated జిల్లా కేంద్రం పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతంగా పూర్తి చేసి, త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడారు.

Multi-Specialty Hospital  మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం
ఆసుపత్రి పనులపై చర్చిస్తున్న కలెక్టర్‌

బెలగాం, జూలై 8(ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రం పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతంగా పూర్తి చేసి, త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడారు. నాణ్యతలో రాజీ పడరాదని, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఇది వ్యాధుల సీజన్‌ కావడంతో జిల్లా కేంద్రాసుపత్రికి రోగుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున అదనంగా పడకలు ఏర్పాటు చేయాలని వైద్యులను ఆయన ఆదేశించారు.

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు

జిల్లాలో కౌలు రైతులకు యుద్ధప్రాతిపదికన గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే రెవెన్యూ శాఖ జారీచేసే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్డులు కలిగిన వారు మాత్రమే పంట నమోదు చేసుకునే అవకాశం ఉందని, దాని ఆధారంగా బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ తదితర పథకాలు అందుతాయన్నారు. పశు సంవర్థక శాఖ ద్వారా గొర్రె పిల్లల పెంపకం యూనిట్లు స్థాపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 100 ఎకరాల్లో సెరీకల్చర్‌ చేపట్టేలా పట్టు పరిశ్రమ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ, పశు సంవర్థక, పట్టు పరిశ్రమల శాఖాధికారులు రాబర్ట్‌ పాల్‌, మన్మఽథరావు, సాల్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల కొరత లేదు

జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరుకు దాదాపు 21,542 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేయగా, ఇప్పటి వరకు మన్యానికి 19,357 మెట్రిక్‌ టన్నులు వచ్చాయని తెలిపారు. వాటిని పంపిణీ చేశామన్నారు. కొద్దిరోజుల్లో 5 వేల టన్నుల యూరియా, 3 వేల టన్నుల డీఏపీ వస్తుందని చెప్పారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని కోరారు.

మిషన్‌ కల్పవృక్షతో అద్భుత ఫలితాలు

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో తలపెట్టిన మిషన్‌ కల్పవృక్ష కార్యక్రమంతో అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేల ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మంగళవారం 2,400 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువు గట్లు, పొలంగట్లపై ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చని వెల్లడించారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని గిరిజనుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గొర్రెలు, మేకలకు జిల్లాలో మంచి డిమాండ్‌ ఉందని, ఇందుకు అవసరమైన యూనిట్లు స్థాపించాలని ఆదేశించారు. మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ , సామాజిక భవనాలను వీడీవీకేలు వినియోగిం చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వారం గిరిబజార్లు ప్రారంభం కావాలన్నారు. పాచిపెంట, సీతంపేట, బలిజిపేట ప్రాంతాల్లో పట్టు పరిశ్రమలను నెలకొల్పాలని ఆదేశించారు. ఈ ఏడాది పశు సంవర్థకశాఖ ద్వారా 143 యూనిట్లు లక్ష్యం కాగా, 30 మా త్రమే గ్రౌండింగ్‌ అయినట్లు తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 10:55 PM