జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:33 AM
జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.
- 15 మంది రైతులకే పరిహారం బకాయి
- ప్రజలు మాయమాటలు నమ్మొద్దు
- కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధికి, యువతకు ఉద్యోగాల కల్పనకు ఈ పార్కు దోహదపడుతుందన్నారు. దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జిందాల్ భూములకు సంబంధించి కేవలం 15 మందికి రైతులకు మాత్రమే పరిహారం బకాయి ఉంది. పరిశ్రమ ఏర్పాటుకు గతంలోనే సుమారు 1166 ఎకరాలను ప్రభుత్వం అందజేసింది. ఈ భూముల్లో 180 ఎకరాలను జిందాల్ యాజమాన్యమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇది కాకుండా 375 మంది రైతుల నుంచి 834 ఎకరాల అసైన్డ్ భూమి, 151 ఎకరాల ప్రభుత్వ భూమిని జిందాల్‌కు కేటాయించారు. జిందాల్ కోసం ఒక్క ఎకరా కూడా రైతుల నుంచి సేకరించలేదు. 2013 భూసేకరణ చట్టం వర్తించదు. మొత్తం 28.72 ఎకరాలకు సంబంధించి 15 మంది రైతులకు ఉన్న బకాయిని వారం రోజుల్లో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 1962లో మొత్తం 20 మందికి పట్టాలు ఇచ్చారు. వారిలో నలుగురు మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నారు. వారి పట్టాలు మూడేళ్ల తరువాత రద్దువుతాయి. అటువంటి వారికి పరిహారం ఇవ్వాల్సిన పని లేదు. షేర్లు, ఉద్యోగ కల్పన, వన్‌టైం సెటిల్‌మెంట్‌కు సంబంధించి జిందాల్ యాజమాన్యమే రైతులతో నేరుగా ఒప్పందం కుదర్చుకుంది. దానితో ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినప్పటికీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు వారం రోజుల్లో పరిహారం ఇవ్వాలని జిందాల్ ప్రతినిధులకు ఆదేశించాం. 53 బోరు బావులకు సంబంధించి ఇంకా పరిహారాన్ని ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం పరంగా గాని, జిందాల్ నుంచి గాని ఎవరైనా అర్హులకు పరిహారం అందకపోతే అటువంటి వారు ఎస్.కోట తహసీల్దార్‌ను సంప్రదించాలి. కొందరు వ్యక్తులు వాస్తవాలను పక్కన పెట్టి రైతులకు మాయమాటలు చెప్పి, వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటాలను నమ్మవద్దు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం.’అని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, జేసీ సేతు మాధవన్, ఎస్.కోట తహసీల్దార్ డి.శ్రీనివాసరావు, డి.సెక్షన్ సూపరింటెండెంట్ తాడ్డి గోవింద తదితరులు పాల్గొన్నారు.