పోలవరం ఎడమ కాలువ పనుల్లో మళ్లీ కదలిక
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:25 AM
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పేరుతో అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చేపట్టనున్న పోలవరం ఎడమ కాలువ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది.
- మొదటి విడతగా రూ.100కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
- భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధం
-గ్రామాల్లో సభలు పెడుతున్న అధికారులు
- పలు డిమాండ్లు చేస్తున్న రైతులు
కొత్తవలస, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పేరుతో అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చేపట్టనున్న పోలవరం ఎడమ కాలువ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. ఈ కాలువ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పనుల పూర్తికి రూ.2వేల కోట్లతో అధికారులు అంచనాలు తయారు చేయగా, ప్రభుత్వం మొదటి విడతగా రూ.100 కోట్లు విడుదల చేసింది. కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గ్రామాల్లో సభలు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అభివృద్ధికి తాము ఆటంకం కలిగించమని, బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం తమకు నష్ట పరిహారం చెల్లించాలని, లేదంటే భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
ఉత్తరాంధ్ర జిల్లాలకు తాగు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2014లో టీడీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టింది. అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి, భూసేకరణ కూడా ప్రారంభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులను నిర్లక్ష్యం చేసింది. రైతుల నుంచి గతంలో సేకరించిన భూములకు సంబంధించి 2022లో గ్రామాల వారీగా నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, నిధుల కొరత కారణంగా ఎడమ కాలువ పనులు చేపట్టలేదు. ఒకపక్క సంవత్సరాలు గడిచిపోతున్నా పనులు ప్రారంభంకాకపోవడం, మరోపక్క సేకరించిన భూములకు పరిహారం చెల్లించకపోవడం, ఇంకొక్కపక్క ఆ భూములను విక్రయించుకోవడానికి వీలుకాకపోవడంతో జిల్లాలోని వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస మండలాల రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎడమ కాలువ పనులపై దృష్టి పెట్టింది. మొదటి విడతగా రూ.100 కోట్ల నిధులను విడుదల చేసింది. కాలువ నిర్మాణం కోసం ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో 100 మీటర్లు వెడల్పు వరకు, ఎగువ ప్రాంతాలలో 250 నుంచి 400 మీటర్లు వరకు వెడల్పు గల భూములను అధికారులు సేకరించారు. కాలువను 100 అడుగుల లోతు వరకు తవ్వడంతో పాటు గట్లు జారిపోకుండా కాంక్రీట్, రాయికట్టు నిర్మాణాలు చేపట్టనున్నారు. కాలువకు ఇరువైపులా వాహనాల రాకపోకల కోసం రోడ్డుని సైతం నిర్మించనున్నారు. ఈ పనులను ప్రాంతాల వారీగా విభజించి కొన్ని కనస్ట్రక్షన్స్ కంపెనీలకు అధికారులు అప్పగించారు. వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస మండలాల్లో చేపట్టే పనులను వీపీఆర్ కంపెనీకి అప్పగించారు. దీంతో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.
కాలువ నిర్మాణంతో మేలు..
పోలవరం ఎడమ కాలువ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పుతాయి. వ్యవసాయ భూములకు నీరందించడం కోసం పిల్ల కాలువలను ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా గ్రామాల్లో ఉన్న చెరువులను నీటితో నింపుతారు. తద్వారా రైతులు పంటలు పండించుకునే వీలుంటుంది. అలాగే గ్రామాల్లో భూగర్బ జలాలు పెరిగి, నీటి కొరత సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కాలువ నిర్మాణంతో వంద రైతు కుటుంబాలు నష్టపోయినా, వేయి కుటుంబాలకు మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
భూసేకరణకు వ్యతిరేకం కాదు
కొత్తవలస మండలం రామలింగపురంలో శుక్రవారం భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కళావతి ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తాము కోల్పోతున్న భూములకు సంబంధించి భూమికి భూమి ఇవ్వాలని, బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రామలింగపురంలో ఎకరా కోటి రూపాయల వరకు ఉందని, రోడ్డుపక్క ఉన్న భూములు రూ.2నుంచి రూ.3కోట్లు పలుకుతున్నాయని గ్రామానికి చెందిన రైతు నెక్కలనాయుడుబాబు అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధికి తాము ఆటంకం కలిగించమని, తమకు న్యాయం జరగకపోతే భూములు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చాలామంది రైతులు భూములను ల్యాండ్ కన్వర్షన్ చేయించుకున్నందున, వారికి ఏ ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లిస్తారో తెలియజేయాలని అన్నారు. రైతులు చెప్పిన ప్రతి అభిప్రాయాన్నీ రికార్డు చేసుకున్నామని, దీన్ని నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందజేస్తానని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కళావతి తెలిపారు. కార్యక్రమంలో డీటీ లావణ్య, కొత్తవలస ఆర్‌ఐ షణ్ముఖ, నీటిపారుదల శాఖ ఏఈ సుహాసిని, వీపీఆర్ కనస్ట్రక్షన్ ప్రతినిధి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.