ఉద్యమమే జీవితంగా.. పాటే ఊపిరిగా
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:30 AM
ఆయన గజ్జెకట్టి ఆడిపాడితే ఎవరైనా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఉద్యమమే జీవితంగా.. పాటే ఊపిరిగా జీవించారు ఆయన.
- బతికిన వంగపండు ప్రసాదరావు
- విలువలకు కట్టుబడి జీవనపోరాటం
- ఉద్యోగం వదిలి విప్లవ సంగీతంలోకి
- ‘జననాట్య మండలి’తో ప్రజల్లో చైతన్యం
- నేడు వర్ధంతి
పార్వతీపురం/రూరల్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆయన గజ్జెకట్టి ఆడిపాడితే ఎవరైనా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఉద్యమమే జీవితంగా.. పాటే ఊపిరిగా జీవించారు ఆయన. సిక్కోలు నక్సల్‌బరి ఉద్యమాన్ని తన గీతాలతో ఉరకలెత్తించారు. ఆయన ఆలపించిన ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. వంటి ఎన్నో పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. నమ్మిన సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి జీవనపోరాటం చేశారు. ప్రజా ఉద్యమానికి, కళా విప్లవానికి ఆయన జీవితం మార్గదర్శకం. తెలుగు జానపద విప్లవ సంగీత ప్రపంచంలో చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచారు. ఆయనే ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు. సోమవారం వంగపండు వర్ధంతి సదర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
- వంగపండు ప్రసాదరావు 1943 జాన్‌లో పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు జగన్నాథంనాయుడు, చినతల్లి. ఆయనకు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె వంగపండు ఉష ప్రముఖ జానపద గాయనిగా పేరుపొందారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని వైకేఎం కాలనీలో వంగపండు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఆయన జీవితంలో సింహభాగం విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో గడిచింది. అదేవిధంగా హైదరాబాద్‌లో గద్దర్‌తో ఎక్కువగా ఉండేవారు. విశాఖపట్నంలోని హిందూస్థాన్ ఫిష్‌యార్డులో 1976 నుంచి 99 వరకు ఉద్యోగం చేశారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, ఆరేగళ్లకు పైగా సర్వీసు ఉన్నా.. షిప్‌యార్డు ఉద్యోగానికి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి పాటే ఊపిరిగా పని చేశారు.
- జననాట్య మండలి స్థాపనలో వంగపండుది కీలకపాత్ర. 1972లో జననాట్య మండలి స్థాపనలో గద్దర్‌తో పాటు బి.నరసింగరావు సహకారం తీసుకున్నారు ఆయన. జననాట్య మండలి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం తదితర అంశాలపై కాళ్లకు గజ్జెలు కట్టి ఆడిపాడుతూ, ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రదర్శనలు నిర్వహించేవారు. తెలుగు, హిందీ తదితర భాషల్లో 400 పైగా పాటలు పాడిన చరి త్ర వంగపండుకు ఉంది. అనేక సినిమాలకు పాటలు రాయడంతో పాటు వాటిని ఆలపించారు. ‘యంత్రమెట్ట నడుస్తుందంటే’, ‘జజ్జనకర జనారే.. జనక జన జనారే’, ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’, నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో వంటి పాటలు ఆయనకు ఎంతో కీర్తిని తీసుకొచ్చాయి. ఈ పాటలు విప్లవ చైతన్యానికి గుర్తు నిలిచాయి. ఆయన రచించిన 30 పాటలు దేశంలో వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. ‘యంత్రమెట్ట నడుస్తుందంటే’ పాట ఇంగ్లీష్‌లోకి అనువాదమైంది. ఈ పాట అంతర్జాతీయంగా వంగపండుకు మంచి గుర్తింపు తెచ్చింది.
- కమ్యూనిటీ ఉద్యమంలో వంగపండు చురుకుగా పాల్గొనేవారు. శ్రీకాకుళం ఉద్యమం ప్రభావంతో సామాజిక సమస్యలపై స్పందనగా రచనలు ప్రారంభించారు. ఆయన పాడారంటే పాట వెనుక ఉద్యమం స్ఫూర్తి ఉండేదని ఉద్యమకారులు చెప్పుకొనేవారు. ఆయన పాట కోసం వేచిచూసే పరిస్థితి జననాట్య మండలి ప్రదర్శనలో ఉండేది. 2008లో బొల్లిమంద శిరామకృష్ణ మెమోరియల్ అవార్డు, 2017లో కళారత్న అవార్డును వంగపండు పొందారు.
- 2020 ఆగస్టు 4న అనారోగ్యంతో పార్వతీపురంలోని తన స్వగృహంలో వంగపండు కన్నుమూశారు. ఆయన జ్ఞాపకంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, ఏదైనా శాశ్వత నిర్మాణం చేపడతామని అప్పటి పాలకులు చెప్పారు. కానీ, నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై వంగపండు అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
ఆయన జ్ఞాపకాలతో జీవిస్తున్నా
నా భర్త అంటే నాకు ప్రాణం. ఆయన గజ్జెలు కట్టి పాట పాడి ఆడుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది. నా ఆరోగ్యం బాగోలేకపోయినా, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా.
-విజయలక్ష్మి, వంగపండు ప్రసాదరావు సతీమణి