‘టిడ్కో’ పనుల్లో కదలిక
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:14 AM
బొబ్బిలి పట్టణంలోని టిడ్కో ఇళ్ల పనుల్లో కదలిక వచ్చింది.
- కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు
- తాగునీటి రిజర్వాయరు, అంతర్గత రోడ్ల పనులు ప్రారంభం
- జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
బొబ్బిలి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలోని టిడ్కో ఇళ్ల పనుల్లో కదలిక వచ్చింది. కాంట్రాక్టర్‌కు బకాయిలు చెల్లించడంతో టిడ్కో కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు తాగునీటి రిజర్వాయరు నిర్మాణంతో పాటు అంతర్గత రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. వీటిని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఇంకా భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులు చేపట్టాల్సి ఉంది.
ఇదీ పరిస్థితి..
బొబ్బిలి మునిసిపాలిటీ రామన్నదొరవలస సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్కు సమీపంలో 31.69 ఎకరాల్లో 2,448 ఇళ్ల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 300 చదరపు అడుగుల్లో 1,344 ఇళ్లు, 365 చదరపు అడుగుల్లో 528 , 430 చదరపు అడుగుల్లో 576 ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో బ్లాకులో 48 ప్లాట్‌లు చొప్పున 51 బ్లాకులు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. హడ్కో రుణంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. ఒకట్రెండు వాయిదాల చొప్పున లబ్ధిదారుల నుంచి రూ.2.56కోట్లు వసూలు చేశారు. అలాట్ చేసిన 2,090 ప్లాట్లకు గాను రూ.7.39కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో రూ.2.26కోట్లు ఏటీపీటిడ్కోకు బదలాయించారు. 2018 డిసెంబరులో 2,090 మంది లబ్ధిదారులకు అప్పటి మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించారు. అప్పటికి 288 ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడ్కో గృహాలకు గ్రహణం పట్టింది. బేస్‌మెంట్ దశ దాటని వాటికి రివర్స్ టెండరింగ్ వేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2019లో ఉగాది నుంచి ఉచితంగా జగనన్న ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో టిడ్కో ఇళ్ల కోసం బ్యాంకు డిమాండ్ డ్రాప్టులు చెల్లించిన వారంతా తమ డబ్బులు వాపసు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ నేటికీ అతీగతీ లేకుండా పోయింది. 2024 ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులను పిలిచి కొత్త ఇళ్లలోకి వెళ్లిపోవాలని చెప్పింది. కనీసం నీటి వసతి, రోడ్లు, డైయిన్లు, వీధి దీపాలు వంటివి కల్పించకుండా ఇళ్లలోకి ఎలా వెళ్లాలని లబ్ధిదారులు ప్రశ్నించడంతో అప్పట్లో వైసీపీ నాయకులు, అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పించేందుకు చర్యలు చేపట్టింది. 250 కిలో లీటర్ల తాగునీటి సామర్థ్యం గల రిజర్వాయరు పనులను అధికారులు ప్రారంభించారు. అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం పెద్దఎత్తున జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. మరో 15 రోజుల్లో 1400మీటర్ల పొడవున రోడ్ల నిర్మాణం జరగనుంది.
జూన్ నాటికి పూర్తి..
వచ్చే ఏడాది జూన్ నాటికి అన్ని పనులూ పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. తాగునీటి రిజర్వాయర్, అంతర్గత రోడ్లు పనులు ప్రారంభమయ్యాయి. భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులు జరగాలి. రైల్వే అండర్ పాస్ నిర్మాణం ప్రతిపాదనకు అనుమతి రాలేదు. ఇప్పటికే విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం జరిగింది. ఆ శాఖకు రూ.4.50 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు జూన్ వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నాం.
-ఎస్.శశిధర్, టిడ్కో డీఈఈ