Share News

Movement.. be serious ఉద్యమం.. ఉధృతం

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:54 PM

Movement.. be serious జిందాల్‌ భూముల నిర్వాసిత రైతులకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. సీపీఎం, గిరిజన సంఘాలు పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. సమస్యను జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజు పలు రకాలుగా ప్రభుత్వం దృష్టిలో పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

Movement.. be serious ఉద్యమం.. ఉధృతం
తాటిపూడి రోడ్డులో బైఠాయించిన నిర్వాసిత రైతులు(ఫైల్‌)

ఉద్యమం.. ఉధృతం

మున్ముందుకు జిందాల్‌ భూ నిర్వాసితుల పోరాటం

మద్దతు ఇస్తున్న ప్రజా సంఘాలు

సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్న ప్రభుత్వం

భూములన్నింటినీ తిరిగి అప్పగించాలని రైతుల డిమాండ్‌

శృంగవరపుకోట, జూలై 7(ఆంధ్రజ్యోతి):

- శృంగవరపుకోట మండల పరిధిలోని జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ అల్యూమినియం లిమిటెడ్‌కు కేటాయించిన భూములను తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. భూమిలేని వారికి, చిన్న రైతులకు పంపిణీ చేయాలి. ఈనెల 5న భూసేకరణ గ్రామాలు ముషిడిపల్లి, కిల్తంపాలెం, చీడిపాలెం, చిన్నఖండేపల్లి, మూల బొడ్డవరకు చెందిన నిర్వాసిత రైతులను కలిశాం. పరిశ్రమ వస్తే ఉపాధి దొరకుతుందని ఆశపడి భూములిచ్చి మోసపోయినట్లు వాపోయారు. సేకరించిన భూమిని జిందాల్‌ యాజమాన్యం గడిచిన 18 సంవత్సరాలుగా నిరుపయోగంగా తన ఆధీనంలో ఉంచుకుంది. భూమిని కోల్పోయిన రైతులకు జీవనాధారం లేకుండా చేసింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 2023 ఫిబ్రవరి 20న అల్యూమినియం పరిశ్రమకు బదులుగా ఎంఎస్‌ఎంఈ పార్కు, ఇతర పరిరశ్రమలు ఏర్పాటు చేసుకోనేందుకు అనుమతులు తీసుకుంది. ఇది ప్రైవేటు సంస్థలకు నేరుగా లాభం చేకూర్చే చర్యగా నమ్ముతున్నాం. ఉపాది కోల్పోయిన రైతులకు భూమిని తిరిగి ఇచ్చేయాలని న్యాయపూర్వకంగా పోరాటం చేస్తుంటే పోలీసులతో బెదిరించడం దృరదృష్టకరం.

- మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, కార్యవర్గ సభ్యురాలు కె.అనురాధ, ఏపీ, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్‌ కృష్ణ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటన

జిందాల్‌ భూముల నిర్వాసిత రైతులకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. సీపీఎం, గిరిజన సంఘాలు పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. సమస్యను జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజు పలు రకాలుగా ప్రభుత్వం దృష్టిలో పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు, కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాదేవ్‌, ఓ దినపత్రిక అధిపతి రమణమూర్తి నిర్వాసిత రైతుల వద్దకు సోమవారం వచ్చారు. ఉద్యమానికి అండగా ఉంటామని సంఘీభావం తెలిపారు. ఇప్పటికే గిరిజన సంఘ నాయకుడు తమ్మి అప్పలరాజు దొర అండగా ఉంటున్నారు. వీరి సమస్యను గ్రీవెన్స్‌ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తున్నారు. సీపీఎం నాయకుడు చల్లా జగన్‌ నిత్యం నిర్వాసితులతో కలసి పోరాడుతున్నారు. మంగళవారం మానవ హక్కుల ప్రతినిధులు వస్తున్నట్లు సమాచారం. ఇలా అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తుండ డంతో జిందాల్‌ భూ నిర్వాసితులు తగ్గేదేలే అంటున్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.

2007లో భూముల అప్పగింత

జిందాల్‌ కోసం నాలుగు గ్రామాల పరిధిలో 834.66 ఎకరాల అసైన్డ్‌ భూమి, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమి, 180.73 ఎకరాల జిరాయితీ భూమి కలిపి 1166.43 ఎకరాలను సేకరించి 2007 జూన్‌ 28న అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రూ.4 వేల కోట్లతో అల్యూమినియం శుద్ధి కర్మాగారం (రిఫైనరీ, విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌)ను నిర్మిస్తామని జిందాల్‌ యాజమాన్యం భూములను తీసుకుంది. నాలుగేళ్లలో పరిశ్రమ నెలకొల్పుతామని చెప్పింది. అయితే ఈ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు బాక్సైట్‌ ఖనిజం అరకు, అనంతగిరి కొండల్లో ఉంది. బాక్సైట్‌ తవ్వకాలతో పర్యావరణం, అరకు పర్యాటకం దెబ్బతింటుందని గిరిజనులు వ్యతిరేకించారు. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు 2016లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాల జోలుకుపోబోమని స్పష్టం చేసింది. దీన్ని సాకుగా చూపిన జిందాల్‌ యాజమాన్యం పునాది రాయి కూడా వేయడం మానేసింది. ఇతర ప్రాంతాల నుంచి అయినా ముడిసరుకు బాక్సైట్‌ ఖనిజాన్ని తెప్పించుకొనే ప్రయత్నం చేయకుండా నిరుపయోగంగా భూమిని తమ ఆధీనంలో ఉంచేసింది. మరోవైపు భూమిని నమ్ముకొని జీవనం సాగించిన గిరిజన రైతులు ఆధారం కోల్పోయారు. ఖాళీ భూములను చూసి ఆవేదన చెందేవారు. వారంతా సాగు లేక.. పరిశ్రమల్లో ఉపాధికి అవకాశం లేక కూలి పనులకు వెళ్తున్నారు.

గత ప్రభుత్వంలో మరో మలుపు

అల్యూమినియం శుద్ధి కర్మాగారం కాకుండా ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఇతర పరిశ్రమలను స్థాపించేందుకు 2023 ఫిబ్రవరి 20న జీవో నెంబర్‌ 14 ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి 5ఎంజీడీ నీళ్లు, తెన్నుబొడ్డవర సబ్‌స్టేషన్‌ నుంచి 50ఎండబ్ల్యూ పవర్‌ సరఫరా కేటాయింపుతో వీఎంఆర్‌డీఏ అనుమతి పొందేందుకు ప్రతిపాదించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో బ్రేక్‌లు పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వం పారిశ్రామికీకరణకు మొగ్గు చూపుతోంది. ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది.

నిర్వాసిత రైతుల అభ్యంతరం

జిందాల్‌ యాజమాన్యం సమస్యలను పరిష్కరించకుండా, హామీలను నెరవేర్చకుండా ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఈ ప్రాంత రైతులకు చెందిన తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి నీరెలా పొందుతారని నిర్వాసిత రైతులు ప్రశ్నిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం జిందాల్‌ యాజమాన్యం ఈ భూములపై హక్కులు కోల్పోయిందంటున్నారు. తిరిగి తమ భూములను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమిస్తున్నారు.

ఎంఎస్‌ఎంఈ పార్కు కావాలంటున్న కొందరు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, భారతీయ జనాతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ఆర్‌కె ప్రసాద్‌లు కొంతమంది భూనిర్వాసితులు, నియోజకవర్గ పరిధిలోని యువతతో కలిసి ఎంఎస్‌ఎంఈ పార్కులను స్థాపించాలని జిందాల్‌ తాత్కాలిక కార్యాలయం వద్ద ఇటీవల ధర్నా చేశారు. వీరికి లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ సంఘీభావం తెలిపారు. నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి హామీని యాజమాన్యం నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారం రోజుల క్రితం ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణతో కలసి కలెక్టర్‌ అంబేడ్కర్‌ భూనిర్యాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నష్టపరిహారం అందని రైతుల వివరాల సేకరణ బాధ్యతలను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

మంత్రి వ్యాఖ్యలను పట్టించుకోని నిర్వాసితులు

జిందాల్‌ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల అంశం ప్రభుత్వం వద్ద లేనప్పుడు తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి వీటికి నీటి సరఫరా ఎలా చేస్తామని, కేవలం కొందరు వ్యక్తులు రైతులను రెచ్చగొడుతున్నారని రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. అతని మాటలను నిర్వాసిత రైతులు పట్టించుకోవడం లేదు. చివరకు జిందాల్‌ యాజమాన్యం, ప్రభుత్వం ఏవిధంగా పరిష్కారం చూపుతాయో చూడాలి.

Updated Date - Jul 07 , 2025 | 11:54 PM