Courage and Determination ధైర్య సాహసాలతో ముందుకు సాగాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:19 AM
Move Forward with Courage and Determination బాలలు ధైర్య సాహసాలతో ముందుకుసాగాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వీర బాల దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఘనంగా వీర బాల దివస్ వేడుకలు
పార్వతీపురం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బాలలు ధైర్య సాహసాలతో ముందుకుసాగాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వీర బాల దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పిల్లల్లోని ధైర్యసాహసాలను వెలికి తీయడమే దివస్ ముఖ్య ఉద్దేశం. జిల్లాలో పిల్లలు ఎంతో ధైర్యవంతులు. కొండలు, కోనలు, వాగులు దాటుకుంటూ పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థి ఒక వీరుడే. బాలికలు మరింత ధైర్యంగా ఉండాలి. వారికి మగపిల్లలు తోడుగా ఉంటూ రక్షణ కల్పించాలి. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసిస్తూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలి. శ్రీరాముడిని మించిన పురుషోత్తముడు ఎవరూ లేరు. రామరాజ్యం గురించి అందరూ తెలుసుకోవాలి. సత్యం, ధర్మం కోసం ప్రాణాలర్పించిన గురు గోవింద్‌సింగ్ నలుగురు కుమారుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. పిల్లలకు చదువుతో పాటు నైతిక విలువలను నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదం డ్రులపై ఉంది. ’ అని తెలిపారు. ముందుగా కలెక్టర్ ప్రాంగణంలో మంత్రి జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీలో పిల్లలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా బహుమతులు అందించారు. అనంతరం వన్‌స్టాప్ సెంటర్ నూతన వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. ఆపదలో ఉన్న మహిళలను వెంటనే చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వాహనం మంజూరు చేసిందన్నారు. వేధింపులకు గురవుతున్న మహిళలు 181 లేదా 100 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, డీఆర్వో హేమలత, ఐసీడీఎస్ జేడీ ఎం.శిరీషా తదితరులు పాల్గొన్నారు. ఫ బెలగాం: వీర బాల దివస్‌లో భాగంగా పార్వతీపురం లోని జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ ఆఽధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనంలోనే దేశం, ధర్మం కోసం ప్రాణాలర్పించిన సాహిబ్ జాదాల చరిత్ర నేటి తరం పిల్లలకి స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర విద్యాసంస్థలల్లో పిల్లలకు దేశ భక్తిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ నాగభూషణరావు తదితరలు పాల్గొన్నారు.