Move ahead with coordination సమన్వయంతో ముందుకువెళ్లాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:01 AM
Move ahead with coordination జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సూచించారు. పోలీసు కల్యాణ మండపంలో నార్కోటిక్ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టర్, ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది.
సమన్వయంతో ముందుకువెళ్లాలి
శాంతిభద్రతలను పరిరక్షించాలి
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం క్రైం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సూచించారు. పోలీసు కల్యాణ మండపంలో నార్కోటిక్ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టర్, ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ గంజాయి లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఎక్కడ గంజాయి సాగవుతున్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు గుర్తించినా పోలీసుశాఖకు సమాచారం అందించాలన్నారు. విద్య, ఉన్నత విద్య, సెట్విజ్, అనుబంధ శాఖలు సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వసతిగృహంలో కూడా గంజాయి వినియోగం లేకుండా యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ పోలీసులు నిర్వహించిన దాడుల్లో జిల్లాలో ఎక్కడా గంజాయి సాగువుతున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. రవాణా జరుగుతున్న 7 మార్గాలను గుర్తించి డైనమిక్ వాహన తనిఖీలను విస్తృతం చేస్తున్నామన్నారు. సమావేశంలో డ్రగ్స్ కంట్రోల్, అటవీశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా పరిషత్, అటవీశాఖ, రవాణా, అగ్నిమాపకశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, డీఎస్పీలు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
జనవరి నుంచి ఉచితంగా సౌర విద్యుత్
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్ అందించే పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఇంటిపై రెండు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకలను ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఏర్పాటు చేయనుందన్నారు. వీటిని లబ్ధిదారులకు త్వరితగతిన అందజేయాలని సూచించారు. ఈ పధకం అమలుపై శనివారం తన చాంబర్‌లో ఏపీఈపీడిసిఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావుతో పాటు సంబంధిత సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
అదనంగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు
జిల్లాలో అదనంగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణకు ప్రత్యేకంగా ఉద్యాన వన మిషన్ రూపొందించినట్లు కలెక్టరు రామసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న ఉద్దేశంతో సంప్రదాయ వరి పంటకు బదులుగా ఉద్యాన పంటలను సాగు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక మిషన్ రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 8047 చెరువుల్లో దాదాపు 10టిఎంసిలు సాగునీరు అందుబాటులో ఉందన్నారు. అలాగే జిల్లాలో భూగర్భ జలాలు సగటున 2.4 మీటర్ల లోతునే ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.