Share News

Mothers are in trouble! అమ్మకు కత్తిగాట్లు!

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:38 PM

Mothers are in trouble! జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు రిఫరల్‌గా మారాయి. పీహెచ్‌సీకి వెళితే సీహెచ్‌సీకి..సీహెచ్‌సీకి వెళితే ప్రాంతీయ ఆస్పత్రులకు...అక్కడ నుంచి జిల్లా కేంద్రాస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. వైద్య సిబ్బంది అన్ని వేళల్లో అందుబాటులోకి ఉండకపోవడం, అలసత్వం అమ్మను ఆపదలో పెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రికి తరలించే క్రమంలో 108 వాహనాల్లోనూ ప్రసవిస్తున్నారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు క్యాష్‌ చేసుకుంటున్నాయి. గర్భిణులు సిజేరియన్లకు అంగీకరించేలా వివిధ కారణాలు చూపుతూ భయపెడుతున్నాయి.

Mothers are in trouble! అమ్మకు కత్తిగాట్లు!

అమ్మకు కత్తిగాట్లు!

ప్రభుత్వాస్పత్రుల్లో కానరాని సుఖప్రసవాలు

రిఫరల్‌గా మారుతున్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు

ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ అదే తీరు

సిజేరియన్లతో సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు, కార్పొరేట్‌ వైద్యులు

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు జరగడం లేదు. దాదాపు 90 శాతం ఆపరేషన్లతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఈ విషయంలో తీరు మారాలి. సుఖ ప్రసవాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలి. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.

- శాసనసభలో సీఎం చంద్రబాబు నిర్దేశం

జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు రిఫరల్‌గా మారాయి. పీహెచ్‌సీకి వెళితే సీహెచ్‌సీకి..సీహెచ్‌సీకి వెళితే ప్రాంతీయ ఆస్పత్రులకు...అక్కడ నుంచి జిల్లా కేంద్రాస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. వైద్య సిబ్బంది అన్ని వేళల్లో అందుబాటులోకి ఉండకపోవడం, అలసత్వం అమ్మను ఆపదలో పెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రికి తరలించే క్రమంలో 108 వాహనాల్లోనూ ప్రసవిస్తున్నారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు క్యాష్‌ చేసుకుంటున్నాయి. గర్భిణులు సిజేరియన్లకు అంగీకరించేలా వివిధ కారణాలు చూపుతూ భయపెడుతున్నాయి.

విజయనగరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 48 పీహెచ్‌సీలు, నాలుగు సీహెచ్‌సీలు, నాలుగు ప్రాంతీయ ఆస్పత్రులు ఉన్నాయి. జనాభా ఆధారంగా గ్రామీణ పీహెచ్‌సీల్లో నెలకు 5 నుంచి 10 ప్రసవాలు, గిరిజన ప్రాంత ఆస్పత్రుల్లో 5 నుంచి 7 ప్రసవాలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కనీసం 5 ప్రసవాలు చేసినా.. ఏడాదికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2800కుపైగా ప్రసవాలు జరగాలి. కానీ మనకెందుకులే అనే నిర్లిప్తత గర్భిణులకు శాపంగా మారుతోంది. సకాలంలో వైద్యం అందక మాతా శిశు మరణాలు సైతం సంభవిస్తున్నాయి. దేశంలో అత్యధిక శస్త్రచికిత్సలు జరుగుతున్న రాష్ట్రంలో ఏపీ మూడోస్థానంలో ఉంది. అదే రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఐదో స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయంపై శాసనసభలో ఇటీవల సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆవేదన చెందారు. మార్పు రావాలని వైద్య ఆరోగ్య శాఖకు నిర్దేశించారు.

ప్రభుత్వ వైద్యానికి సంబంధించి ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు, ముగ్గురు వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఫార్మాసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఆరోగ్య సహాయకులు, ఆశాలు, 108, 104 సిబ్బంది సైతం ఉన్నారు. కానీ సుఖప్రసవాలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీనిపై ప్రజల్లో అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. అవగాహన పెంచాల్సిన యంత్రాంగం తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది. గత ఏడాది జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన సుఖ ప్రసవాలు కేవలం 776 మాత్రమే. ప్రైవేటు ఆస్పత్రుల్లో 20,501 ప్రసవాలు జరగ్గా 11,999 సాధారణ, 8,502 శస్త్రచికిత్సల ద్వారా ప్రసవాలు చేశారు.

భారమైనా తప్పదు..

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్న వారికి వైద్య సిబ్బంది నుంచి సరైన సహకారం లేకుండా పోతోంది. అందుకే భారమైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేయిస్తున్నారు. మరోవైపు జాతకాలు, ఇతర నమ్మకాలతోనూ కొందరు ముందస్తు ప్రసవాల వైపు మొగ్గుచూపుతున్నారు. సుఖ ప్రసవం కోసం ఎవరూ ఎదురుచూడడం లేదు. ఆగస్టు 15, జనవరి 1 వంటి పర్వదినాల నాడు ప్రసవాలు చేయించిన వారూ ఉన్నారు. పెద్దల పేరిట సెంటిమెంట్‌ అని ఒకరు.. చనిపోయిన పూర్వీకుల పుట్టిన రోజు అని మరొకరు.. ఇలా ముందస్తు ప్రసవాలకు మొగ్గుచూపుతున్నారు. అటు కాసుల కక్కుర్తిపడుతున్న వైద్యులు సైతం ప్రసవాల కోసం వెళుతున్న వారి మైండ్‌లో ఏవేవో ఆలోచనలు కలిగిస్తున్నారు. దీంతో కుటుంబసభ్యులు సైతం సుఖ ప్రసవాలు అన్న విషయాన్నే మరిచిపోతున్నారు. సాధారణంగా ఆస్పత్రులకు వెళుతుంటే ‘రక్తం తగ్గిందని, బిడ్డ ఉమ్మనీరు తాగేసిందని, బరువు ఎక్కువగా ఉందని, రక్తపోటు అధికమైందని, బిడ్డ అడ్డం తిరికిందని’ ఇలా రకరకాల కారణాలు చెబుతూ అమ్మ కడుపుకు కత్తి గాట్లు పెడుతున్నారు. లక్షల రూపాయల ఫీజులూ వసూలు చేస్తున్నారు.

ఆపరేషన్‌కే ప్రాధాన్యం

గర్భిణీకి శస్త్రచికిత్స చేస్తే అందుకు గల కారణాలను రిపోర్టులో స్పష్టంగా రాయాలి కానీ అనారోగ్య కారణాలు చూపుతూ ఇష్టారాజ్యంగా శరీరంపై కత్తిగాట్లుపెడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా.. అత్యవసరమని చెప్పి శస్త్రచికిత్సలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సర్జరీ చేసి బిడ్డను ప్రమాదకరంగా బయటకు లాగుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో గత మూడేళ్లలో సాధారణ ప్రసవాలు 25 వేలకు మించి జరగలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గర్భిణీని తొలి నుంచి పరిశీలించాలి. ఎప్పటికప్పుడు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పరీక్షలు చేయాలి. ఆశా కార్యకర్తలు నిత్యం పరిశీలించాలి కానీ జిల్లాలో ఈ తంతు సరిగా జరగడం లేదు. శని, ఆదివారాలు వస్తే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు కనిపించడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. హైరిస్క్‌ కేసులను ముందుగానే గుర్తించి పెద్దాస్పత్రులకు రిఫర్‌ చేయాలి కానీ అలా జరగడం లేదు. అందుకే చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రుల ముఖమే చూడడం మానేస్తున్నారు.

సుఖ ప్రసవాలపై ఆదేశాలిచ్చాం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు పెరగాలి. కచ్చితంగా దీనిని పాటించాలని ఆదేశాలిచ్చాం. వీలైనంత వరకూ సుఖ ప్రసవాలు చేయాలి. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఇబ్బందని తెలిస్తేనే ఆపరేషన్లు చేయాలి. ముందస్తు ప్రసవం అనేది తల్లీబిడ్డల అనారోగ్యానికి ఒక హేతువు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప.. ముహూర్తాలకు ప్రసవాలు చేయించడం నేరం. వీలైనంత వరకూ సుఖ ప్రసవాల కోసం ఎదురుచూడాలి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి.

- జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం

======================

Updated Date - Sep 25 , 2025 | 11:38 PM