Share News

More than three years of waiting! మూడేళ్లకుపైగా నిరీక్షణ!

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:57 PM

More than three years of waiting!

More than three years of waiting! మూడేళ్లకుపైగా నిరీక్షణ!

మూడేళ్లకుపైగా నిరీక్షణ!

కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు వచ్చి నాలుగు నెలలు

అయినా ప్రారంభం కాని శిక్షణ

ఉమ్మడి జిల్లాలో 133 మంది అభ్యర్థుల ఎదురుచూపులు

రాజాం, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి):

ఒకటి కాదు.. రెండు కాదు నాలుగేళ్లుగా ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఫలితాలు వచ్చి నాలుగు నెలలు అవుతున్నా శిక్షణ ప్రారంభం కాకపోవడంతో అసహనంతో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో కానిస్టేబుళ్లగా ఎంపికైన 133 మంది పరిస్థితి ఇది. ఈ ఏడాది ఆగస్టు 1న పోలీస్‌ శాఖ ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరులో శిక్షణ ప్రారంభించి మూడు నెలల్లో పోస్టింగ్‌ ఇస్తామని చెప్పింది కానీ నాలుగు నెలలు గడుస్తున్నా అతీగతీ లేకపోవడంతో అభ్యర్థుల్లో ఒకటే ఆందోళన.

రాష్ట్రంలో సుదీర్ఘకాలం కొనసాగిన కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ ఇదే. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పిదానికి పాల్పడింది. ఏటా జాబ్‌ కాలెండర్‌ అంటూ 2019 ఎన్నికల ప్రచారంలో ఆర్భాటం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక జాబ్‌ కాలెండర్‌ ఒకసారి కూడా విడుదల చేయలేకపోయారు. 2022 నవంబరులో రాష్ట్ర వ్యాప్తంగా 6100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో ఉమ్మడి జిల్లాకు 133 పోస్టులు కేటాయించారు. అయితే ప్రాథమిక రాత పరీక్షను నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం తరువాత చేతులెత్తేసింది. అభ్యర్థులు విన్నపాలు చేసినా కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంది. ఈ తరుణంలో కూటమి అధికారంలోకి రావడంతో కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి న్యాయ చిక్కుముడులను పరిష్కరించి ఈవెంట్స్‌తో పాటు తుది రాత పరీక్ష నిర్వహించింది. ఆగస్టులో ఫలితాలు ప్రకటించింది. కానీ నాలుగు నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని.. కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందనుకుంటే.. శిక్షణలో జాప్యం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- కానిస్టేబుళ్ల నోటిఫికేషన్‌ జారీ చేసి మూడేళ్లు దాటి దాదాపు నాలుగేళ్లు సమీపిస్తోంది. ప్రభుత్వ కొలువు కావడంతో వందలాది మంది పోస్టు గ్రాడ్యుయేషన్‌ అభ్యర్థులు సైతం జిల్లాలో పోటీపడ్డారు. ఈ మూడేళ్లలో ఎన్నో రకాల వ్యయప్రయాసలకు గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించి ప్రైవేటు ఉద్యోగాల వైపు వెళ్లలేదు. వారంతా కానిస్టేబుళ్ల శిక్షణ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లా పోలీస్‌ వర్గాలు మాత్రం ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభించే అవకాశమున్నట్టు చెబుతున్నారు. వీలైనంత త్వరగా శిక్షణను ప్రారంభించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

-----------------------

Updated Date - Dec 02 , 2025 | 11:57 PM