లక్ష్యం ఎక్కువ.. కొనుగోలు తక్కువ
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:23 AM
జిల్లాలో ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని.. గత ఏడాది కంటే వేగవంతంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారు.
- ధాన్యం సేకరణలో జాప్యం
- ఇప్పటి వరకు 7,800 మెట్రిక్ టన్నులే కొనుగోలు
- ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడుతున్న వ్యాపారులు
- రైతుల శ్రమను దోచుకుంటున్న దళారులు
పార్వతీపురం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని.. గత ఏడాది కంటే వేగవంతంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ ఏడాది 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 7,800 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయానికి 9వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నా రైతులు మాత్రం వ్యాపారులకు అధికంగా విక్రయిస్తున్నారు. దీనివల్ల కొనుగోలు లక్ష్యం తగ్గుతుంది. వాస్తవానికి ప్రభుత్వం క్వింటా సాధారణ రకం ధాన్యం రూ.2,369, గ్రేడ్-1 రకం రూ.2,389 చెల్లిస్తుంది. 80కేజీల బస్తాకు సాధారణ రకం రూ.1,895, గ్రేడ్-1 రకం రూ.1,911 ధర అందిస్తుంది. శాసీ్త్రయ పద్ధతిలో తేమ, ఈలింగ్ మొదలగు నాణ్యత ప్రమాణాలను పరిశీలించి అందుకు అనుగుణంగా ధాన్యం ఉంటేనే ఈ మద్దతు ధర లభిస్తుంది. అయితే, ఈ నిబంధనల కారణంగా జిల్లాలో చాలామంది రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు రైతులు సాగు పెట్టుబడి కోసం వ్యాపారుల వద్ద ముందుగానే అప్పు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారికే ధాన్యం విక్రయించాల్సి వస్తోంది. వీరు కొనుగోలు చేసిన ధాన్యం ఇతర జిల్లాల్లోని మిల్లులకు తరలి వెళుతున్నాయి. మరికొన్ని గ్రామాల్లో దళారులు రంగ ప్రవేశం చేసి రైతులను దోచుకుంటున్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి తమకు నచ్చిన వ్యాపారికి నచ్చిన రేటుకు విక్రయించుకుంటున్నారు. ప్రస్తుతం రైతుల ఆర్థిక అవసరాలు దళారుల పాలిట కాసుల పంటగా మారింది.
రూ.25 కోట్లకే పరిమితమైన బ్యాంక్ గ్యారెంటీలు..
మిల్లర్లు తమ బ్యాంకు గ్యారెంటీలను ఇప్పటివరకు రూ.25 కోట్ల వరకే అందించారు. జిల్లాలో 104 రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో కేవలం 50 మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు అందించాయి. బ్యాంకు గ్యారెంటీలు రూ.200కోట్లు రావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేవలం రూ.25 కోట్లు మాత్రమే వచ్చాయంటే ధాన్యం కొనుగోలు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇలా అయితే ప్రభుత్వ లక్ష్యాలు ఏ విధంగా నెరవేరుతాయో అధికారులకే తెలియాలి. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
వేగవంతంగానే చేపడుతున్నాం..
జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగానే చేపడుతున్నాం. గత సంవత్సరం ఇదే సమయానికి 9 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. ఈ ఏడాది ఇప్పటి వరకు 7,800 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. బ్యాంకు గ్యారెంటీలను ఇప్పటివరకు 50 మంది మిల్లర్లు అందించారు. ఈ ఏడాది 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని చేరుకుంటాం.
-శ్రీనివాసరావు, జిల్లా సివిల్ సప్లయిస్ శాఖ, మేనేజర్