Share News

More funds for the development of Gandhi Parkగాంధీపార్కు అభివృద్ధికి మరిన్ని నిధులు

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:20 AM

More funds for the development of Gandhi Park

More funds for the development of Gandhi Parkగాంధీపార్కు అభివృద్ధికి మరిన్ని నిధులు
సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌, పక్కన కమిషనర్‌ నల్లనయ్య

గాంధీపార్కు అభివృద్ధికి మరిన్ని నిధులు

సమస్యల పరిష్కారానికి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ కృషి అభినందనీయం

కలెక ్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

పార్కులో మరిన్ని సౌకర్యాలు: కమిషనర్‌ పి.నల్లనయ్య

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్వర్క్‌, ఆగస్టు12 (ఆంధ్రజ్యోతి): గాంధీపార్కు అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ హామీ ఇచ్చారు. సమస్యలను గుర్తించడంతో పాటు పరిష్కారానికి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ సంయుక్తంగా మంగళవారం 43వ డివిజన్‌ పరిధిలోని గాంధీపార్కులో సదస్సు ఏర్పాటు చేశాయి. జనవరి 8న కూడా ఇదే పార్కులో స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు సభ ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత అధికారులు స్పందించి ఆ ప్రాంతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించారు. గాంధీ పార్కు అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి స్థానికులతో చర్చించేందుకు అక్షరం అండగా పరిష్కారమే అజెండా కార్యక్రమంలో భాగంగా మంగళవారం సదస్సు ఏర్పాటు చేశాయి. కార్యక్రమానికి కలెక్టర్‌ అంబేడ్కర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీపార్కు అభివృద్ధికి వీఎంఆర్‌డీఏ రూ.35 లక్షల 85 వేలు కేటాయించిందని, పార్కు, పరిసర ప్రాంతాల చుట్టూ గ్రీనరీని అభివృద్ధి చేయాలని ఇందుకు నగరపాలక సంస్థ కొంత మొత్తాన్ని కేటాయించాలన్నారు. ప్రభుత్వం తరపున గాంధీ పార్కులో గ్రీనరీ అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య మాట్లాడుతూ, విజయనగరం అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో ముందుకు వెళ్తున్నామన్నారు. నగరంలోని పీఎస్‌ఆర్‌ పార్కునకు ఎకరా 60 సెంట్ల స్థలం ఉండగా, ఉడాకాలనీలో 70 సెంట్ల విస్తీర్ణంలో గాంధీ పార్కు ఉందన్నారు. పార్కులకు కలెక్టరు అంబేడ్కర్‌, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, వీఎంఆర్‌డీఏ అధికారులు నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమై పార్కులు మరిన్ని సౌకర్యా లతో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా పేరుతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ సంస్థలు నిర్వహించిన కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. గాంధీ పార్కునకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించామన్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టరు జేసీ నాయుడు మాట్లాడుతూ, సమస్యలను ఎత్తిచూపడంతో పాటు పరిష్కారానికి కృషి చేస్తున్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని అభినందించారు. 43వ డివిజన్‌ కార్పొరేటర్‌ దాసరి సత్యవతి మాట్లాడుతూ, గాంధీ పార్కు అభివృద్ధికి వీఎంఆర్‌డీఏ, నగరపాలకసంస్థ, కలెక్టరు అంబేడ్కర్‌, ఎమ్మెల్యే అదితి గజపతిరాజులు సహకరించడం ప్రశంసనీయమన్నారు. వీఎంఆర్‌డీఏ రూ.35 లక్షల 85 వేలు కేటాయించడం హర్షణీయమన్నారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బ్రాంచి మేనేజరు సోమశంకరరావు మాట్లాడుతూ, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ సంస్థలు నిరంతరం ప్రజల పక్షానే ఉంటాయన్నారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపడమే కాకుండా అవి పరిష్కారం అయ్యే వరకు కృషిచేస్తున్నాయన్నారు. కేవలం వార్తలకే పరిమితంకాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు.

స్పందించిన వీఎంఆర్‌డీఏ

గాంధీపార్కు అభివృద్ధికి వీఎంఆర్‌డీఏ (విశాఖ మెట్రో పాలిటిన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) తాజాగా రూ.35 లక్షల 85 వేలు కేటాయించింది. ఇటీవల ఆ పనులకు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.నల్లనయ్యలు శంకుస్థాపన చేశారు. ‘అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ద్వారా జనవరిలో గాంధీ పార్కులో ఉన్న సమస్యలను, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు, నేతల దృష్టికి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. దీనికి స్పందనగా వీఎంఆర్‌డీఏ నిధులు విడుదల చేసింది.

-----------------

Updated Date - Aug 13 , 2025 | 12:20 AM