No Action? నెలలు గడుస్తున్నా .. చర్యలేవీ?
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:44 PM
Months Are Passing… Yet No Action? జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ప్రజలకు బెంబేలెత్తిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడులు చేస్తూ.. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఈ ఘటనల్లో కొందరు మృత్యువాత పడుతున్నారు. ఏటా వందల సంఖ్యలో బాధితులు పెరుగుతున్నా.. వీధి కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు చేపడు తున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటి నియంత్రణకు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొంది.
కనిపించిన వారిపై దాడులు
ఏటా వందల సంఖ్యలో బాధితులు
ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేయాలని సుప్రీం కోర్టు ఆదేశం
స్పందించని జిల్లా యంత్రాంగం
తాజాగా మునిసిపల్ శాఖ కీలక ఆదేశాలు
జియ్యమ్మవలస/పాలకొండ, నవంబరు17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ప్రజలకు బెంబేలెత్తిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడులు చేస్తూ.. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఈ ఘటనల్లో కొందరు మృత్యువాత పడుతున్నారు. ఏటా వందల సంఖ్యలో బాధితులు పెరుగుతున్నా.. వీధి కుక్కల నియంత్రణకు కఠిన చర్యలు చేపడు తున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటి నియంత్రణకు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొంది. ప్రధాన రహదారులు, కూడళ్లలో వీధి కుక్కలు కనిపించకుండా సంరక్షణ కేంద్రాలకు తరలించాలని సూచించింది. అయితే ఇప్పటివరకు జిల్లాలో ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. తాజాగా మునిసిపల్ శాఖ కార్యదర్శి ఆదేశాలతోనైనా అధికారులు కదులుతారా? లేరా? అన్నది వేచి చూడాలి.
బాధితులు ఇలా..
జిల్లాలో గత మూడేళ్లలో కుక్క కాటుకు గురైన వారు 12,831 మంది. 37 పీహెచ్‌సీలు, ఐదు అర్బన్ ఆరోగ్య కేంద్రాలు, మూడు సీహెచ్‌సీలు, మూడు ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్రాసుపత్రిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న వారు ఇంకొందరు ఉన్నారు. గత మూడేళ్లలో పార్వతీపురం, సీతానగరం మండలాల్లోనే ఎక్కువగా కుక్క కాట్లు కేసులు నమోదయ్యాయి. పార్వతీపురం మండలంలో 4,783 , సీతానగరం మండలంలో 1,856 కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే జిల్లాలో రేబిస్ వ్యాధి వలంల మరణించిన వారు ఎవరూ లేరని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఒక్క జియ్యమ్మవలస మండలంలో మాత్రం వీధి కుక్కల దాడిలో పలువురు మృతి చెందగా.. ఇంకొందరు గాయాలపాలై ఆసుపత్రుల్లో చేరారు.
- 2024, మే 11న గవరమ్మపేట పంచాయతీ వెంకటరాజపురం గ్రామానికి చెందిన బంటు లక్ష్మి (70)పై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆమె మరణించింది.
- అదే ఏడాది మే 28న కుక్కల దాడికి గురై బిత్రపాడుకి చెందిన నీరస శంకరరావు (39) మరణించాడు.
-నవంబరు 11న వెంకటరాజపురానికి చెందిన కందేన పారమ్మ కూడా కుక్కల దాడిలో గాయాలపాలై మృతి చెందింది.
- అదే గ్రామానికి చెందిన అలజంగి మహేశ్వరి, గుర్రాల సరోజని, కర్రి పోలమ్మ వేర్వేరు సంఘటనల్లో కుక్కల దాడికి గురై క్షతగాత్రులుగా మారారు. బిత్రపాడు పంచాయతీ నిమ్మలపాడు గ్రామానికి చెందిన గలావిళ్లి పార్వతికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
- జిల్లాలో ఏడు పశు వైద్యశాలలు, 38 పశు వైద్య చికిత్సాలయాలు, 35 గ్రామీణ పశు యూనిట్ల పరిధిలో ఎక్కడా వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు జరిగిన దాఖలాలు లేవు. దీనిపై గతంలో పశు సంవర్థకశాఖకు ప్రభుత్వాలు ఆదేశించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గత మూడేళ్లుగా వీధి కుక్కల సంఖ్య మరింత పెరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ..
వీధి కుక్కల నియంత్రణ విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని పలు మార్గదర్శకాలు చేసింది. దీని ప్రకారం..
- రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విద్యా సంస్థలు, క్రీడా మైదానాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చూడాలి. వాటిని షెల్టర్లకు తరలించాలి.
- వాటికి సంతాన నిరోధక శస్త్ర చికిత్స చేసిన తరువాత అదే ప్రదేశంలో వదిలి పెట్టరాదు.
- వీధి కుక్కలు ప్రవేశించకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, క్రీడా మైదానాలు, డిపోల్లో పకడ్బందీగా ఫెన్సింగ్ లేదా భద్రత ఏర్పాట్లు చేయాలి.
- వీధి కుక్కలను పట్టుకునే బాధ్యత మున్సిపాలిటీలు, పంచాయతీలదే.
- ప్రతి మూడు నెలలకొకసారి అధికారులు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తనిఖీ చేసి వీధి కుక్కలు లేవని నిర్ధారించుకోవాలి.
కమిటీలు సహకరించాలి
వీధి కుక్కల నియంత్రణకు యాంటీ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) చేయాలి. ముందుగా మున్సిపాలిటీలు, పంచాయతీలలో సంబంధిత అధికారులు కమిటీలు వేయాలి. వారు ఈ కుక్కలను పట్టుకుంటే.. మా పశు వైద్యాధికారులు, సిబ్బంది వచ్చి వాటికి శస్త్ర చికిత్సలు చేస్తారు.
- మన్మథరావు, జేడీ, జిల్లా పశు సంవర్థక శాఖ