Share News

‘money’ problems in panchayaie ఆ నిబం‘ధన’ అమలేదీ?

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:54 PM

‘money’ problems in panchayaie శృంగవరపుకోట పంచాయతీలో 9 మంది శాశ్వత పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరికి తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వలేదు. 36 మంది పారిశుధ్య కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. వీరికి ఐదు నెలల బకాయిలుండగా దసరాకు ముందు మూడు నెలల జీతాలు చెల్లించారు.

‘money’ problems in panchayaie ఆ నిబం‘ధన’ అమలేదీ?
ఎస్‌.కోట మేజర్‌ పంచాయతీ కార్యాలయం

ఆ నిబం‘ధన’ అమలేదీ?

పంచాయతీలకు బకాయిలు చెల్లించని రిజిస్ర్టేషన్‌ శాఖ

నిధులు విదల్చని వీఎంఆర్‌డీఏ

అభివృద్ధి పనుల్లో పల్లెలు వెనకబాటు

పారిశుధ్య కార్మికుల వేతన చెల్లింపులకూ ఇబ్బందులు

- శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీకి రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి గత ఏడాది డిసెంబర్‌ నెలాఖరు వరకు రూ.36 లక్షల సర్‌చార్జీ రావాల్సి ఉంది. అప్పటికి ఏడాదిన్నర కాలంగా ఈ పంచాయతీకి బకాయిలు చెల్లించలేదు. ఈ ఏడాది ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయాయి. వీటిని కలుపుకుంటే రూ.50లక్షలకు పైబడి రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి చెల్లింపులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

- శృంగవరపుకోట పంచాయతీ నుంచి ఇంతవరకు(2021 నుంచి) వీఎంఆర్‌డీఏకు ఇళ్ల నిర్మాణదారులు రూ.22.02లక్షలు చెల్లించారు. ఈ పంచాయతీ వీఎంఆర్‌డిఏ పరిధిలోకి చేరిన నాటి నుంచి ఇంటి నిర్మాణం కోసం పంచాయతీకి చెల్లిస్తున్న పన్నుతో పాటు వీఎంఆర్‌డీఏకు నిబంధనల ప్రకారం రుసుం కడుతున్నారు. ఈ సంస్థ ఖాతాకు చెక్కులు తీసి పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఆదాయాన్ని పొందుతున్న వీఎంఆర్‌డీఏ నిబంధనల ప్రకారం పంచాయతీ అభివృద్ధికి పైసా విదల్చడం లేదు.

శృంగవరపుకోట, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి):

శృంగవరపుకోట పంచాయతీలో 9 మంది శాశ్వత పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరికి తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వలేదు. 36 మంది పారిశుధ్య కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారు. వీరికి ఐదు నెలల బకాయిలుండగా దసరాకు ముందు మూడు నెలల జీతాలు చెల్లించారు. పారిశుధ్య కార్మికులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి రావాల్సిన వాటాలు, వీఎంఆర్‌డీఏ నిధులు విదల్చకపోవడంతో జిల్లాలోని పంచాయతీలపై పడుతున్న ఆర్థిక భారానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. పంచాయతీలకు ఇతర మార్గాల్లో అందాల్సిన సహకారం ఎంతోకొంత అందితే కనీసం పారిశుధ్య కార్మికులకైనా జీతాలు ఇవ్వగలవు. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులే ఆధారం. ఈ నిధులు అందించడంలోనూ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా అందాల్సిన నిధులను ఇవ్వకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాటిని పక్కదారి పట్టించింది. దీంతో పంచాయతీలు తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి రోజువారీ కార్యకలాపాలు చేసేందుకు కూడా నానా తంటాలు పడుతున్నాయి. పల్లెల్లో రోడ్ల సదుపాయాలైతే పూర్తిగా విస్మరించారు. ఇటు అభివృద్ధి కుంటుపడింది. దీనికి తోడు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులూ అందడం లేదు.

రూ.34 కోట్లు బకాయి

జిల్లాలోని పంచాయతీలకు దాదాపు రూ.34 కోట్ల వరకు రావాల్సి ఉందని అంచనా. భూములు, ఇతర ఆస్తుల అమ్మకం, కొనుగోలుదారుల నుంచి రిజిస్ట్రేషన్‌ శాఖ స్టాంప్‌ డ్యూటీ వసూలు చేస్తుంది. కొనుగోలు, అమ్మకం జరిగిన భూమి విలువలో 6.5 శాతం సర్‌చార్జీ కింద తీసుకుంటారు. ఇందులో 5శాతం ప్రభుత్వ ఖజానాకు, మిగిలిన 1.5శాతంలో అయిదింట మూడోంతులు పంచాయతీలకు, ఒక వంతు మండల పరిషత్తుకు, ఒక వంతు జిల్లా పరిషత్‌కు బదిలీ చేయాలి. 2023-2024 నుంచి ఇంతవరకు ఈ నిధుల సర్దుబాటు జరగనట్లు తెలుస్తోంది. రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే వాటా సొమ్మును అభివృద్ధి పనులతో పాటు పంచాయతీకి అవసరమైన అన్నింటికీ ఖర్చుపెట్టుకొనే అధికారం ఉంది. కానీ ఆ నిధులు ఇవ్వడం లేదు.

- జిల్లాలో శృంగవరపుకోట, కొత్తవలస, చీపురుపల్లి, గజపతినగరం మేజర్‌ పంచాయతీలు పట్టణ రూపురేఖలతో కనిపిస్తున్నాయి. కాలనీలు విస్తరిస్తున్నాయి. పారిశుధ్య నిర్వహణకు కార్మికులు 30 నుంచి 70 మంది వరకు అవసరమవుతున్నారు. వీరికి సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది.

పట్టించుకోని వీఎంఆర్‌డీఏ

విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఎ) పరిధిలో జిల్లాలోని అత్యధిక శాతం పంచాయతీలున్నాయి. వీటిలో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టాలన్నా నిబంధనల ప్రకారం వీఎంఆర్‌డీఏకు రుసుం చెల్లించాలి. పంచాయతీల్లో రూపుదిద్దుకుంటున్న లేఅవుట్‌లకు వీఎంఆర్‌డీఏ అనుమతులు ఉంటేనే చట్టబద్ధత ఉంటుంది. ఇలా పంచాయతీల్లో ఉన్న ఆస్తుల నుంచి వీఎంఆర్‌డీఏ ఆదాయాన్ని పొందుతోంది. అందులో నుంచి పంచాయతీల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు కేటాయించడం లేదు.

Updated Date - Oct 13 , 2025 | 11:54 PM